బల్బీర్‌కు సరైన గౌరవమేది?

ABN , First Publish Date - 2020-05-27T09:06:17+05:30 IST

వరుసగా మూడు ఒలింపిక్స్‌లో అసాధారణ ప్రతిభతో.. కళ్లు చెదిరే ప్రావీణ్యంతో భారత్‌కు స్వర్ణాలు అందించిన హాకీ దిగ్గజం బల్బీర్‌ సింగ్‌ సీనియర్‌కు అతడి...

బల్బీర్‌కు సరైన గౌరవమేది?

భారత దేశ హాకీ ప్రతిష్టను తన అత్యుత్తమ ఆటతీరుతో సమున్నత శిఖరాలకు చేర్చిన బల్బీర్‌ సింగ్‌ సీనియర్‌కు మన పాలకులు ఏమేరకు గౌరవం ఇచ్చారంటూ పలువురు క్రీడా ప్రముఖులు ప్రశ్నిస్తు న్నారు. స్వాతంత్ర్యానంతరం తన ‘మ్యాజిక్‌’ స్టిక్‌తో అంతర్జాతీయంగా స్వర్ణ పతకాలు అందించిన బల్బీర్‌కు దేశ అత్యున్నత పురస్కారాలు 

రాకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


హాకీ ప్రముఖుల ఆవేదన

న్యూఢిల్లీ: వరుసగా మూడు ఒలింపిక్స్‌లో అసాధారణ ప్రతిభతో.. కళ్లు చెదిరే ప్రావీణ్యంతో భారత్‌కు స్వర్ణాలు అందించిన హాకీ దిగ్గజం బల్బీర్‌ సింగ్‌ సీనియర్‌కు అతడి జీవితకాలంలో సరైన గౌరవం దక్కలేదన్నది కాదనలేని వాస్తవం. 96 ఏళ్ల బల్బీర్‌ సింగ్‌ మృతితో భారత హాకీలో ఓ శకం ముగిసినట్టయింది. మేజర్‌ ధ్యాన్‌చంద్‌ బ్రిటిష్‌ ఇండియా హయాంలో మన హాకీకి వెన్నెముకగా నిలవగా.. తదనంతరం ఆ బాధ్యతను బల్బీర్‌ తన భుజస్కంధాలపై వేసుకుని ఆ స్వర్ణ యుగాన్ని ముందుకు తీసుకెళ్లాడు.


అయితే మరో లెజెండ్‌ ధ్యాన్‌చంద్‌ను సముచిత రీతిలోనే గౌరవించిన ప్రభుత్వం.. బల్బీర్‌ విషయంలో మాత్రం తగిన రీతిలో స్పందించలేదు. 1957లో ఆయనకు నాలుగో ఉత్తమ పౌర పురస్కారమైన పద్మశ్రీ ఇవ్వగలిగింది. కానీ ఆయన స్థాయికి ఏమాత్రం సరితూగని ఎంతో మంది నేటి తరం క్రీడాకారులు ఏకంగా పద్మవిభూషణ్‌లతోనే గౌరవాన్ని అందుకోగలుగుతున్నారు. ‘భారత క్రీడారంగంలో ధ్యాన్‌చంద్‌, బల్బీర్‌ సింగ్‌ ఇద్దరూ మేరునగధీరులే. రికార్డుల పరంగా వీరిద్దరూ సమానంగానే ఉంటారు. అందుకే  ధ్యాన్‌చంద్‌ భారత హాకీ పితామహుడైతే.. బల్బీర్‌ అంకుల్‌లాంటివాడు. ధ్యాన్‌చంద్‌ పేరిట ఇప్పటికే స్టేడియం, క్రీడా దినోత్సవంతో పాటు అవార్డులను కూడా ఇస్తున్నాం. కానీ బల్బీర్‌ మాత్రం తన స్థాయికి తగ్గ గౌరవం ఎప్పుడూ పొందలేదు. పద్మశ్రీ మాత్రం ఇచ్చారు. నిజానికి కొన్ని తరాలకు ప్రేరణగా నిలిచిన వీరిద్దరినీ భారతరత్నతో గౌరవించుకోవాలి’ అని 1975 హాకీ ప్రపంచకప్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ అజిత్‌ పాల్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు. ఇదే అభిప్రాయాన్ని అటు ధ్యాన్‌చంద్‌ కుమారుడు అశోక్‌ కుమార్‌ కూడా వెలిబుచ్చాడు. తమకు బల్బీర్‌ ప్రేరణగా నిలిచాడని చెప్పాడు.


పద్మ విభూషణ్‌ అయినా ఇవ్వాలి..

భారత క్రీడారంగానికి తలమానికంగా నిలిచిన బల్బీర్‌కు కనీసం పద్మ విభూషణ్‌ ఇవ్వాలని మాజీ కెప్టెన్‌ దిలీప్‌ టిర్కే సూచించాడు. ‘బల్బీర్‌ సింగ్‌ సీనియర్‌ను కోల్పోవడం దురదృష్టకరం. కానీ ఆయన్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత దేశంపై ఉంది. ఇలాంటి వాళ్లు మళ్లీ మళ్లీ పుట్టరు. అందుకే వారి ఘనతలను మనం తక్కువ చేయకూడదు. తన జీవిత కాలంలో బల్బీర్‌కు పద్మశ్రీ మాత్రమే దక్కింది. కానీ ఆయన పద్మ విభూషణ్‌కు అర్హుడు’ అని దిలీప్‌ టిర్కే పేర్కొన్నాడు.

Updated Date - 2020-05-27T09:06:17+05:30 IST