మంగళసూత్రం లాంటిదే హిజాబ్: కాంగ్రెస్ ఎంపీ

ABN , First Publish Date - 2022-02-08T20:48:16+05:30 IST

ముస్లిం బాలికలు హిజాబ్ ధరిస్తే చదువుకు దూరం అవుతున్నారు. మన దేశాన్ని ఎటువైపుకు తీసుకెళ్తున్నాం? మన వైవిధ్యాన్ని కోల్పోకూడదు. నేను ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రికి విజ్ణప్తి చేస్తున్నాను. ఆ బాలికల రాజ్యాంగ హక్కును రక్షించండి..

మంగళసూత్రం లాంటిదే హిజాబ్: కాంగ్రెస్ ఎంపీ

న్యూఢిల్లీ: హిందువులకు మంగళసూత్రం ఎలాగో ముస్లింలకు హిజాబ్ అలాగేనని కాంగ్రెస్ ఎంపీ టీఎన్ ప్రతాపన్ అన్నారు. కర్ణాటకలోని ఉడిపిలోని ఓ విద్యా సంస్థలో హిజాబ్‌పై చెలరేగిన వివాదం దేశవ్యాప్తంగా పెద్ద చర్చగా మారిన విషయం తెలిసిందే. కాగా, మంగళవారం లోక్‌సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘బాలికలు కాలేజీ బయట కూర్చుని తమ ప్రాథమిక హక్కుల గురించి ప్రశ్నిస్తున్నారు. హిజాబ్ తమ సంస్కృతిలో భాగమని ఆ బాలికలు అంటున్నారు. నిజమే.. ఎవరి సంస్కృతీసంప్రదాయాలు వారికి ఉంటాయి. హిందూ స్త్రీలు మంగళసూత్రాలు ధరిస్తారు, సిక్కులు టర్బన్లు ధరిస్తారు, క్రైస్తవులు శిలువ ధిరస్తారు. అలాగే ముస్లిం మహిళలు హిజాబ్ ధరిస్తారు. హిందువులకు మంగళసూత్రం ఎలాగో ముస్లింలకు హిజాబ్ అలాగే’’ అని అన్నారు.


ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ముస్లిం బాలికలు హిజాబ్ ధరిస్తే చదువుకు దూరం అవుతున్నారు. మన దేశాన్ని ఎటువైపుకు తీసుకెళ్తున్నాం? మన వైవిధ్యాన్ని కోల్పోకూడదు. నేను ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రికి విజ్ణప్తి చేస్తున్నాను. ఆ బాలికల రాజ్యాంగ హక్కును రక్షించండి. విలువైన విద్యను వారికి దూరం చేయకండి. అదే నిజమైన ‘సబ్‌కా సాత్.. సబ్‌కా వికాస్’’ అని అన్నారు.

Updated Date - 2022-02-08T20:48:16+05:30 IST