పైసలు కొట్టు.. పట్టా పట్టు..!

ABN , First Publish Date - 2022-08-05T05:07:09+05:30 IST

మండలంలో భూఅక్రమాలు ఆగడం లేదు. రికార్డుల మాయాజాలం ఎక్కువైంది. అధికారపార్టీ అండదండలతో కొందరు రెవెన్యూ అధికారులు రెచ్చిపోతున్నారు. సంపాదనే లక్ష్యంగా అక్రమాలకు తెగబడుతున్నారు. పైసలిస్తే చాలు ప్రభుత్వ భూములతో పాటు కొత్తగా పట్టా భూములను కూడా పంచేస్తున్నారు. ఇటీవల కాలంలో ముఖ్యంగా పట్టా భూములను, ప్రభుత్వ భూములను భూఅక్రమార్కులకు యథేచ్ఛగా ఆన్‌లైన్‌ చేశారు. ఇతరులు అని నమోదై ఉన్న భూములను ఎలాంటి ఆధారం లేకపోయినా కనీసం సంబంధిత వీఆర్వోలకు తెలియకుండా నేరుగా ఆన్‌లైన్‌ చేశారు.

పైసలు కొట్టు.. పట్టా పట్టు..!
నాగెళ్లముడుపులో ఆన్‌లైన్‌ చేసిన భూమి (ఇన్‌సెట్లో) అక్రమంగా ఆన్‌లైన్‌ చేసిన అడంగల్‌

భూఅక్రమాలకు నిలయంగా

తర్లుపాడు తహసీల్దార్‌ కార్యాలయం

రికార్డులు తారుమారు.. డబ్బులిస్తే ఆన్‌లైన్‌

ఆరునెలల పాటు ఇన్‌చార్జి ఇష్టారాజ్యం

ప్రస్తుతం అతనే డీటీగా వ్యవహారాలు

అతనిపై విచారణ కూడా బుట్టదాఖలు

తర్లుపాడు, ఆగస్టు 4:

తర్లుపాడు తహసీల్దార్‌ కార్యాలయం భూ అక్రమాలకు నిలయంగా మారింది. ఎన్నిసార్లు ఉన్నతాధికారులు విచారణ జరిపి సీరియస్‌గా హెచ్చరించినప్పటికీ కొందరు అధికారులు, సిబ్బంది తీరులో మార్పు లేదు. పైసల్‌ కొడితే ప్రభుత్వ భూములైనా, ఇతరుల పేరుతో ఉన్న భూములైనా వెంటనే పట్టాలు ఇచ్చేస్తారు. గతంలో ఇన్‌చార్జి తహసీల్దార్‌గా ప్రస్తుతం డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న అధికారి అక్రమాలకు కేంద్రబింధువుగా మారరని బాధితులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈయన ఇన్‌చార్జి తహసీల్దార్‌గా పనిచేసిన సమయంలో చేసిన అనేక అక్రమాలు ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ఇద్దరు దళారులను నియమించుకొని వారి ద్వారా భూఆక్రమణదారుల నుంచి లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.


 మండలంలో భూఅక్రమాలు ఆగడం లేదు. రికార్డుల మాయాజాలం ఎక్కువైంది. అధికారపార్టీ అండదండలతో కొందరు రెవెన్యూ అధికారులు రెచ్చిపోతున్నారు. సంపాదనే లక్ష్యంగా అక్రమాలకు తెగబడుతున్నారు. పైసలిస్తే చాలు ప్రభుత్వ భూములతో పాటు కొత్తగా పట్టా భూములను కూడా పంచేస్తున్నారు. ఇటీవల కాలంలో ముఖ్యంగా పట్టా భూములను, ప్రభుత్వ భూములను భూఅక్రమార్కులకు యథేచ్ఛగా ఆన్‌లైన్‌ చేశారు. ఇతరులు అని నమోదై ఉన్న భూములను ఎలాంటి ఆధారం లేకపోయినా కనీసం సంబంధిత వీఆర్వోలకు తెలియకుండా నేరుగా ఆన్‌లైన్‌ చేశారు. ఈయనకు తోడుగా కంప్యూటర్‌ ఆపరేటర్‌ కూడా భారీగా వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. ఇన్‌చార్జి తహసీల్దార్‌ పనిచేసిన ఆరునెలల కాలంలోనే కోట్ల విలువైన భూములను అప్పనంగా అధికారపార్టీ నాయకులకు ఆన్‌లైన్‌ చేసినట్లు తెలుస్తోంది. అతను గతంలో గిద్దలూరు డీటీగా పనిచేస్తుండగా అధికార పార్టీ నాయకులు తాము చెప్పిన పనులు చేస్తాడనే నమ్మకంతో ఫిబ్రవరిలో ఇన్‌చార్జి తహసీల్దార్‌గా తర్లుపాడు కార్యాలయానికి తీసుకొచ్చారు. కార్యాలయంలో అప్పటికే సీనియర్‌ డీటీ వెంకటేశ్వర్లు ఉన్నప్పటికీ ఆయనకు ఇన్‌చార్జి తహసీల్దార్‌ ఇవ్వకుండా కేవలం రెండేళ్ల అనుభవం ఉన్న అధికారికి ఇవ్వడం అప్పట్లో జనంలో చర్చనీయాంశమైంది. ఇదే అదనుగా అధికారపార్టీ నాయకుల అండదండలతో ఇష్టానుసారం రికార్డులు మార్చేశారు. 


