హెచ్ఎండీఏ డేటా గల్లంతేనా?

ABN , First Publish Date - 2021-11-10T16:48:12+05:30 IST

హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) వెబ్‌సైట్‌పై హ్యాకర్లు పంజా విసిరి సుమారు రెండు నెలలు గడుస్తున్నా.. కీలకమైన డేటా రికవరీ విషయంలో అధికారుల్లో పట్టింపు లేకపోవడం

హెచ్ఎండీఏ డేటా గల్లంతేనా?

హ్యాకర్లు పంజా విసిరినా.. ఫిర్యాదుకు వెనుకంజ

డేటా రికవరీపై పట్టింపేలేని అధికారులు

ఇక్కట్లలో దరఖాస్తుదారులు.. ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు

మాల్‌వేర్‌ దాడి జరిగి రెండు నెలలు


హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) వెబ్‌సైట్‌పై హ్యాకర్లు పంజా విసిరి సుమారు రెండు నెలలు గడుస్తున్నా.. కీలకమైన డేటా రికవరీ విషయంలో అధికారుల్లో పట్టింపు లేకపోవడం గమనార్హం. సెప్టెంబరు నెలలో హ్యాకర్లు మాల్‌వేర్‌తో దాడి చేయగా.. దాని ప్రభావం అదే నెల 7వ తేదీ నుంచి కనిపించడం ప్రారంభమైంది. 9వ తేదీకల్లా వెబ్‌సైట్‌ మొత్తం డీఫే్‌స(షట్‌డౌన్‌) అయిపోయింది. ఈ వెబ్‌సైట్‌లోని మొత్తం డేటాను హ్యాకర్లు తుడిచిపెట్టేశారు. పట్టణ ప్రణాళికలో అత్యంత కీలకమైన డెవల్‌పమెంట్‌ పర్మిషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(డీపీఎంఎ్‌స)లో డేటాను ఇప్పటికీ రికవరీ చేయలేదు. భవన నిర్మాణాలు, ఓపెన్‌/గేటెడ్‌ కమ్యూనిటీల లేఅవుట్‌ అనుమతుల డేటా వెబ్‌సైట్‌లో లేకపోవడంతో దరఖాస్తుదారులు హెచ్‌ఎండీఏ కార్యాలయానికి బారులు కడుతున్నారు. తమ దరఖాస్తుల డేటాను రికవరీ చేయాలంటూ వారు చేస్తున్న విజ్ఞప్తులన్నీ బుట్టదాఖలవుతున్నాయే తప్ప.. అసలేం జరుగుతోంది? డేటా రివకరీ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయా? లేదా టెక్నికల్‌ సిబ్బంది మొత్తానికి చేతులెత్తేశారా? అనే అంశాలపై ఎక్కడా స్పష్టత రావడం లేదు. అధికారులు కూడా దీనిపై ఎలాంటి ప్రకటన చేయడం లేదు. దీంతో.. లక్షల రూపాయల ఫీజులు చెల్లించి, అనుమతులు పొందినవారు.. ఇప్పుడు అనుమతి ప్రతులు, ఇతరత్రా డిజిటల్‌ డాక్యుమెంట్ల కోసం హెచ్‌ఎండీఏ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌(హెచ్‌జీసీఎల్‌), హెచ్‌ఎండీఏ, బీపీపీ ఇలా పలు బాధ్యతల్లో ఒకే అధికారి ఉండడంతో సంబంధిత దరఖాస్తులు పరిష్కారమవ్వక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


నిర్లక్ష్యమా? ఉద్దేశ పూర్వకమా??

డేటా రికవరీ విషయంలో అధికారుల తీరు హెచ్‌ఎండీఏలో నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. అదే సమయంలో.. ఉద్దేశపూర్వకంగా డేటాను దాచి పెడుతున్నారనే ఆరోపణలు, అనుమానాలు తలెత్తుతున్నాయి. బహుళ అంతస్తుల నిర్మాణాలు, గేటెడ్‌ కమ్యూనిటీ, లేఅవుట్‌లకు సంబంధించిన పొరపాట్లను కనుమరుగు చేసేందుకే.. డేటా మిస్సయిందనే నెపంతో తప్పించుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. హ్యాకర్ల దాడి జరిగి రెండు నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ ఉన్నతాధికారులు సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. పైగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి చెందిన డేటా మాత్రమే మాయమవ్వడం కూడా అనుమానాలకు తావిస్తోంది.


