భూములకు ‘మహా’ కంచె

ABN , First Publish Date - 2022-04-17T16:29:10+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు శివారు జిల్లాలో విస్తరిస్తున్న ప్రాంతాలకు అనుగుణంగా మెరుగైన మౌలిక సదు పాయాల కల్పన కోసం హెచ్‌ఎండీఏకు అప్పట్లో

భూములకు ‘మహా’ కంచె

హెచ్‌ఎండీఏ స్థలాలు కబ్జా కాకుండా..

అక్రమార్కులతో ఇంటి దొంగల కుమ్మక్కు

రాత్రికి రాత్రే వెలుస్తున్న ఇళ్లు, ప్రహరీలు

ప్రేక్షకపాత్ర వహిస్తున్న  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం


నగర శివారులోని హెచ్‌ఎండీఏ భూములను కాపాడడం అధికారులకు సవాల్‌గా మారుతోంది. కొందరు ఇంటి దొంగలే అక్రమణదారులకు అండగా నిలుస్తుండడంతో కబ్జాపర్వం యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వ స్థలాల్లో రాత్రికి రాత్రే ఇళ్లు వెలుస్తున్నాయి. ప్రహరీలు నిర్మిస్తున్నారు. కబ్జాదారుల నుంచి హెచ్‌ఎండీఏ స్థలాలు కాపాడాల్సిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కూడా ప్రేక్షకపాత్ర వహిస్తోంది. హద్దురాళ్ల ఆధారంగా పూర్తిస్థాయిలో కంచె నిర్మించాలని, చ.గజం కూడా వదులుకోకూడదని హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సూచించినట్లు తెలిసింది.  


హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు శివారు జిల్లాలో విస్తరిస్తున్న ప్రాంతాలకు అనుగుణంగా మెరుగైన మౌలిక సదు పాయాల కల్పన కోసం హెచ్‌ఎండీఏకు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం 8,260ఎకరాలను కేటాయించింది. అప్పటికే ఆ భూముల్లో కొన్ని వివాదాల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌ మహానగరం చుట్టూ ఉండే భూములు అత్యధిక ధరలు పలుకుతున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలు, మెట్రోపాలిటన్‌ నగరాలతో పోల్చితే రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ హైదరాబాద్‌లో సానుకూలంగానే ఉండడంతో చ.గజం లక్షల్లో పలుకుతోంది. ఈ నేపథ్యంలో కొందరు ఈ స్థలాలపై కన్నేసి కబ్జా చేస్తున్నారు. దర్జాగా క్రయ, విక్రయాలు జరుపుతున్నారు. 


మూసాపేటలో హెచ్‌ఎండీఏకు భూములు ఉండగా, ఓ కబ్జాదారుడు ఆక్రమించి ఇల్లు నిర్మిస్తున్నాడు. హెచ్‌ఎండీఏ భూములకు సమీపంలోని కాలనీలో కబ్జాదారుడికి ఇంటి స్థలం ఉండగా అక్కడి డాక్యుమెంట్లను ఆధారం చేసుకొని జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతులు పొందాడు.  ఈ విషయం తెలిసిన హెచ్‌ఎండీఏ ఎస్టేట్‌ విభాగం అధికారులు పనులు అడ్డుకోగా కోర్టునుంచి స్టే తీసుకొచ్చినట్లు తెలిసింది. ఇలాంటి ఘటనలు మూసాపేటలోనే కాదు.. హెచ్‌ఎండీఏ భూములు ఉన్న మిగతా ప్రాంతాల్లోనూ జరుగుతున్నాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, మెదక్‌ జిల్లాల పరిధిలో మొత్తం 8,260 ఎకరాలు హెచ్‌ఎండీఏకు ఉండగా, అందులో 4వేల ఎకరాలకు పైగా వినియోగించుకున్నారు. అయితే సుమారు మూడు వేల ఎకరాల వరకు తమ భూములేనంటూ పలువురు కోర్టులో కేసులు వేసినట్లు తెలుస్తోంది. హెచ్‌ఎండీఏ భూములను ఆక్రమించడం, భూములపై కేసులు వేయడానికి కొందరూ ఉద్యోగులే తెర వెనుక సహకారం అందిస్తున్నారనే ఆరోపణలున్నాయి.


కబ్జాచేసి.. విక్రయాలు

జవహర్‌నగర్‌లో హెచ్‌ఎండీఏకు సుమారు రెండు వేల ఎకరాల వరకు భూములున్నాయి. ఇందులో చాలావరకు అక్రమించి పెద్దఎత్తున భూదందా చేస్తున్నారు. జవహర్‌నగర్‌లోని కొందరు కార్పొరేటర్లు హెచ్‌ఎండీఏలోని విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బందితో కుమ్మక్కై యథేచ్ఛగా వ్యాపారం చేస్తున్నారు. ఈ భూముల సంరక్షణ కోసం ప్రత్యేకంగా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అయినా ఫలితం ఉండడం లేదు. హెచ్‌ఎండీఏ భూములను ఆక్రమించి మరీ లేఅవుట్లను చేస్తున్నారు. వంద గజాలు రూ.4లక్షల నుంచి రూ.6లక్షల వరకు విక్రయిస్తున్నారు. నిర్మాణాలు చేసుకోవాలని, తాము అండగా ఉంటామని కొందరు కార్పొరేటర్లు బరితెగిస్తున్నారు. దీంతో రాత్రికి రాత్రే ఇళ్లు, ప్రహరీలు నిర్మిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన హెచ్‌ఎండీఏ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ప్రేక్షకపాత్ర వహిస్తున్నదనే ఆరోపణలున్నాయి. జవహర్‌నగర్‌లో రోజుకు వందలాది ట్రిప్పులు టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారని, హెచ్‌ఎండీఏ అధికారులకు సమాచారమిచ్చినా పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు.


 రూ.6కోట్లతో సంరక్షణ..

హెచ్‌ఎండీఏ భూములపై ఇటీవల కమిషనర్‌ ఆరా తీయడంతోపాటు సంరక్షణ చర్యలు కట్టుదిట్టం చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. భూముల చుట్టురా ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయాలని, కబ్జాదారులు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. తొలుత సుమారు రూ.6కోట్లతో 1200ఎకరాలకు కంచె ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. రాజేంద్రనగర్‌ మండలంలోని పుప్పాలగూడలో గల 452/1, 454/1 సర్వే నెంబర్లలోని 200ఎకరాలకు రూ.86.98లక్షలతో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టారు. జవహర్‌నగర్‌లోని సర్వే నెంబర్‌ 12లోని 301 ఎకరాలకు, సర్వేనెంబర్‌ 706లో ఉన్న 720ఎకరాలకు మొత్తం రూ.5.85కోట్లతో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కోర్టు వివాదాలు లేని భూములను దశలవారీగా ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి సంరక్షించడానికి చర్యలు చేపడుతున్నారు. 

Updated Date - 2022-04-17T16:29:10+05:30 IST