సిరులు ఒడిసి ‘పట్టు’

ABN , First Publish Date - 2022-07-04T03:57:38+05:30 IST

చెన్నూరు మండల రైతులకు దసరి పట్టు పరి శ్రమ వరంగా మారింది. దాదాపు 800 రైతులు పట్టుగూళ్ల పెంపకంతో ఉ పాధి పొందుతున్నారు. ఐదు నెలల కాలంలోనే పంట చేతికి వస్తుండ డంతో రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు.

సిరులు ఒడిసి ‘పట్టు’
కోటపల్లి మండలంలోని కొల్లూరు ప్రాంతంలో సాగు చేస్తున్న మల్బరీ తోట

- చెన్నూరు మండలంలో విస్తృతంగా పట్టుగూళ్ల పెంపకం

- 800 కుటుంబాలకు జీవనోపాధి 

చెన్నూరు, జూలై 3:  చెన్నూరు మండల  రైతులకు దసరి పట్టు పరి శ్రమ వరంగా మారింది. దాదాపు 800 రైతులు పట్టుగూళ్ల పెంపకంతో ఉ పాధి పొందుతున్నారు. ఐదు నెలల కాలంలోనే పంట చేతికి వస్తుండ డంతో రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రభుత్వం మరిన్ని వసతులు కల్పిస్తే మంచి దిగుబడి సాధిస్తామని రైతులు చెబుతున్నారు.

- ఆరు దశాబ్దాలుగా..

ఈ ప్రాంత రైతులు 60 సంవత్సరాలుగా పట్టు గూళ్లను పెంచుతు న్నారు. తక్కువ కాలంలో పంట తీసే అవకాశం ఉండడంతో ఈ దిశగా మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం మండలంలో దాదాపు 70 హెక్టార్లలో పట్టుగూళ్లు పెంచుతున్నారు. ఒక పంట కాలంలో దాదాపు కోటి పట్టుగూళ్లను ఉత్పత్తి చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తున్నారు. ఈ పంట పండించే వారిలో 80 శాతం గిరిజన రైతులు. జిల్లాలో చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి, నెన్నెల, కౌటాల, బెజ్జూర్‌, ఉట్నూరు, ఖానాపూర్‌ మండలాల్లో పట్టుగూళ్ల పెంపకం జరుగుతుంది. పట్టుగూళ్లను రిజర్వు ఫారెస్టులోని ఏరుమద్ది, నల్లమద్ది, తెల్లమద్ది చెట్లపై పెంచుతారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఇప్పుడిప్పుడే రైతులు మల్బరీ తోటల్లో కూడా పెంచుతున్నారు. పట్టు పరిశ్రమ శాఖ రైతులకు జూన్‌లో 50 శాతం సబ్సిడీ కింద పట్టు పురుగుల గుడ్లను పంపిణీ చేస్తుంది. రైతులు ఈ గుడ్లను వెదురుబుట్టల్లో పోసి మద్ది ఆకులు కప్పుతారు. గుడ్ల నుంచి చిన్న చిన్న పురుగులు వచ్చి  ఆకులు తింటూ పెరుగుతాయి. ఈ పురుగులు పెరిగాక వాటిని మద్ది చెట్ల కొమ్మల పైకి ఎక్కిస్తారు. ఈ పురుగులు చెట్లపై ఉన్న ఆకుల్ని తింటూ పెరిగి పెద్దవ వుతాయి. అనంతరం పురుగులు ఒక చెట్టు కాడను ఆధారంగా చేసుకుని తన నోటి నుంచి ఒక రకమైన పదార్ధాన్ని విడుదల చేస్తూ గూ డు కట్టుకుంటాయి. ఇలా తయారైన గూళ్లను రైతులు సేకరిస్తారు. ఈ ప్రక్రి య జూన్‌ నుంచి డిసెంబర్‌ చివరి వారం వరకు మూడు పంటల్లో గూళ్లు వస్తాయి. మొదటి పంట 30 నుంచి 35 రోజులకు, రెండో పంట 45 రోజులకు, మూడో పంట 65 రోజులకు వస్తుంది. ఇలా తయారైన గూళ్లను హాట్‌ ఎయిర్‌ డ్రయర్‌ యంత్రం ద్వారా వేడి చేస్తే లోపల ఉన్న పురుగు చనిపోతుంది. అనంతరం పట్టు గూళ్లను ఎండబెట్టి శుభ్రపర్చి విక్రయిస్తారు. ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, బీహార్‌, ఒడిశా రాష్ట్రాల నుంచి వ్యాపారులు బహిరంగ వేలం ద్వారా వెయ్యి పట్టుగూళ్లకు రూ. 1500 నుంచి 1700 వరకు చెల్లించి కొనుగోలు చేస్తారు. ఒక సీజన్‌లో రైతులు రూ.2 వేల పెట్టుబడితో దాదాపు రూ.30 వేల వరకు సంపాదిస్తారు. 

