కొంచెం ఆగి పుట్టాల్సింది!

ABN , First Publish Date - 2020-09-13T06:55:59+05:30 IST

అవును. లక్షల ఏళ్లు ఆగినవాళ్లం. ఇంకొంచెం ఆగి పుడితే బావుండు. మూడు నాలుగు వేల ఏళ్లుగా అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడి దాకా వచ్చిన భౌతికవాదం, భావవాదం...

కొంచెం ఆగి పుట్టాల్సింది!

స్తబ్ధత, తిరోగమనంతో పాటు ఏ అరాచకమైనా భరించలేని స్థితికి చేరుకున్నప్పుడు సమాజం పురోగమన శక్తులకు జన్మనిస్తుంది. ప్రతీపశక్తులతో జరిగే ఘర్షణలో పురోగమన శక్తులు ఎంత త్వరగా విజయం సాధిస్తే, ఆ జాతి అంత తొందరగా విముక్తం అవుతుంది. మలినాలన్నీ కడిగేసుకున్న కాలమొకటి తప్పక ఆవిష్కృత మవుతుంది. అప్పటిదాకా ఆగకుండా ముందే పుట్టాం కాబట్టి ఆ గొప్ప కాలానికి మనం సాక్షులం కాలేకపోవచ్చు కానీ, కారకులుగా ఉండే మహదవకాశం ఉంది. అలాంటి నవ్యలోకాన్ని చాలా తొందరగా అందుబాటులోకి తేవడానికి ప్రయత్నం చేయడమే ఈ తరం బుద్ధిజీవుల వారసత్వ బాధ్యత.


అవును. లక్షల ఏళ్లు ఆగినవాళ్లం. ఇంకొంచెం ఆగి పుడితే బావుండు. మూడు నాలుగు వేల ఏళ్లుగా అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడి దాకా వచ్చిన భౌతికవాదం, భావవాదం ఇప్పుడిప్పుడే పరిపక్వత చెందుతున్నది. రాతి, లోహ, ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలు దాటుకుని మానవ సమాజం వైజ్ఞానిక యుగంలోకి అడుగు పెట్టింది. అది సంపూర్ణ ఫలితం ఇవ్వకముందే మనం ఊడిపడ్డాం. అయినా సరే, చింతించాల్సింది ఏమీ లేదు. మానవ జాతి కానీ, మానవాళి క్షేమం కోసమే అని చెప్పబడే వ్యవస్థలు గానీ, ఇంత భ్రష్టంగా ఉన్నాయే అని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. విజ్ఞానపు కాంతులు విరబూసిన కొద్దీ అజ్ఞానాంధకారాలు పటాపంచలవుతాయి. సైన్సు ప్రవేశించిన చోట నాన్ సైన్స్ ఉండదు, నాన్సెన్స్ ఉండదు. ఇంకా వందేళ్లకో రెండొందల ఏళ్లకో తప్పక విజ్ఞానమే మనిషి ఆలోచనల ఇతివృత్తంగా బతికే సత్యకాలమొకటి వచ్చితీరుతుంది. తర్కానికి నిలబడలేనిదేదీ మనుగడ సాగించజాలదు అని ప్రాచీన గ్రీకు తత్వవేత్తల నుంచి మొదలుకుని అనేకులు చేసిన నిర్ధారణలేవీ నిరర్ధకం కావు. 


