హెచ్‌ఎంఆర్‌.. ఇదేంటి సార్‌?

ABN , First Publish Date - 2021-03-02T06:58:28+05:30 IST

మల్టీప్లెక్స్‌లు, మాల్స్‌, ఇతర వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో పార్కింగ్‌

హెచ్‌ఎంఆర్‌.. ఇదేంటి సార్‌?

రోడ్లపైనే హెచ్‌ఎంఆర్‌ పార్కింగ్‌

మెట్రో స్టేషన్ల వద్ద వాహనాల బారులు

షెల్టర్‌ లేకుండానే రుసుము వసూలు

పట్టని జీహెచ్‌ఎంసీ

ప్రైవేట్‌ సంస్థలకే నిబంధనలా..? 

 ప్రభుత్వ విభాగానికి వర్తించవా..? 

హైదరాబాద్‌ సిటీ, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): 

మల్టీప్లెక్స్‌లు, మాల్స్‌, ఇతర వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో పార్కింగ్‌ నిబంధనలు నిక్కచ్చిగా అమలు చేయాల్సిందే. ఉల్లంఘనకు పాల్పడితే 

రూ.50 వేల జరిమానా

- ఇది జీహెచ్‌ఎంసీలోని ఈవీడీఎం విభాగం డైరెక్టర్‌ పేరిట కొద్ది రోజుల క్రితం 

విడుదల చేసిన ప్రకటన.

పార్కింగ్‌ రుసుము పేరిట ప్రైవేట్‌ సంస్థల దోపిడీకి చెక్‌ పెడుతూ సర్కారు తీసుకువచ్చిన ఉత్తర్వులను అమలు చేసే క్రమంలోనే ఈవీడీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. 

అదే అధికారులకు సాటి సర్కారీ శాఖ చేస్తోన్న పార్కింగ్‌ దోపిడీ కనిపించకపోవడంపై జనం నుచిఇ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. హెచ్‌ఎంఆర్‌  రహదారిపై అడ్డంగా వాహనాలు పార్కింగ్‌ చేయిస్తూ కనీస వసతులు కల్పించకుండా రుసుము వసూలు చేస్తున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

అక్రమ పార్కింగ్‌ వసూళ్లపై ఫిర్యాదులు, పౌరుల విజ్ఞప్తుల నేపథ్యంలో మంత్రి కె. తారక రామారావు ఆదేశాల మేరకు రోడ్ల పక్కన పార్కింగ్‌ రుసుము వసూలును జీహెచ్‌ఎంసీ గతంలో పూర్తిగా రద్దు చేసింది. అంతకుముందు ఉన్న లాట్లలో ఉచిత పార్కింగ్‌కు అనుమతినిస్తున్నారు. హెచ్‌ఎంఆర్‌ మంత్రి ఆదేశాలను బేఖాతరు చేస్తూ అదే రహదారులపై  పార్కింగ్‌ రుసుము వసూలు చేస్తోంది. ఈ బాధ్యతను అధికారులు ఓ ఏజెన్సీకి అప్పగించారు. ‘రోడ్డుపై పార్కింగ్‌ చేస్తే మీకెందుకు రుసుము చెల్లించాలి’ అని ప్రశ్నించిన ఓ వాహనదారుడితో తార్నాకలోని సిబ్బంది దురుసుగా వ్యవహరించారు. మియాపూర్‌ స్టేషన్‌ వద్ద ఓ వైపు ఉచిత పార్కింగ్‌ సదుపాయం ఉండగా, మరో వైపు రుసుం వసూలు చేస్తున్నారు.  

పార్కింగ్‌ బాధ్యత ఎవరిది..? 

రోడ్ల పక్కన వాహనాల ఉచిత పార్కింగ్‌కు జీహెచ్‌ఎంసీ  అనుమతిస్తోంది. అదే సమయంలో ఆ రహదారులపై హెచ్‌ఎంఆర్‌ యథేచ్ఛగా వ్యాపారం చేస్తోంది. వాహనదారుల నుంచి రుసుం వసూలు చేస్తోంది. మార్చి 20, 2018లో ప్రభుత్వం విడుదల చేసిన నూతన పార్కింగ్‌ పాలసీ ప్రకారం వినియోగదారులకు పార్కింగ్‌ వసతి కల్పించాల్సిన బాధ్యత యజమానులదే. 30 నిమిషాల వరకు ఉచిత పార్కింగ్‌, గంట వ్యవధి వరకు ఏదైనా కొనుగోలు చేసినట్టు బిల్లు చూపితే రుసుము తీసుకోవద్దు. గంట కంటే ఎక్కువ సేపు పార్కింగ్‌ చేసినప్పుడు రుసుం కంటే కొనుగోలు చేసిన బిల్లు ఎక్కువ ఉంటే ఉచిత పార్కింగ్‌కు అవకాశం కల్పించాలని విధివిధానాలు ఉన్నాయి. ప్రైవేట్‌ వ్యాపార సంస్థల విషయంలో ఈ నిబంధనలు అమలు చేయాలని జీహెచ్‌ఎంసీ చెబుతోంది.  సర్కారు ఉత్తర్వుల ప్రకారం వినియోగదారులకు పార్కింగ్‌  వసతి కల్పించాల్సింది యజమాన్యాలు అయినప్పుడు, ప్రయాణికులు వాహనాలు  నిలిపేలా వసతి కల్పించాల్సిన బాధ్యత హెచ్‌ఎంఆర్‌ది కాదా, ఆ సంస్థకు నిబంధనలు వర్తించవా, అని ఓ పౌర సంస్థ ప్రతినిధి ప్రశ్నించారు. ఈ విషయంపై వివరణ అడిగేందుకు ఈవీడీఎం డైరెక్టర్‌కు ఫోన్‌ చేయగా ఆయన అందుబాటులో లేరు. 

గంటకు రూ.3 నుంచి 30

మెట్రోస్టేషన్ల వద్ద పార్కింగ్‌ లాట్లను హెచ్‌ఎంఆర్‌ ఓ ఏజెన్సీకి కేటాయించింది. ద్విచక్ర వాహనాలకు గంటకు రూ.3, కార్లకు రూ.8 చొప్పున వసూలు చేస్తోంది. బైక్‌లకు ఒకరోజు మొత్తానికి గరిష్టంగా రూ.30, కార్లకు రూ.80 తీసుకుంటున్నారు. జీఎ్‌సటీతో కలిపి ఈ మొత్తమని నిర్వహణ ఏజెన్సీ చెబుతోంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10.30 వరకు పార్కింగ్‌ ఏజెన్సీ సిబ్బంది అక్కడ అందుబాటులో ఉంటారు. ఇంటెగ్రేటెడ్‌ స్మార్ట్‌ పార్కింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ పేరిట యాప్‌నూ అందుబాటులోకి తీసుకువచ్చారు. మెజార్టీ మెట్రో స్టేషన్ల వద్ద ప్రధాన రహదారులపైనే వాహనాలు నిలుపుతున్నారు.  కనీస వసతులు కల్పించలేదు. కనీసం షెల్టర్‌ కూడా లేదు. వాహనాలు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నాయి. ఎవరి వాహనాలకు వారే బాధ్యులు అన్న సందేశాలు అక్కడి బోర్డులపై కనిపిస్తుంటాయి. ఎలాంటి వసతులూ కల్పించకుండా హెచ్‌ఎంఆర్‌ పార్కింగ్‌ రుసుం వసూలు చేస్తుండడం గమనార్హం. 

Updated Date - 2021-03-02T06:58:28+05:30 IST