HYD : కాంక్రీట్‌ నగరం.. పచ్చటి హారం.. HMDA ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-06-10T15:07:38+05:30 IST

ఎటు చూసినా ఎత్తైన భవనాలతో విస్తరిస్తున్న కాంక్రీట్‌ నగరానికి పచ్చందాలు అద్దేందుకు హెచ్‌ఎండీఏ ఏర్పాట్లు చేస్తోంది.

HYD : కాంక్రీట్‌ నగరం.. పచ్చటి హారం.. HMDA ఏర్పాట్లు

  • ఎనిమిదో విడత హరితహారానికి 5.40 కోట్ల మొక్కలు
  • ప్రజలకు ఉచితంగా పంపిణీకి హెచ్‌ఎండీఏ ఏర్పాట్లు
  • ప్రైవేట్‌ సంస్థలకు డబ్బులిస్తేనే విక్రయం

హైదరాబాద్‌ సిటీ : ఎటు చూసినా ఎత్తైన భవనాలతో విస్తరిస్తున్న కాంక్రీట్‌ నగరానికి పచ్చందాలు అద్దేందుకు హెచ్‌ఎండీఏ ఏర్పాట్లు చేస్తోంది. ఎనిమిదో విడత హరితహారానికి 5.40 కోట్ల మొక్కలను సిద్ధం చేసింది. తెల్లాపూర్‌ నర్సరీలో మాదిరిగా నగర శివారులో సుమారు 10 నుంచి 50 ఎకరాల విస్తీర్ణంతో 48 నర్సరీల్లో వీటిని పెంచారు. నగరం నలుమూలల పెద్దఎత్తున నర్సరీలు ఏర్పాటు చేసి ఈ స్థాయిలో మొక్కలను పెంచడం ఇదే తొలిసారి. పట్టణీకరణలో పచ్చదనానికి ప్రాముఖ్యతనిస్తున్న హెచ్‌ఎండీఏ ‘‘అడవులను పెంచుదాం.. వానలు రావాలి.. కోతులు  పోవాలి’’ అన్న సంకల్పంతో అడుగులేస్తోంది 


రూ. 35 కోట్లతో పెంపకం

తెల్లాపూర్‌, మోఖిల్లా, శంషాబాద్‌, ఘట్‌కేసర్‌, వనస్థలిపురం, పెద్ద అంబర్‌పేట ఇలా పలు ప్రాంతాలను ఎంపిక చేసి ఆయా ప్రాంతాల్లో రూ. 35 కోట్ల వ్యయంతో 5.40 కోట్ల మొక్కలను పెంచుతోంది. ఇందులో రెండు మీటర్లకు పైగా ఎత్తుగల మొక్కలు 1.20 కోట్ల వరకు ఉన్నాయి. వర్షాలు ప్రారంభమవగానే శివారుల్లో ఖాళీ స్థలాల్లో మొక్కలను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


సంపద వనాలకు ప్రాధాన్యం

సంపద వనాలకు హెచ్‌ఎండీఏ ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. 2లక్షల చింత చెట్లతోపాటు 3.26 లక్షల శ్రీగంధం, 1.60 లక్షల టేకు మొక్కలను పెంచుతోంది. సాధారణ ప్రజలకు ఒకటి, రెండు మొక్కలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ప్రైవేట్‌ సంస్థలకు డబ్బులు చెల్లిస్తేనే ఇవ్వనున్నారు. ఈత మొక్కలను కూడా పెంచుతున్నారు.


40 చెరువుల చుట్టూ 40 లక్షల మొక్కలు

శివారు ప్రాంతాల్లోని 40 చెరువుల చుట్టూ 40 లక్షల మొక్కలను నాటేందుకు హెచ్‌ఎండీఏ ప్రణాళికలు రూపొందించింది. చెరువుల సమీపంలో ప్రభుత్వ భూములుంటే పార్కు మాదిరిగా తీర్చిదిద్దనున్నారు. పూలమొక్కలను పెంచి చెరువుల వెంట ఆహ్లాదకర వాతావరణం ఏర్పడేలా చేయనున్నారు. 


మియావాకి పద్ధతిలో..

