5,571 కొత్త హెచ్‌ఎం పోస్టులేవీ?

ABN , First Publish Date - 2022-06-03T09:16:20+05:30 IST

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలకు 10 వేల ప్రధానోపాధ్యాయుల పోస్టులను పెంచుతాం. కొత్తగా 5,571 హెచ్‌ఎం పోస్టులను

5,571 కొత్త హెచ్‌ఎం పోస్టులేవీ?

ఏడాది దాటినా అమలుకు నోచని సీఎం కేసీఆర్‌ హామీ  

సంఘాలతో పలుమార్లు సమావేశమైన మంత్రి సబిత  

ఏడేళ్లుగా పదోన్నతులు, నాలుగేళ్లుగా బదిలీలు లేవు 

10 రోజుల్లో స్కూళ్ల పునఃప్రారంభం.. నేటి నుంచి బడిబాట 

అయినా స్పందన లేని రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలకు 10 వేల ప్రధానోపాధ్యాయుల పోస్టులను పెంచుతాం. కొత్తగా 5,571 హెచ్‌ఎం పోస్టులను మంజూరు చేస్తాం. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలను చేపడతాం’ అని సీఎం కేసీఆర్‌ 2021 మార్చి 22న, తిరిగి ఈ ఏడాది మార్చిలోనూ అసెంబ్లీలో ప్రకటించారు.  సీఎం తొలి ప్రకటన చేసి 15 మాసాలు కావొస్తున్నా హెచ్‌ఎం పోస్టుల పెంపు, బదిలీలకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సైతం పలు మార్లు, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై చర్చించినా ఫలితం కనిపించడం లేదు. మరో పక్క వేసవి సెలవులు పూర్తయి మరో 10 రోజుల్లో పాఠశాలలు తిరిగి పునఃప్రారంభం కానున్నాయి. 3 నుంచి బడి బాట కార్యక్రమాన్ని ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో పదోన్నతులు, బదిలీలపై ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఏడేళ్లుగా పదోన్నతులు, నాలుగేళ్లుగా బదిలీలు లేకపోవడంతో వారు అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్రంలో సుమారు 1970 ప్రధానోపాధ్యాయులు, మరో 2,400ల ప్రైమరీ స్కూల్‌ హెచ్‌ఎంలు, 8,270 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  వీటిల్లో 70శాతం పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. కొత్తగా 5,571 ప్రధానోపాధ్యాయుల పోస్టులను మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. ఖాళీ పోస్టులతో పాటు, కొత్త పోస్టులు మంజూరు అయితే రాష్ట్రంలో మొత్తం 15 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కలుగుతాయని అంచనా వేస్తున్నారు.తెలంగాణ ఆవిర్భవించాక 2015లో పదోన్నతులు, బదిలీలను చేపట్టారు.తర్వాత 2018లో బదిలీలను మాత్రమే చేశారు. సాధారణంగా ప్రతీ రెండేళ్ళకు ఓసారి బదిలీలను నిర్వహించాల్సి ఉంటుంది. ఖాళీలను బట్టీ పదోన్నతులను ఇవ్వాల్సి ఉంటుంది. కానీ...రాష్ట్రంలో ఏడేళ్లుగా ఉపాధ్యాయుల పదోన్నతులను ఇవ్వడం లేదు. నాలుగేళ్లుగా బదిలీలను చేయడం లేదు.

కోర్పు తీర్పునకు లోబడే నిర్ణయం

రాష్ట్రంలో మరో 10 రోజుల్లో  వేసవి సెలవులు ముగిసి, మళ్లీ పాఠశాలు ప్రారంభం కానున్నాయి. అయితే... పదోన్నతులకు సంబంధించి ఇప్పటికీ కొత్త సర్వీసు రూల్స్‌ను కూడా రూపొందించలేకపోయారు. దాంతో ఇప్పట్లో టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయా ? అనే అనుమానం కలుగుతుంది. టీచర్ల పదోన్నతులపై పలు మార్లు సంఘాల ప్రతినిధులతో సమావేశమైన మంత్రి త్వరలోనే ఈ ప్రక్రియను చేపడుతామని గతంలో ప్రకటించారు. కానీ, ఇప్పటికీ ఈ ప్రక్రియ మొదలు కాలేదు.  తెలుగు, హిందీ పండిట్‌ పోస్టులు, పీఈటీల అప్‌గ్రేడేషన్‌పై, ప్రభుత్వ-స్థానిక సంస్థల స్కూళ్లను విలీనం చేయడం వంటి అంశాలపై ప్రస్తుతం కోర్టుల్లో కేసులు ఉన్నాయి. కొన్ని కేసుల్లో కోర్టు స్టే కూడా విధించింది. ఈ కేసులకు సంబంధించి ఈ నెల 17, 20 తేదీల్లో వాదనలు జరుగనున్నాయి. కోర్టు తీర్పు అనంతరం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  

పద్నోతులు, బదిలీలు చేపట్టాలంటే..

జూ ముందుగా ఆయా జిల్లాల వారీగా, మేనేజ్‌మెంట్ల వారీగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను కూడా రూపొందించాలి. ఆ తర్వాత పదోన్నతులు, బదిలీలపై మార్గదర్శకాల ను విడుదల చేసి, షెడ్యూల్‌ను ప్రకటించాలి. అయితే, కోర్టు కేసులు దృష్ట్యా ఇలాంటి పనులు ఇంకా మొదలు కాలేదు.  

జూ వివాదాల్లేని మోడల్‌ స్కూల్స్‌, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ)ల్లో పదోన్నతులు చేయవచ్చంటున్నారు. 

జూ బదిలీ కోరుకునే ఉపాధ్యాయుడు పని చేస్తున్న ప్రాంతంలో కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తయి ఉండాలి. అలాగే, ఒకే దగ్గర 8 ఏళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న వారు ఖచ్చితంగా బదిలీపై వెళ్లాలి. అయితే కొత్త జిల్లాల వారీ కేటాయింపుల్లో ఇటీవల బదిలీ అయిన వారికీ ఇప్పుడు అవకాశమివ్వాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.. 

6న టెన్త్‌ స్పాట్‌ కేంద్రాల్లో 

నిరసనలు: పోరాట కమిటీ     

బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ విడుదలలో జాప్యానికి నిరసనగా ఈనెల 6న టెన్త్‌ మూల్యాంకన కేంద్రాల వద్ద భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ఉపాధ్యాయ సంఘాల పోరాట రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఈ మేరకు కమిటీ ప్రతినిఽధి చావ రవి గురువారం ఒక ప్రకటనను విడుదల చేశారు. పాఠశాలల పునః ప్రారంభం నాటికి బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ విడుదల చేయాలని, లేకుంటే జూన్‌ మూడో వారంలో హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు. తదనంతరం షెడ్యూల్‌ విడుదలయ్యే వరకు నిరంతర పోరాట కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 


Updated Date - 2022-06-03T09:16:20+05:30 IST