2.61 లక్షల ఎకరాల్లో సాగు

ABN , First Publish Date - 2022-05-27T06:07:29+05:30 IST

2.61 లక్షల ఎకరాల్లో సాగు

2.61 లక్షల ఎకరాల్లో సాగు

97 వేల ఎకరాల్లో పత్తిసాగుకు ప్రతిపాదన

వరిసాగు తగ్గింపునకు చర్యలు

పత్తి, కంది పంటల విస్తీర్ణం పెంపుపై దృష్టి

రైతు పెట్టుబడి వ్యయం తగ్గింపునకు ప్రయోగాలు

క్లస్టర్ల వారీగా ప్రదర్శన క్షేత్రాలు


హనుమకొండ, మే 26 (ఆంధ్రజ్యోతి) : హనుమకొండ జిల్లాలో వానాకాలంలో వేయాల్సిన పంటలు, కావాల్సిన విత్తనాలు, ఎరువుల అంచనాతో కూడిన ప్రణాళికను వ్యవసాయశాఖ అధికారులు రూపొందించారు.  ఈ సారి వరిసాగును తగ్గించి జిల్లాలో పత్తి, కంది పంటల విస్తీర్ణాన్ని పెంచేలా ప్రణాళిక రూపొందించారు. గత సంవత్సరం వానాకాలంలో సన్నగింజ వరిని వేయాలని చెప్పి తీరా పండిన ధాన్యానికి ధర పెంచి కొనకపోవడం, గత యాసంగిలో వరిసాగు వద్దని చెప్పి పంట పూర్తయిన తర్వాత ధాన్యాన్ని కొంటుండడం, మక్కలు, పత్తి, కందులు, మిరపకు మంచి ధరలు పలుకుతుండటంతో రైతులు ఏ పంటవైపు మొగ్గుతారనేది విత్తితేగాని తెలియని పరిస్థితి నెలకొంది.


2.61 లక్షల ఎకరాల్లో సాగు

ఈ పరిస్థితుల నేపథ్యంలో హనుమకొండ జిల్లాలో వచ్చే వానాకాలం సీజన్‌లో అన్ని రకాల పంటలు కలుపుకొని మొత్తం 2,61,000 ఎకరాల్లో సాగుకు ప్రణాళికలో ప్రతిపాదించారు. ఇందులో 240,000 ఎకరాల్లో వివిధ రకాల పంటలను, 21,000 ఎకరాల్లో పండ్లతోటలు, కూరగాయల సాగుగా నిర్ణయించారు. 2021 వానాకాలం సీజన్‌లోనూ ఇంచుమించు ఇంతే సాగు విస్తీర్ణాన్ని ప్రతిపాదించారు. 3800 ఎకరాల్లో కాయధాన్యాలు, ఇతర పంటల సాగును ప్రోత్సాహించాలని నిర్ణయించారు. మారిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వచ్చే వానాకాలం సీజన్‌లో వరిసాగును తగ్గించి పత్తి, మొక్కజొన్న, కందులు, వేరుశనగ తదితర పంట సాగును పెంచాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను అందుబాటులో ఉంచేందుకు ప్రతిపాదనలకు రూపకల్పన  చేశారు. 


పత్తి, కందుల సాగు 

ఈ సారి వరి పంట విస్తీర్ణం తగ్గించేలా ప్రణాళికను రూపొందించారు. ధాన్యం కొనుగోలులో   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న వివాదం వల్ల కొనుగోళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్న  సంగతి తెలిసిందే.. వరి సాగును తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వమే  కోరుతోంది. అయినా సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉండడం, చెరువుల్లో కూడా నీరు చాలినంత నిల్వ ఉండడం, భూగర్భజలమట్టాలు గతంలో కన్నా కొంత పెరగడం, దీనికితోడు 24 గంటల ఉచిత కరెంట్‌ సరఫరాతో రైతులు ఎక్కువగా వరివైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో రబీలోనూ జిల్లాలో వరి సాగు పెరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఖరీ్‌ఫలో వరిసాగు విస్తీర్ణాన్ని తగ్గిస్తూ ప్రణాళిక రూపొందించారు. 2021 వానాకాలం సీజన్‌లో 1,50,588 ఎకరాల్లో వరిసాగైంది. వచ్చే ఖరీ్‌ఫలో 1,30,000 ఎకరాలకే వరిసాగు పరిమితం అయ్యేలా విస్తీర్ణాన్ని కుదించారు. మొక్కజొన్న సాగును పెంచాలని ప్రణాళికలో ప్రతిపాదించారు. గత వానాకాలం సీజన్‌లో జిల్లాలో 7,071 ఎకరాల్లో మొక్కజొన్నను సాగు చేశారు. మార్కెట్‌లో మంచి ధర పలికింది. దీంతో ఈసారి 8600 ఎకరాల్లో అంటే అదనంగా 1629 ఎకరాల్లో మొక్కజొన్న సాగును ప్రతిపాదించారు


పత్తికి పెద్దపీట

ఈ సారి పత్తిసాగును ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రణాళికను రూపొందించారు. 2021 వానాకాలం సీజన్‌లో 78965 ఎకరాల్లో పత్తిసాగును నిర్ణయించగా ఈసారి 97600 ఎకరాలకు ప్రతిపాదించారు. గత సీజన్‌ కన్నా ఈ సారి 8735 ఎకరాల్లో అదనంగా పత్తి సాగును ప్రోత్సహించాలని నిర్ణయించారు. వేరుశనగ సాగును కూడా పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ సీజన్‌లో 600 ఎకరాల్లో పంటసాగును ప్రతిపాదించారు. గత వానాకాలం సీజన్‌లో 200 ఎకరాల్లోనే సాగుకు నిర్ణయించారు.