ఇప్పటి వరకు జరిగిన సంఘ పరిణామం, భావ పరిణామం రాబోయే గొప్ప కాలాన్ని కళ్లకు కడుతున్నవి. నీరు, గాలి, అగ్ని, భూమి కేంద్రక సిద్ధాంతాలన్నింటినీ పూర్వపక్షం చేస్తూ కోపర్నికస్ ప్రతిపాదించి, బ్రూనే బలపరిచి, గెలీలియో నిరూపించిన సూర్యకేంద్ర సిద్ధాంతం మత విశ్వాసాలకు వ్యతిరేకమన్నది రాజ్యం. ఈ విశ్వానికి భూమి కేంద్రం కాదు అని వాదించిన వారికి మరణదండన విధించిన ప్రభుత్వాలే, నేడు అంతరిక్ష రహస్యాలను చేధిస్తున్న వారిని నెత్తిన పెట్టుకుని నోబెల్ బహుమతులు ఇస్తున్నాయి. నమ్మకం ఓడిపోయింది, సత్యం గెలిచింది. ఆర్యులకు ముందు అసలేమీ లేదు అని నమ్మించడానికి చేసిన ప్రయత్నాలను సింధు నాగరికత భూమిని చీల్చుకుంటూ వచ్చి చెండాడింది. మనిషి భూమి మీద తిరగడం, పక్షులు ఆకాశంలో ఎగరడం దైవ నిర్ణయం అన్న బిషప్ మిల్టన్ కడుపున పుట్టిన రైట్ సోదరులే విమానాన్ని కనిపెట్టి తరాల మధ్య ఉన్న ఆలోచనల అంతరాలను నిరూపించారు.


సోమరసంగా పిలిచే మధువును జవనాశ్వంగా కొలిచే రోజుల నుంచి మద్యపానాన్ని మహాపాపంగా మత గ్రంథాలు, ప్రవక్తలు ప్రచారం చేసే దాకా పరిస్థితి మారింది. వేదం(విద్య) చదవడానికే కాదు, వినడానికి కూడా శూద్రులు అనర్హులైన దశ నుంచి ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, మహిళల కోసం ప్రత్యేక గురుకులాలు పెట్టేదాకా దృక్పథాలను, దిక్పథాలను మార్చుకుని నాగరికత ఎదిగింది. చాతుర్వర్ణ సూత్రాలను చెప్పిన వేదాలను, వాటిని సమర్థించిన భగవద్గీతను కూడా తోసి పుచ్చి, దళితులు రాష్ట్రపతులు అయ్యే వరకు పరిణితి చెందింది రాజ్యనీతి. కప్పతల్లిని ఊరేగించకున్నా ఇప్పుడు వానలు పడుతున్నాయి. చెట్లకు తాళి కట్టకున్నా పంటలు పండుతున్నాయి. వెంకటేశ్వరుడి పాదాల దగ్గర బొమ్మ రాకెట్‌ను పెట్టి పూజలు చేయకున్నా సరే, భారతదేశంలో రాకెట్ ప్రయోగాలు విజయవంతం అయ్యే రోజు కూడా వస్తుంది. చార్లెస్ బ్రాడ్లాఫ్ లాంటి వాళ్ల కృషి వల్ల చట్టసభలు, న్యూజిలాండ్ లాంటి దేశాల ముందడుగుతో దేశాలు మత ప్రభావం నుంచి బయట పడి ‘లౌకిక’మవుతున్నాయి. చికెన్‌పాక్స్ లాంటి రోగాలు వస్తే భూతవైద్యులకు చూపించి, వేపమండలతో బాదిన రోజుల నుంచి కరోనా విరుగుడు మందు కోసం తన వైపు చూసే అనివార్యతను విజ్ఞానం సృష్టించుకున్నది. ఆచారాల పేరిట ఇంకా మూఢవిశ్వాసాలలోనే మగ్గుతున్న ప్రపంచంలోని అనేక సమాజాలు గొప్ప పరివర్తన చెందడానికి కరోనా పరిణామాలు ఎంతో దోహదం చేశాయి. ఇది కరోనా చేసిన మేలుగానే చూడాలి. ఇదంతా మానవ సమాజం కళ్లారా చూసిన భౌతిక పరిణామం. భావం కూడా అంతే పరిణామం చెందింది. 