అక్రమాలలో కొన్ని..

నాగెళ్లముడుపు ఇలాకాలో సర్వే నెం.101-1లో 3.94 ఎకరాల భూమి ఇతరుల పేర్లు ఉంటే సంబంధిత వీఆర్వోకు తెలియకుండా నేరుగా జూలై 2న కొందరు అక్రమార్కులకు ఆన్‌లైన్‌ చేశారు. ఈ భూమి విలువ ఎకరా రూ.10 లక్షలు పలుకుతుంది. చెన్నారెడ్డిపల్లి ఇలాకాలో సర్వే నెం.156-2లో ఇతరుల పేర్లు ఉంటే నేరుగా ఆన్‌లైన్‌ చేశారు. కేతగుడిపి ఇలాకాలో 9 ఎకరాల్లో రహదారులకు అవసరమైన కంకర, మిక్సిడ్‌ తయారీ పరిశ్రమలు ఉన్నాయి. మొన్నటివరకు ప్రభుత్వ రికార్డుల్లో ఈ భూమి వ్యవసాయేతరదిగా ఉంది. అయితే ఈయన బాధ్యతలు చేపట్టిన మూడో రోజే ఫిబ్రవరి 21న వ్యవసాయ భూములుగా ఆన్‌లైన్‌ చేశారు. ఆయన పనిచేసిన ఆరునెలల కాలంలో కలుజువ్వలపాడు, రోలుగుంపాడు, కేతగుడిపి, నాగెళ్లముడుపు, చెన్నారెడ్డిపల్లి ఇలాకాల్లో మరిన్ని అక్రమాలు చేసినట్లు సమాచారం. ఉన్నతాధికారులు విచారణ చేపడితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 


గతంలోనూ ఇన్‌చార్జిపై విచారణ

రెండునెలల క్రితం మండలంలో జరిగిన భూఅక్రమాలను ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకురావడంతో ఉన్నతాధికారులు మార్కాపురం ఆర్డీఓ లక్ష్మీ శివజ్యోతిని విచారణాధికారి నియమించారు. ఆమె మండల కార్యాలయానికి  వచ్చి విచారణ జరిపి రికార్డుల మాయాజాలం నిజమేనని తేల్చారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతోపాటు కఠినచర్యలకు సిఫార్సు చేస్తానని తెలిపారు. అయితే తర్వాత ఏం జరిగిందో ఏమో ఎటుచర్యలు తీసుకోలేదు. అధికారపార్టీ కీలక నేత ఒత్తిడితోనే తదుపరి చర్యలు ఆగినట్లు సమాచారం. దీంతో అతను మరింత రెచ్చిపోయి అక్రమాలకు తెగబడటం గమనార్హం. గతంలో ఓ జూనియర్‌ అసిస్టెంట్‌ను చేర్చుకొనే విషయంలో అధికారపార్టీ నాయకుల ఆదేశాలు లేవనే సాకుతో పెండింగ్‌ పెట్టారు. జూనియర్‌ అసిస్టెంట్‌ పదిరోజులు తిరిగి చివరికి కలెక్టర్‌ ఫిర్యాదు చేయడంతో ఇన్‌చార్జి తహసీల్దార్‌కు మెమో ఇచ్చారు. అయిన కూడా అతని ప్రవర్తనలో ఎటువంటి మార్పులేదు.


జనాన్ని పీక్కుతింటున్నారు

తర్లుపాడు తహసీల్దార్‌ కార్యాలయంలో ఏ పనులు కావాలన్నా కంప్యూటర్‌ ఆపరేటర్‌కు మొక్కుబడి చెల్లించాల్సిందే. పైసలు ఇవ్వని వారు ఏళ్లతరబడి తిరిగినా పనులు కావు. పైసలు  ఇస్తే పక్కనే కూర్చోబెట్టుకొని పనిచక్కదిద్ది పంపుతాడు. అతను చేసిన అక్రమాలు అనేకసార్లు పత్రికల్లో వచ్చినప్పటికీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడంతో మరింత రెచ్చిపోయారు.


అవన్నీ నా దృష్టికి రాలేదు..

- పీవీ కృష్ణారెడ్డి, తహసీల్దార్‌

నేను బాధ్యతలు తీసుకుని నెలరోజులైంది. ఇలాంటి రికార్డుల మార్చిన వ్యవహారాలు నా దృష్టికి రాలేదు. వెంటనే పరిశీలిస్తాను. కార్యాలయ సిబ్బంది ఏదైనా అక్రమాలకు పాల్పడినట్లు తేలితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను. ఎంతటి ఒత్తిళ్లు ఎదురైనా వదిలేదు లేదు. 


Updated Date - 2022-08-05T05:07:09+05:30 IST