కారుతో ఢీకొట్టి.. కత్తులతో నరికి

ABN , First Publish Date - 2022-08-14T07:43:54+05:30 IST

మరో అడ్వొకేట్‌ దారుణ హత్యకు గురయ్యాడు. కారుతో వెంబడించి.. ఢీకొట్టి.. కత్తులతో, వేటకొడవళ్లతో నరికిన దారుణంగా హత్య చేశారు.

కారుతో ఢీకొట్టి.. కత్తులతో నరికి

సర్పంచ్‌ భర్తను హతమార్చిన ప్రత్యర్థులు

హతుడు విజయ్‌రెడ్డి జూనియర్‌ అడ్వొకేట్‌

ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పాత్ర: సర్పంచ్‌

నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలో ఘటన

ఖండించిన న్యాయవాద సంఘాలు


నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలో ఘటన

తిప్పర్తి, ఆగస్టు 13: మరో అడ్వొకేట్‌ దారుణ హత్యకు గురయ్యాడు. కారుతో వెంబడించి.. ఢీకొట్టి.. కత్తులతో, వేటకొడవళ్లతో నరికిన దారుణంగా హత్య చేశారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి పోలీసుల కథనం ప్రకారం.. తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం సర్పంచ్‌(టీఆర్‌ఎస్‌) గాదె సంధ్య, భర్త విజయ్‌రెడ్డి(48) జిల్లా కేంద్రంలో జూనియర్‌ అడ్వొకేట్‌గా పనిచేస్తున్నారు. గ్రామంలో తమ వ్యవసాయ పొలాన్ని సాగుచేస్తున్న విజయ్‌రెడ్డి.. రెండ్రోజులకోసారి పొలానికి వచ్చేవారు. శనివారం కూడా ఆయన ఉదయం నుంచి పొలం పనులు చూసుకున్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో తన మోటార్‌సైకిల్‌పై నల్లగొండకు తిరిగి బయలుదేరారు. అప్పటికే ఆ దారిలో ఎల్లమ్మగూడెం సమీపంలో మాటువేసిన ప్రత్యర్థులు(సుమారు నలుగురు).. అతణ్ని కారుతో ఢీకొట్టారు. బైక్‌ పైనుంచి కిందపడ్డ విజయ్‌రెడ్డి.. తనపై దాడి జరుగుతోందని గుర్తించేలోగా, కార్లోంచి దిగిన వ్యక్తులు కత్తులు, వేటకొడవళ్లతో అతనిపై దాడి చేశారు. రక్తపుమడుగులో పడిపోయిన విజయ్‌రెడ్డి.. చనిపోయాడని నిర్ధారించుకుని పారిపోయారు. కాగా.. గాదె సంధ్య టీఆర్‌ఎస్‌ తరఫున సర్పంచ్‌గా గెలిచారు. గ్రామాభివృద్ధిలో స్థానిక ఎమ్మెల్యే, పార్టీ ప్రజాప్రతినిధులు సహకరించడం లేదని ఆమె సర్పంచ్‌ పదవికి రాజీనామా చేశారు. జిల్లా కలెక్టర్‌ ఆమె రాజీనామాను ఆమోదించకపోవడంతో.. ప్రస్తుతం సర్పంచ్‌గానే కొనసాగుతున్నారు. అయితే.. గ్రామంలో జరిగిన మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించి అక్రమాలు జరిగాయంటూ కొందరు గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదుతో అధికారులు ఆమె చెక్‌పవర్‌ను రద్దుచేశారు. ఆ అధికారాన్ని ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శికి దఖలుపరిచారు. అప్పటి నుంచి ఆమె అధికార పార్టీ నేతలతో దూరంగా ఉంటూ వచ్చారు. 


హంతకులను త్వరలోనే పట్టుకుంటాం: సీఐ

సర్పంచ్‌ భర్త విజయ్‌రెడ్డి మృతికి కారణమైన హంతకులను త్వరలోనే పట్టుకుంటామని నల్లగొండ జిల్లా శాలిగౌరారం సీఐ రాఘవరావు తెలిపారు. హత్య విషయం తెలుసుకున్న సీఐ సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్‌టీం బృందంతో పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌ మృతదేహం వద్ద నుంచి గ్రామంవైపు కొంతదూరం వెళ్లి ఆగిపోయింది. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. విజయ్‌రెడ్డి హత్యపై న్యాయవాదులు తీవ్రంగా స్పందించారు. న్యాయవాదులపై దాడులు, హత్యలను నిరోధించేలా చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై హైకోర్టు సిటింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. 


ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి బద్ధశత్రువైండు

తన భర్త విజయ్‌రెడ్డి హత్యలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పాత్ర ఉందని, ఆయన తమకు బద్ధశత్రువయ్యాడని గాదె సంధ్య ఆరోపించారు. సంఘటనా స్థలంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. సర్పంచ్‌గా గెలిచిన నాటి నుంచి తమను ఎమ్మెల్యే ఓర్వడంలేదని చెప్పారు. ఎంపీటీసీ సందీ్‌పరెడ్డి, గ్రామస్థులు ఊట్కూరు ప్రవీణ్‌రెడ్డి, సునందరెడ్డి రాజకీయంగా ఎదుర్కోలేకనే తన భర్తను హతమార్చారని ఆరోపించారు.

- గాదె సంధ్య, ఎల్లమ్మగూడెం సర్పంచ్‌

Updated Date - 2022-08-14T07:43:54+05:30 IST