Aids: హెచ్‌ఐవీ కేసుల్లో మూడో స్థానం

ABN , First Publish Date - 2022-08-11T17:25:18+05:30 IST

దేశంలో హెచ్‌ఐవీ కేసులు క్రమేపీ తగ్గుముఖం పడుతుండగా కర్ణాటక(Karnataka)లో పరిస్థితి ఒకింత ఆందోళన కలిగిస్తోందని ఆరోగ్యశాఖ

Aids: హెచ్‌ఐవీ కేసుల్లో మూడో స్థానం

                       - రాష్ట్రంలో 2.76 లక్షల మంది బాధితులు


బెంగళూరు, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): దేశంలో హెచ్‌ఐవీ కేసులు క్రమేపీ తగ్గుముఖం పడుతుండగా కర్ణాటక(Karnataka)లో పరిస్థితి ఒకింత ఆందోళన కలిగిస్తోందని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దేశంలో 51వేల మంది చిన్నారులతో సహా 24.01 లక్షల మంది హెచ్‌ఐవీ బాధితులు ఉండగా మహారాష్ట్ర అగ్రస్థానంలోనూ, ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) ద్వితీయ స్థానంలోనూ ఉన్నాయి. కర్ణాటక 2.76 లక్షల మంది హెచ్‌ఐవీ బాధితులతో మూడోస్థానంలో ఉందని అధికారులు వెల్లడించారు. 2021లో ఈ ప్రత్యేక సమీక్ష జరిపినట్టు పార్లమెంటు(Parliament)లో ఇటీవల స్వయంగా కేంద్ర ఆరోగ్యశాఖ వివరణ ఇచ్చిన సంగతి విదితమే. రాష్ట్ర ఎయిడ్స్‌ ప్రివెన్షన్‌ సొసైటీ(State AIDS Prevention Society) నాలుగేళ్లుగా ప్రతి ఏటా ఎయిడ్స్‌ పరీక్షలు నిరంతరంగా జరుపుతూనే వస్తోంది. ప్రస్తుత ఏడాది 4.32 లక్షలమందికి పరీక్షలు నిర్వహించగా వీరిలో 2,131 మందిలో ఎయిడ్స్‌ లక్షణాలు కనిపించినట్టు అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో 2017-18లో 18,862 మందికి, 2018-19లో 18,171 మందికి ఎయిడ్స్‌ సోకింది. 2019-20లో 15,685 మందికి, 2020-21లో 9,520 మందికి, 2021-22లో 10,632 మందికి ఎయిడ్స్‌ సోకినట్టు ఆరోగ్యశాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది. ప్రత్యేకించి ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని జిల్లాల్లో ఎయిడ్స్‌ కేసులు అధికంగా బయటపడుతుండడంతో అప్రమత్తంగా ఉండాల్సిందిగా జిల్లా ఆరోగ్యశాఖను ఆదేశించినట్టు అధికారులు పేర్కొన్నారు. సురక్షితం కాని లైంగిక ప్రక్రియపై ప్రజలను జాగృత పరుస్తూనే ఉన్నామని, అయినా కూడా కేసులు పెరుగుతుండడంతో ఆరోగ్యశాఖ అధికారులను అప్రమత్తం చేశామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కే సుధాకర్‌ బుధవారం మీడియాకు తెలిపారు. 

Updated Date - 2022-08-11T17:25:18+05:30 IST