లక్షలు చెల్లించి.. ఇక్కట్లపాలు..

అనుమతుల కోసం లక్షలు చెల్లించిన దరఖాస్తుదారులు ఇప్పుడు హెచ్‌ఎండీఏ అధికారుల నిర్లక్ష్యానికి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. శంషాబాద్‌ జోన్‌కు చెందిన ఓ దరఖాస్తుదారుడు లేఅవుట్‌ అనుమతి కోసం నిర్ణీత మొత్తం చెల్లించారు. అంతా సవ్యంగా జరిగిందనుకున్నారు. డ్రాఫ్ట్‌ లేఅవుట్‌ను హెచ్‌ఎండీఏ అధికారులు విడుదల చేసే క్రమంలో వెబ్‌సైట్‌లోని డేటా మాయమైంది. బ్యాంకు చెల్లింపుల వివరాలు తీసుకుని, అధికారులు చుట్టూ తిరుగుతున్నా.. పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. ఇలా సుమారు 60 మంది డేటా మిస్సింగ్‌ బాధితులు నిత్యం హెచ్‌ఎండీఏ కార్యదర్శి కార్యాలయం చుట్టూ తిరుగుతుండడం గమనార్హం. 


హెచ్‌ఎండీఏకూ తిప్పలే

హెచ్‌జీసీఎల్‌ ఎండీగా విధులు నిర్వర్తిస్తున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి.. హెచ్‌ఎండీఏ కార్యదర్శిగా, ప్రధాన సమాచార అధికారి(సీఐవో)గా, బీపీపీ ఓఎస్డీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒకే అధికారి అన్నింటికీ ఇన్‌చార్జి కావడంతో.. ఆయా విభాగాల్లో వందల సంఖ్యలో ఫైళ్లు పేరుకుపోతున్నాయి. ఇప్పుడు డేటా మిస్సింగ్‌ దరఖాస్తులకు త్వరగా మోక్షం దొరక్కపోవడానికి ఇదే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇక డేటా మిస్సింగ్‌ వల్ల హెచ్‌ఎండీఏ ఉద్యోగుల జీత భత్యాల నుంచి పెన్షనర్ల వరకు, ఆఫీస్‌ నిర్వహణ, వివిధ రకాల అభివృద్ధి పనులు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, పచ్చదనం, పార్కుల నిర్వహణ.. ఇలా పలు పనుల నిర్వహణలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.


డేటా రికవరీ అంత కష్టమా?

మాల్‌వేర్‌ కారణంగా తుడిచిపెట్టుకుపోయిన డేటాను రికవరీ చేయడం పెద్ద కష్టమైన పనే కాదని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. సాధారణ షేర్డ్‌ హోస్టింగ్‌, క్లౌడ్‌ హోస్టింగ్‌ డేటాను సైతం.. సీ-ప్యానెల్‌లో ఉండే బ్యాక్‌అప్‌ ద్వారా రికవరీ చేసుకోవచ్చని గుర్తుచేస్తున్నారు. అలాంటిది కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఎన్‌ఐసీ.. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(సీజీజీ) సొంతంగా నిర్వహించే సర్వర్లలోంచి డేటాను రికవరీ చేయడం సులభమేనంటున్నారు. సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే.. నిందితులను గుర్తించి, చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అలాంటి వారు పట్టుబడితే.. ప్రభుత్వ వెబ్‌సైట్లలో లోపాల(వల్నరబిలిటీ్‌స)ను తెలుసుకుని, హ్యాకింగ్‌ దుర్బేద్యంగా అభివృద్ధి చేయవచ్చంటున్నారు.

Updated Date - 2021-11-10T16:48:12+05:30 IST