గుట్టుగా గుట్కా దందా

ABN , First Publish Date - 2021-10-08T05:55:50+05:30 IST

గుట్టుగా గుట్కా దందా

గుట్టుగా గుట్కా దందా

బీరు, బిర్యానికి పావులుగా మారుతున్న యువత

టాస్క్‌ఫోర్స్‌, నిఘావర్గాలకు నెలవారీ మామూళ్లు

నెలకు రూ.10 కోట్ల మేర జరుగుతున్న వ్యాపారం 


హనుమకొండ క్రైం, అక్టోబరు 7: వీపుపై బరువైన బ్యాగుతో బైక్‌లపై ప్రయాణిస్తుంటే వీరిని అందరు కాలేజ్‌ స్టూడెంట్స్‌ అనుకుంటారు. కానీ.. వీరు నగరంలోని పలు కిరాణా, పాన్‌షాపుల్లో గుట్కాలు సరఫరా చేస్తారు. ఇదంతా ఎక్కడో కాదు.. సాక్షాత్తూ వరంగల్‌ నగరం కేంద్రంగా నడుస్తోంది.  వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలోని వరంగల్‌, హనుమకొండ, జనగామ జిల్లాలతో పాటు జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాలలో గుట్కా దందా కొంతకాలంగా యథేచ్ఛగా నడుస్తోంది. గుట్కా రవాణా కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి చదువుకోవడానికి వచ్చిన యువతను వాడుకుంటున్నారు. వారికి ఉపాధితో పాటు ఖర్చులకు డబ్బులు ఇస్తూ గుట్కా స్మగర్లు వీరిని పావులుగా వాడుకుంటున్నారు. అంతే కాకుండా నగరంలో చిల్లర గ్యాంగులు, చదువు మానేసిన యువతను చేరదీసి గుట్కా వ్యాపారానికి వినియోగించుకుంటున్నారు. కొందరు గుట్కా వ్యాపారులు యువకులు తిరిగేందుకు ద్విచక్రవాహనాలు ఇస్తుండడంతో చదువు పక్కనబెట్టి వారికోసం అన్ని తామై పనిచేస్తున్నారు.   


చేతి ఖర్చులు, వాహనాలు

ఇటీవల వరంగల్‌ కమిషనరేట్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు గుట్కా రవాణా చేసే  కొందరు యువకులు పట్టుకుని విచారించారు. వారు చెప్పిన నిజాలకు పోలీసుల సైతం ఖంగుతిన్నట్టు సమాచారం. దొరికిన యువకులునగరంలోని పేరున్న సాంకేతిక, పీజీ కళాశాలల్లో చదువుతున్నట్టు వెల్లడించారు. వరంగల్‌, హనుమకొండకు చెందిన కొందరు గుట్కా డాన్‌లు తమను చేరదీసి ఆశ్రయం ఇస్తారని వెల్లడించినట్టు తెలిసింది. వరంగల్‌ నగరంలోని కొందరు డాన్‌ల వద్ద పార్ట్‌ టైమ్‌గా పనిచేస్తామని, ఆ తర్వాత వచ్చిన డబ్బులతో ఎంజాయ్‌ చేస్తామని యువకులు విచారణలో చెప్పినట్టు సమాచారం. రోజుకు రూ.500 ఇస్తూ గుట్కా, అంబర్‌, పాన్‌మసాలాలు సరఫరా చేయడానికి ద్విచక్రవాహనాలను సమకూర్చుతారని తెలిసింది.  రోజుకు రూ.200 పెట్రోల్‌ ఖర్చులకు ఇస్తారని వెల్లడించారు. ఉదయం 5నుంచి 7వరకు సాయంత్రం 9 నుంచి 11 గంటల వరకు బైక్‌ ముందు రెండు పుస్తకాలు పెట్టుకుని వీపునకు వేసుకునే బ్యాగులో గుట్కాల ప్యాకెట్ల వేసుకుని కళాశాల విద్యార్థుల్లా అందరిని నమ్మిస్తున్నామని వారు వెల్లడించినట్టు సమాచారం.