ప్రకృతి శక్తుల కదలికలను అర్థం చేసుకోలేని ఆదిమ, వేదకాలంలో భావజాలం మతం, దేవుడితోనే ముడిపడింది. అనతికాలంలోనే ఆ తత్వం ప్రశ్నలకు, భిన్నాభిప్రాయాలకు గురైంది. ఉపనిషత్తుల నుంచి మొదలై లోకాయతులు, చార్వాకులు, అజితకేశ కంబలి, కాత్యాయనుడు తదితరుల నుంచి వేద ప్రామాణ్యానికి ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. గౌతమ బుద్ధుడు, వర్థమానుడు లాంటి వారి దగ్గర నుంచి ప్రత్యామ్నాయ మార్గం మొదలై విస్తరించింది. బ్రహ్మ సూత్రాలకు భాష్యం చెప్పిన పంచ వేదాంతులు ఆది శంకరాచార్యుడు, రామానుజుడు, మధ్వాచార్యులు, నింబార్కుడు, వల్లభుడు వేర్వేరు అంచనాలతో దేవుడిని అర్థం చేసుకునే పద్ధతులను చెప్పారు. రాజా రామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగోర్ లాంటి వాళ్ళు ప్రత్యేక సేవాసంస్థలు పెట్టి మరీ దేవుడిని మనిషి దగ్గరికి చేర్చి, మతాన్ని మానవ సేవా సాధనంగా మార్చే ప్రయత్నం చేశారు. జీవితం దుఃఖసాగరం అనే పాత తత్వధోరణిని దాదాపు పారదోలారు. పాశ్చాత్య తత్వాన్ని అర్థం చేసుకుని అనిబిసెంట్, మహాత్మాగాంధి, జవహర్ లాల్ నెహ్రూ లాంటి వాళ్లు మనిషి- సమాజం అవసరాలను గుర్తించి భౌతిక కార్యాచరణ చేపట్టారు. మానవేంద్రనాథ్ రాయ్, అంబేడ్కర్, జిడ్డు కృష్ణమూర్తి తదితరులు మనిషి వికాసం గురించి తపనపడ్డారు. సైన్స్ అభివృద్ధి అవుతున్న కొద్దీ, తత్వచింతన మతం నుంచి విడివడుతున్నది. సమస్త భోగభాగ్యాలను, అసంఖ్యాకుల ఆరాధనా భావాన్ని తృణప్రాయంగా వదులుకునే పరంపర గౌతమ బుద్ధుడి నుంచి జిడ్డు కృష్ణమూర్తి వరకు మనకు లభించిన గొప్ప వారసత్వం. అది కొనసాగి తీరుతుంది. మధ్యలో దొంగస్వాములు, దొంగబాబాల బాగోతం నీటి బుడగలా కొద్దికాలం ఉనికిలో ఉండి నాశనం అవుతుంది. 


రాజ్యం రూపురేఖలు కూడా మారుతున్నాయి. ఆటవిక లక్షణాలను వదులుకుంటూ రాజరికాలు, వాటిని వదులుకుంటూ వలసరాజ్యాలు, వాటిని వదిలించుకుంటూ నియంతల పాలనలు, వాటిని వదిలించుకుని ప్రజాస్వామ్య వ్యవస్థలు ఆవిర్భవించాయి. ఒక్కో దుర్లక్షణాన్నీ భరించుకుంటూనే వదిలించుకుంటూ రాజ్యాలు మారుతున్నాయి. ప్రస్తుతం శైశవ దశలోనే ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థల్లో నియంతృత్వ ధోరణులు వారసత్వంగా వచ్చాయి. కొంతమంది దేశాధినేతలు తమ పదవికి శాశ్వతత్వం చేకూర్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఆ కోవలోనివే. పరివర్తనకు, యథాతథ స్థితికి జరిగే సుదీర్ఘ ఘర్షణలో తిరోగమన శక్తుల కుయుక్తులు తుత్తునియలు అవుతాయి. నవ్య మానవవాది మానవేంద్రనాథ్ రాయ్ లాంటి వాళ్లు ప్రతిపాదించిన రాజకీయాధికార వికేంద్రీకరణతో కూడిన సంపూర్ణ శాస్త్రీయ ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చి తీరుతుంది. కొన్ని యూరప్, అమెరికా దేశాలు ఇప్పటికే ఈ దశకు చేరుకున్నాయి. యూరప్‌లో 16వ శతాబ్దంలో ఆరంభమయిన ఆధునిక యుగం 300 ఏళ్ల తర్వాతనే ఆసియా దేశాలకు పాకిందనే విషయం మనం ప్రతీ సందర్భంలోనూ పరిగణనలోకి తీసుకోవాలి. ఒకే తల్లి, ఒకే భాషగా ప్రారంభమయిన మానవజాతి గమ్యం మళ్ళీ విశ్వమానవ దృక్పథమే. జాతీయవాదం సంకుచితం కారాదని, స్వజాతి అభిమానం పరజాతి ద్వేషంగా మారరాదనే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగోర్ విశ్వమానవ సౌభ్రాతృత్వ బోధనలకూ తప్పక ఫలితం ఉంటుంది. 


