HYD : ఫ్లై ఓవర్లు.. స్కైవేలు.. రోడ్ల విస్తరణలు.. ఇక శివార్లపై HMDA ఫోకస్‌

ABN , First Publish Date - 2022-02-22T12:01:55+05:30 IST

శివారు ప్రాంతాల్లోనూ ఫ్లై ఓవర్లు, స్కైవేలు, రోడ్ల విస్తరణకు హైదరాబాద్‌ మహా...

HYD : ఫ్లై ఓవర్లు.. స్కైవేలు.. రోడ్ల విస్తరణలు.. ఇక శివార్లపై HMDA ఫోకస్‌

  • ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు


హైదరాబాద్‌ సిటీ : శివారు ప్రాంతాల్లోనూ ఫ్లై ఓవర్లు, స్కైవేలు, రోడ్ల విస్తరణకు హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) సిద్ధమైంది. ఇందుకోసం భారీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రధానంగా హైదరాబాద్‌కు ఉత్తరాన మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపడుతోంది. నగర శివారులోని వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల మధ్య కనెక్టివిటీ మరింత పెంచడానికి నాలుగు లైన్ల రహదారులు, వంతెనల నిర్మాణం కోసం ప్రభుత్వానికి హెచ్‌ఎండీఏ ప్రతిపాదనలు అందజేసింది.


నిజాంపేటలో..

మహానగరంలోనే కాకుండా విస్తరించిన శివారు ప్రాంతాలు కూడా అత్యంత రద్దీగా మారాయి. ముఖ్యంగా ఇటీవల ఏర్పడిన పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ఉదయం, సాయంత్రం వేళలో ట్రాఫిక్‌ చిక్కులు ఎదురవుతున్నాయి. నిజాంపేట కార్పొరేషన్‌ పరిధి బాచుపల్లి ఎక్స్‌ రోడ్డులో నిత్యం ట్రాఫిక్‌ జాం అవుతోంది. ఈ జంక్షన్‌ నుంచి మియాపూర్‌-గాజులరామారం, నిజాంపేట-భౌరంపేట మద్యల రాకపోకలు సాగుతుంటాయి. ఈ క్రమంలోనే మియాపూర్‌-గాజులరామారం మార్గంపై బాచుపల్లి జంక్షన్‌లో 1.3 కిలోమీటర్ల మేర ఆరు లేన్లుగా ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి హెచ్‌ఎండీఏ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. భూసేకరణ, నిర్మాణ వ్యయం అంచనాతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది.


భౌరంపేట వరకు రోడ్డు విస్తరణ

బాచుపల్లి చౌరస్తా నుంచి మల్లంపేట, శంభీపూర్‌, భౌరంపేట వరకు సుమారు ఆరు కిలోమీటర్ల మేర రూ.138 కోట్ల వ్యయంతో రోడ్డు విస్తరణ పనులను త్వరలో ప్రారంభించనున్నారు. ఈ మార్గంలోని రోడ్డు రెండు లైన్లుగా మాత్రమే ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి నిజాంపేట వైపు ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. దీంతో బాచుపల్లి చౌరస్తా నుంచి భౌరంపేట వరకు నాలుగు లేన్లుగా రోడ్డు విస్తరణ పనులు హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. భూసేకరణ పూర్తయితే త్వరితగతిన పనులు చేపట్టేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధి బహదూర్‌పల్లి ఎక్స్‌ రోడ్డు నుంచి కొంపల్లిలోని జాతీయ రహదారి మార్గాన్ని నాలుగులేన్లుగా మార్చేందుకు కూడా అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. 

Updated Date - 2022-02-22T12:01:55+05:30 IST