రంగుల కేళి

ABN , First Publish Date - 2020-03-06T05:15:29+05:30 IST

ఋతువుల్లో మొదటిది వసంతం. ఆ వసంత కాలాన్ని స్వాగతిస్తూ చేసుకొనే రంగుల వేడుక హోలీ. ఇది కేవలం సరదా వినోదాల వేడుక కాదు..

రంగుల కేళి

ఋతువుల్లో మొదటిది వసంతం. ఆ వసంత కాలాన్ని స్వాగతిస్తూ చేసుకొనే రంగుల వేడుక హోలీ. ఇది కేవలం సరదా వినోదాల వేడుక కాదు. పౌరాణికంగానూ ఎన్నో విశిష్టతలున్న పండుగ. 


ఫాల్గుణ శుద్ధ పౌర్ణమిని ‘హోలీ పున్నమి’ అంటారు. ‘డోలికా పున్నమి’, ‘అనంగ పౌర్ణమి’... ఇలా ఈ రోజును అనేక పేర్లతో వ్యవహరిస్తారు. 


పండుగ వెనుక పురాణ కథలు

ఈ పండుగ వెనుక ఎన్నో కథలున్నాయి. వాటిలో ఒకటి ప్రహ్లాదుడి కథతో ముడిపడి ఉంది. దాని ప్రకారం, రాక్షసులకు రాజైన హిరణ్యకశిపుడు దైవ ద్వేషి.  అతని కొడుకు ప్రహ్లాదుడు దీనికి పూర్తిగా వ్యతిరేకం. నిత్యం హరి నామస్మరణ చేస్తూ ఉండేవాడు. ఇది నచ్చని హిరణ్యకశిపుడు తన కుమారుడిని చంపించాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు. ఒక సందర్భంలో ప్రహ్లాదుణ్ణి మంటల్లో వేసి చంపాలని నిర్ణయించుకొని తన సోదరి హోళికను రప్పించాడు. హోళికకు మంటల్లో పడినా బతికి బయటపడే వరం ఉంది. ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని మంటల్లో దూకింది. అయితే మహా విష్ణువు కృపతో ప్రహ్లాదుడు క్షేమంగా మంటల్లో నుంచి బయటపడ్డాడు. హోళిక సజీవ దహనమైపోయింది. రాక్షసి అయిన హోళిక మరణించినందుకు సంతోషిస్తూ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. దీనికి చిహ్నంగా హోళికా దహనాన్ని కొన్ని ప్రాంతాల్లో  జరుపుతారు.


మరో కథనం ప్రకారం, కృతయుగంలో రఘు మహారాజు పరిపాలిస్తున్న కాలంలో హోళిక అనే రాక్షసి ఊళ్ళలోకి వచ్చి పిల్లల్ని ఎత్తుకుపోయేది. ప్రజలు వచ్చి రాజుకు మొరపెట్టుకోగా, ఆ రాక్షసిని రఘు మహరాజు సంహరించాడు. అప్పుడు ప్రజలు చేసుకున్న వేడుకలే హోలీగా మారాయి. కాగా. శివుడి తపస్సును భగ్నం చెయ్యడానికి మన్మధుడు ప్రయత్నించగా, అతణ్ణి శివుడు మూడో కన్ను తెరచి దగ్ధం చేసిన రోజు ఇదేనన్న విశ్వాసం ఉంది. అందుకే హోలీ రోజున కామదహనం జరుపుతారు. ఈ రోజుకు ‘అనంగ పౌర్ణమి’గా పేరు కూడా అందుకే వచ్చిందంటారు. 


ఉత్తరాదిన ఉన్న మరో కథ శ్రీకృష్ణుడితో ముడిపడి ఉంది. ‘డోలిక’ అంటే ఊయల. శ్రీకృష్ణుడిని ఉయ్యాలలో వేసిన రోజుగా దీన్ని భావిస్తారు. దానికి గుర్తుగా శ్రీకృష్ణుడి బొమ్మను ఊయలలో వేసి డోలికా ఉత్సవం నిర్వహిస్తారు. 


ఈ రోజు ఏం చేయాలంటే...

ఆచార వ్యవహారాలు ఏవైనా హోలీ పండుగ నాడు రంగులు పూసుకొనే వాడుక అన్ని చోట్లా కనిపిస్తుంది. హోలికా పూర్ణిమ రోజున లక్ష్మీనారాయణ వ్రతం ఆచరించడం, సరస్వతీదేవిని పూజించడం,  పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం సంప్రదాయం. రాబోయేది వేసవి కాలం కనుక నీటినీ, పాత్రలనూ, గొడుగులనూ దానం ఇవ్వడం లాంటివి మంచి  ఫలితాలు ఇస్తాయనేది పెద్దల మాట!

Updated Date - 2020-03-06T05:15:29+05:30 IST