ఈ దేశానికి భారత్, ఇండియా అనే రెండు పేర్లు రావడం వెనుక భావవాద, భౌతికవాద దృక్పథాలున్నాయి. అప్పటి దాకా ఎట్లా జరిగినా, స్వతంత్ర భారతదేశం మాత్రం వైజ్ఞానిక దృక్పథంతో, శాస్త్రీయ ఆలోచనలతో ముందుకు పోవాలనే మన జాతీయ నాయకులు స్వప్నించారు. ఈ దేశాన్ని సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య దేశంగా రాజ్యాంగం సుస్పష్టంగా ప్రకటించింది. ఈ దేశం ప్రగతిశీలంగా, గమనశీలంగా ఉండాలనే సంకల్పంతోనే జాతీయ పతాకంలో అశోకుడి ధర్మచక్రాన్ని చేర్చారు. ఈ దేశం సత్యం పునాదిగా వర్థిల్లాలని మన జాతీయచిహ్నంలో ‘సత్యమేవ జయతే’ అనే మండకోపనిషత్తులోని పదబంధాన్ని ప్రస్ఫుటించారు. ఎంతో ముందు చూపుతో దారి చూపిన వారి ఆశయసిద్ధికి పాటుపడడమే దేశ పౌరుల బాధ్యత. స్తబ్ధత, తిరోగమనంతో పాటు ఏ అరాచకమైనా భరించలేని స్థితికి చేరుకున్నప్పుడు సమాజం పురోగమన శక్తులకు జన్మనిస్తుంది. ప్రతీపశక్తులతో జరిగే ఘర్షణలో పురోగమన శక్తులు ఎంత త్వరగా విజయం సాధిస్తే, ఆ జాతి అంత తొందరగా విముక్తం అవుతుంది. మలినాలన్నీ కడిగేసుకున్న కాలమొకటి తప్పక ఆవిష్కృతమవుతుంది. అప్పటిదాకా ఆగకుండా ముందే పుట్టాం కాబట్టి ఆ గొప్ప కాలానికి మనం సాక్షులం కాలేకపోవచ్చు కానీ, కారకులుగా ఉండే మహదవకాశం ఉంది. అలాంటి నవ్యలోకాన్ని చాలా తొందరగా అందుబాటులోకి తేవడానికి ప్రయత్నం చేయడమే ఈ తరం బుద్ధిజీవుల వారసత్వ బాధ్యత. స్వామి వివేకానంద చెప్పినట్లు ‘‘ఆత్మవిశ్వాసం దండిగా కలిగిన కొద్దిమంది మనుషుల దృఢచిత్తమే ప్రపంచ చరిత్ర’’. అలాంటి దృఢచిత్తులు తాము జీవించిన కాలంలో కఠిన సమయాలు ఎదుర్కోవచ్చు కానీ, మానవజాతి చరిత్రలో వారి స్థానం మాత్రం పదిలంగా ఉంటుంది. 

గటిక విజయ్‌కుమార్

Updated Date - 2020-09-13T06:55:59+05:30 IST