ఔటర్‌ రింగ్‌ రోడ్డులోని పలు ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్ల వద్ద, ఉస్మానియా యూనివర్సిటీతోపాటు పలు ప్రాంతాల్లో ఖాళీ స్థలాలను గుర్తించి మియావాకి పద్ధతిలో మీటర్‌కు ఓ మొక్క నాటి చిట్టడవులను తయారు చేశారు. హెచ్‌ఎండీఏ లంగ్‌స్పేస్‌ అభివృద్ధి చేస్తున్న శివారులోని 16 అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌లలో రెండింటిలో మియావాకి పద్ధతిలో ఖాళీస్థలాల్లో మొక్కలను పెంచారు. అదే తరహాలో మరో 14 అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌లలో కూడా మియావాకి పద్ధతి అనుసరించి పెద్దఎత్తున మొక్కలు నాటనున్నారు.


పూలు, పండ్ల మొక్కలు

నర్సరీల్లో గులాబీ, మందార, ప్లూమేరియా పూడిక, బోగన్‌ విలాపం, చామంతి, నందివర్ధన్‌, గన్నేరు, పారిజాతం, టెంపుల్‌ ట్రీలు, టేబుల్‌ రోస్‌, సిసల్‌పూనియా, గడిచోడి, జాస్మిన్‌ తదితర పూల మొక్కలు, జామ, పనాస, ఉసిరి, నిమ్మ, సపోట, దానిమ్మ, అల్లనేరుడు, మామిడి, బొప్పాయి, ఆయుర్వేద మొక్కలు, సిట్రోనెల్లా, లెమన్‌ గ్రాస్‌, అశ్వగంధం, గోరింటాకు వంటి  154 రకాలు మొక్కలు పెంచుతున్నారు.


ఎవెన్యూ ప్లాంటేషన్‌

ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెంట ఇరువైపులా నాటిన ఎవెన్యూ ప్లాంటేషన్‌ తరహాలో పలు జాతీయ, రాష్ట్రీయ రహదారుల్లో మొక్కలను పెంచేందుకు ప్రణాళికలు రూపొందించారు. 150 కిలోమీటర్లు విస్తరించాలని నిర్ణయించారు. మరో 50కిలోమీటర్ల ఎవెన్యూ ప్లాంటేషన్‌కు ప్లాన్‌ చేస్తున్నారు. వరంగల్‌ రోడ్డులో భువనగిరి నుంచి పెంబర్తి వరకు, శ్రీశైలం రోడ్డులో పహాడిషరీఫ్‌ నుంచి తుక్కుగూడ వరకు, నాగార్జున్‌సాగర్‌ రోడ్డులో ఆదిభట్ల నుంచి ఇబ్రహీంపట్నం మీదుగా మాల్‌ వరకు, 161వ జాతీయ రహదారిలో రాంసాన్‌పల్లి నుంచి కంది వరకు ఇరువైపులా మొక్కలను పెంచనున్నారు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో సుమారు 20 పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. 40 లక్షల మొక్కలను పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు.


హైదరాబాద్‌ ట్రీసిటీ కొనసాగింపు బాధ్యత అందరిది..

దేశంలో నెంబర్‌ వన్‌ ట్రీసిటీగా గ్రేటర్‌ హైదరాబాద్‌ గుర్తింపు పొందింది. అది కొనసాగించాల్సిన బాధ్యత అందరిది. హైదరాబాద్‌ అభివృద్ధితోపాటు పర్యావరణం ముఖ్యం. ప్రాధాన్యత క్రమంలో నగరానికి లంగ్‌స్పే్‌సను అభివృద్ధి చేస్తున్నాం. ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెంట పచ్చదనం హైదరాబాద్‌ ట్రీసిటీ అనేందుకు తలమానికంగా మారింది. మొక్కలను పెంచడం, నాటడమే కాదు బతికించాలి. భవిష్యత్‌ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత మనందరిది. - అర్వింద్‌కుమార్‌, హెచ్‌ఎండీఏ కమిషనర్‌, స్పెషల్‌ సీఎస్‌. 

Updated Date - 2022-06-10T15:07:38+05:30 IST