ప్రమాదపుటంచున హెచ్చెల్సీ కాలువ

ABN , First Publish Date - 2020-11-30T05:45:38+05:30 IST

రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు తాగు, సాగునీటిని అందించే హెచ్చెల్సీ కాలువ ప్రమాదపుటంచుల్లో వుంది. కాలువ నిండుగా దాదాపు 2300 క్యూసెక్కుల మేర నీరు ప్రవహిస్తోంది. దీంతో పలుచోట్ల కాలువ గట్టుపై నుంచి నీరు కిందకు వెళుతున్నాయి.

ప్రమాదపుటంచున హెచ్చెల్సీ కాలువ
పైపింగ్‌ పడిన ప్రాంతంలో మరమ్మతు పనులు

గట్టుపై నుంచి కిందకు వెళుతున్న నీరు 

చిక్కణ్ణేశ్వర చెరువుకు పైపింగ్‌ 

కణేకల్లు, నవంబరు 29 : రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు తాగు, సాగునీటిని అందించే హెచ్చెల్సీ కాలువ ప్రమాదపుటంచుల్లో వుంది. కాలువ నిండుగా దాదాపు 2300 క్యూసెక్కుల మేర నీరు ప్రవహిస్తోంది. దీంతో పలుచోట్ల కాలువ గట్టుపై నుంచి నీరు కిందకు వెళుతున్నాయి. కణేకల్లు సమీపంలోని 140వ కిలోమీటర్‌ వద్ద హెచ్చెల్సీ కాలువ నుంచి పక్కనే ఉన్న పొలాల్లోకి నీరు ప్రవహించడంతో అక్కడి వరి పొలాలన్నీ మునిగిపోయాయి. అలాగే కణేకల్లు చిక్కణ్ణేశ్వర వడియార్‌ చెరువుకు నాగులకట్ట సమీపంలో పది అడుగుల మేర పైపింగ్‌ ఏర్పడటంతో అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేస్తున్నారు. హెచ్చెల్సీ కాలువ పాత డిజైన్‌ ప్రకారం కేవలం 2100 క్యూసెక్కులు మాత్రమే నీరు విడుదల చేయాలి. అయితే గత వారం రోజుల నుంచి 2300-2200 వరకు నీరు వస్తుండటంతో కాలువ అధిక నీటి సామర్థ్యాన్ని తట్టుకోలేక పోతోంది. అదేవిధంగా మాగాణి భూముల్లో వరి పంటలు చేతికి రాగా ఈ ప్రాంత రైతులు ఎవరూ నీటిని వినియోగించుకోవడం లేదు. దీంతో హెచ్చెల్సీ కాలువ నిండుకుండలా ప్రవహిస్తుండగా, మరోవైపు వర్షాలు కూడా కురుస్తుండటంతో నీళ్లన్నీ పలుచోట్ల కాలువ గట్టుపైకి వచ్చి ప్రమాదకరంగా మారాయి. గతంలో ఆధునీకరణ కోసం ప్రభుత్వాలు అరకొర నిధులు మంజూరు చేయడంతో ఈ ప్రాంతంలో నేటికీ హెచ్చెల్సీ ఆధునీకరణ పనులు చేయని పరిస్థితి వుంది. దీంతో పలు చోట్ల యూటీలు దెబ్బతినడంతో పాటు కాలువ కూడా కొన్నిచోట్ల బలహీనంగా మారింది. ఈపరిస్థితుల్లో హెచ్చెల్సీ కాలువలో ప్రవహిస్తున్న భారీ నీటితో ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితి నెలకొంది.

Updated Date - 2020-11-30T05:45:38+05:30 IST