-బేసిక్‌ సీడ్‌ మల్టిఫికేషన్‌ కేంద్రం 

చెన్నూరు మండలంలోని లంబాడిపల్లిలో పట్టు పురుగుల బేసిక్‌ సీడ్‌ మల్టిఫికేషన్‌ కేంద్రం ఉంది. ఇక్కడి నుంచే నాణ్యమైన గుడ్లను ఉత్పత్తి చేసి రైతులకు పంపిణీ చేస్తారు. చెన్నూరు ప్రాంతంలో పట్టుగూళ్ల పెంపకం కోసం సెంట్రల్‌, స్టేట్‌ పోగ్రాం క్యాటలైటిక్‌ డెవలప్‌మెంట్‌ ఆధ్వర్యంలో ఏరుమద్ది, నల్లమద్ది, మల్బరీ తోటలను పెంచేందుకు ప్రభు త్వం అన్ని రాయితీలను కల్పిస్తోంది. రైతులకు మహిళ కిసాన్‌ స్వస్తీకరణ వరి యోజన పథకం కింద చెట్లు, స్ర్పేయర్స్‌ను పంపిణీ చేస్తున్నారు. పట్టుగూళ్ల పెంపకం రైతులకు జనతా ఇన్సూరెన్స్‌ సౌకర్యాన్ని కల్పించారు. 

- మల్బరీ సాగు 

 మల్బరీ సాగు కోసం రైతులకు రాయితీ అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.  ఎకరానికి 5,500 మొక్కలు అవసరం అవుతుండగా  మల్బరీ విత్తన  క్షేత్రంలో రూ. 2కు ఒక మొక్క చొప్పున లభిస్తాయి. మొక్కలు నాటిన మూడు నెలల్లో తోట కోతకు వస్తుంది. ఆ తర్వాత మల్బరీ పురుగులు పెంచితే నెల వ్యవధిలోనే  పంటచేతికి వస్తుంది. ప్రతి పంటకు దాదాపు రూ.35 వేల నుంచి 40 వేల ఆదాయం వస్తుంది. పట్టు పురుగుల పెంపకం చాలా తేలికైందని, కుటుంబ సభ్యులందరు కలిసి చేసుకుంటే మంచి ఆదాయం వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. మల్బరీ తోట సాగు చేసి ఆకులు కోత దశకు చేరుకోగానే పట్టు పురుగులకు సంబంధించిన గుడ్లను ఇతర ప్రాంతాల నుంచి అధికారుల ద్వారా తెప్పించుకుంటారు. 100 గుడ్లకు రూ. వెయ్యి ఖర్చు అవుతుంది. పట్టుగూళ్లను విక్రయించడానికి హైద్రాబాద్‌లోని తిరుమల గిరి, జనగామ జిల్లా కేంద్రంలో కేంద్రాలు ఉన్నాయి. 

పట్టు పురుగుల పెంపకంతో మంచి ఆదాయం

 - రాథోడ్‌ పార్వతి, పట్టు పరిశ్రమ శాఖ సహాయ సంచాలకులు, చెన్నూర్‌ 

పట్టు పురుగుల పెంపకం ద్వారా రైతులు మంచి ఆదాయం పొం దవచ్చు. మల్బరీ తోటలను సాగు చేసి పట్టు పురుగుల పెంపకం చేపట్టవచ్చు. జిల్లాలో ఈ సారి 175 ఎకరాల్లో మల్బరీ సాగు చేసేలాగా లక్ష్యంగా నిర్దేశించాం. దానికి అనుగుణంగా రైతులను ఎంపిక చేసి మల్బరీ సాగు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకుని రైతులు ఆర్థికంగా ఎదగాలి. 

Updated Date - 2022-07-04T03:57:38+05:30 IST