విత్తనాలు, ఎరువులు

వచ్చే వానాకాలం సీజన్‌లో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను చాలినంత అందుబాటులో ఉండేందుకు చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు ప్రణాళికలో ప్రతిపాదనలు చేశారు. 1,30,000 ఎకరాల్లో వరిసాగుకు 32,500 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేశారు. ఆ మేరకు విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.


మొక్కజొన్నసాగుకు గాను 688 క్వింటాళ్ల విత్తనాలు అవసరమౌతాయని అంచనా వేశారు. 97,600  ఎకరాల్లో పత్తిసాగుకు 878 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయి. 600 ఎకరాల్లో వేరుశనగ సాగుకు అవసరమైన 360 క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచుతారు. కందులను గత వానాకాలం సీజన్‌లో 2604 ఎకరాల్లో సాగును నిర్ణయించగా ఈసారి 3200 ఎకరాల్లో ప్రతిపాదించారు. 3200 ఎకరాల్లో కందుల సాగుకుగాను  128 క్వింటాళ్ళ విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచుతారు. ఇప్పటికైతే కేవలం జనుము, జీలుగ విత్తనాలను మాత్రమే 65 శాతం రాయితీపై ఇస్తున్నారు. మిగిలిన పంటల విత్తనా రాయితీని, సరఫరాను  ఇంకా ప్రకటించలేదు. జిల్లాలో మొత్తం 261,000 ఎకరాల్లో పంటల సాగుకు 35235 మెట్రిక్‌ టన్నుల యూరియా, 13050 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 32625 మెట్రిక్‌ టన్నుల ఎన్‌పీకే, 10440 మెట్రిక్‌ టన్నుల ఎంవోపి అవసరమౌతుంది. జిల్లాకు అవసరమున్న ఎరువులను జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు నెలవారీ కోట ప్రకారం తెప్పించనున్నారు. 


వ్యయం తగ్గించే దిశగా..

మూసపద్ధతిలో పంటల సాగుకు కాకుండా ప్రయోగాత్మకంగా కొంత విస్తీర్ణంలో వినూత్న పద్ధతిలో పంటలు వేయించేందుకు జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళికను రూపొందించింది. వ్యవసాయ క్లస్టర్లు ఇప్పటికే ఏర్పాటై ఉండటం, ఒక్కో క్లస్టర్‌కు ఒకరు చొప్పున ఏఈవోలు కూడా అందుబాటులో ఉండటంతో కొంత మంది రైతులను ఎంచుకొని తక్కువ విస్తీర్ణంలో పంటలు సాగుచేయించేలా చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా రైతుకు పెట్టుబడి వ్యయం తగ్గించే దిశగా ఈ ప్రయోగాలు ఉంటాయి.  నేలలో నిక్షిప్తమైన భాస్వరాన్ని పైర్లకు అందుబాటులోకి తెచ్చేలా పీఎ్‌సబి వాడకాన్ని పెంచుతారు. ఇందుకోసం ప్రతీ క్లస్టర్‌లో 150 మంది రైతులతో  ప్రయోగాత్మకంగా సాగుచేయించే బాధ్యతను ఏఈవోలకు అప్పగిస్తారు.  కూలీల ఖర్చు తగ్గించే ప్రయత్నంలో భాగంగా వరిపంటను వెదజల్లే పద్ధతిలో సాగుచేయిస్తారు. ఒక క్లస్టర్‌లో 25 మంది రైతులను ఎంపిక చేసి 50 ఎకరాల్లో వరిపంటను వెదజల్లే పద్ధతిలో సాగుచేయిస్తారు. పత్తి, మొక్కజొన్న, జొన్న లాంటి విత్తనాలను నేరుగా విత్తినట్టే వరి విత్తనాలను కూడా నేరుగా  పొలంలో వెదజల్లాలి. ఈ విధానంలో నారు పెంచటం, నాటు వేయడం లాంటి పనులు ఉండవు. పది రోజుల ముందు పంట కోతకు వస్తుంది. పంట చేతికొచ్చే సమయంలో వర్షాలతో నష్టం జరుగకుండా రక్షించుకునే వీలుంటుంది. 


పత్తి, కందుల సాగు పెంచేందుకు చర్యలు : దామోదర్‌ రెడ్డి, ఏడీఏ, హనుమకొండ జిల్లా

ఈసారి వానాకాలం సీజన్‌లో వరిసాగును తగ్గించి పత్తి, మొక్కజొన్న, కందుల సాగును పెంచేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించాం. ఆ మేరకు ప్రణాళికను రూపొందించాం.  పెట్టుబడి ఎలా తగ్గించాలి ? దిగుబడి ఎలా పెంచాలి ? భూసారం తగ్గకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ? రసాయన ఎరువుల వాడకం ఎలా తగ్గించాలి ? అనే అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నాం. నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరాకుగాను విస్తృత తనిఖీలు చేపడతాం. నకిలీల నిరోధానికి పోలీసులతో కలిసి టాస్క్‌ఫోర్సు బృందాలు తనిఖీలు చేపడతారు.

Updated Date - 2022-05-27T06:07:29+05:30 IST