షాపులలో వేయడమే పని

గుట్కా వ్యాపారుల వద్ద పనిచేస్తున్న యువకులు వారికి కేటాయించిన కిరాణా, పాన్‌షాపులు, డబ్బాలు, చిల్లర కొట్లలో ఇద్దరి చొప్పున కొనుగోలుదారులుగా వెళ్లినట్టు అందరిని నమ్మిస్తారు. కోడ్‌బాషలో షాపు యజమానికి సరుకు అందజేస్తారు. సాయంత్రం మరో వ్యక్తి డబ్బులు వసూలు చేస్తాడు. ఇంకా ఆ ప్రాంతంలో ఎవరైనా పోలీసుల వలే సంచరిస్తూ అనుమానాస్పదంగా కనిపిస్తే అక్కడి నుంచి  జారుకుంటారు. మరికొందరు షాపులో ఏదో కొనుగోలు చేసినట్టు నటిస్తూ షాపు యజమానితో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తారు. తనతో బైక్‌పై వచ్చిన వ్యక్తి అంతా లైన్‌ క్లియర్‌ అని చెప్పగానే తన బ్యాగులో తెచ్చిన గుట్కా ప్యాకెట్లను షాపు యజమానికి ఇచ్చి ఓ పేపర్‌పై సంతకం తీసుకుంటారు. అక్కడితో వారి పనైపోతోంది. ఇలా చాలామంది యువకులు ఈజీ మనీ కోసం అడ్డదార్లు తొక్కుతున్నారు. చిల్లర డబ్బుల కోసం యువత వారి బంగారు భవితను గుట్కా వ్యాపారుల పాలు చేసుకుంటున్నారు. 


రాత్రి సమయాల్లో దిగుమతి..

వరంగల్‌, హనుమకొండకు చెందిన నలుగురు డాన్‌లతో పాటు ఉప్పల్‌ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తు లు గుట్కా వ్యాపారంలో రాటుదేలి పోయారు. పోలీసు లు పట్టుకున్నప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రావ డం లేదు. వారి చేతికి మట్టి అంటకుండా కిందస్థాయి వారితో దందా నడిపిస్తారు. వరంగల్‌కు చెందిన ఓ డాన్‌ కొడుకులు సైతం గుట్కా దందాలో తండ్రికి తగ్గ తనయులుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.  ముందు గా వీరు విలువైన కార్లలో బీదర్‌, గోవా, కాకినాడ, వైజాగ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో దిగుమతి చేస్తారు. ఆ తర్వాత ప్రతీ రోజు కొంచెం కొంచెంగా ఆర్టీసీ బస్సు వెనుక భాగంలో డంప్‌ చేసి డ్రైవర్లను నమ్మిస్తున్నారు. బస్సు రాగానే రాత్రి సమయాల్లో గుట్కా బ్యాగులను ఆటోలలో డెన్‌లకు చేరవేస్తారు. 

నగరంలో ప్రధానంగా హన్మకొండ చౌరస్తా, కుమార్‌పల్లి, రెడ్డికాలనీ, టైలర్‌స్ట్రీట్‌, నయీంనగర్‌, హనుమాన్‌నగర్‌, కొత్తూర్‌జెండా, భీమారం, వడ్డెపెల్లి, కాజీపేట, వరంగల్‌ పిన్నవారి స్ర్టీట్‌, కరీమాబాద్‌, శివనగర్‌, కాశిబుగ్గ, మట్టెవాడ, బట్టలబజార్‌, వరంగల్‌ బస్‌స్టాండ్‌, రైల్వేగేటు, ఏనుమాముల మార్కెట్‌, సాకరాశికుంటలో గుట్కా దందా సాగుతోంది.  వరంగల్‌ నగరంలో నెలకు రూ.10కోట్ల మేరకు గుట్కా వ్యాపారం సాగుతున్నాయంటే అతిశయోక్తికాదు. 


టాస్క్‌ఫోర్స్‌లో టేకేదార్లు

వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో అక్రమాలను నియంత్రించేందుకు ఏర్పడిన టాస్క్‌ఫోర్స్‌ బృందంలో గతంలో కొందరు వివిధ పోలీసుస్టేషన్‌లలో టేకేదార్లుగా పని చేసిన వారే ప్రస్తుతం పని చేస్తూ అధికారులను నమ్మిస్తూ పాతుకుపోయారు.  గతంలో పోలీసుల స్టేషన్‌ పరిధిలో నెలవారీ మామూళ్లు వసూలు చేస్తూ అక్కడి సీఐస్థాయి అధికారికి నమ్మిన బంట్లుగా ఉండేవారు. కాగా, వీరికి లంచాలు తీసుకునే అలవాటు ఉండడం వల్ల టాస్క్‌ఫోర్స్‌ ఉంటూ కొందరు సిబ్బంది అడ్డదార్లు తొక్కుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కొందరు పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది గుట్కా వ్యాపారులతో అంటగాగుతున్నట్టు తెలుస్తోంది. దీంతో నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో జరిగే గుట్కా వ్యాపారాన్ని చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. 

Updated Date - 2021-10-08T05:55:50+05:30 IST