చరిత్రపై దుడ్డుకర్ర

ABN , First Publish Date - 2022-05-14T05:52:18+05:30 IST

చరిత్ర అంటే పిల్లలు చదువుకునే పాఠం మాత్రమే కాదు, అందరూ నేర్చుకోవలసిన గుణపాఠం. నడచివచ్చిన తోవను సమీక్షించుకుని, తప్పొప్పులను తరచిచూసుకుని, నడవవలసిన మార్గాన్ని నిర్ణయించుకోవడం సమాజాలు చేయవలసిన పని. కానీ, గతంలో జరిగిపోయిన తప్పులకు దిద్దుబాట్లను, ప్రతీకారాలను కానీ సంకల్పించి,...

చరిత్రపై దుడ్డుకర్ర

చరిత్ర అంటే పిల్లలు చదువుకునే పాఠం మాత్రమే కాదు, అందరూ నేర్చుకోవలసిన గుణపాఠం. నడచివచ్చిన తోవను సమీక్షించుకుని, తప్పొప్పులను తరచిచూసుకుని, నడవవలసిన మార్గాన్ని నిర్ణయించుకోవడం సమాజాలు చేయవలసిన పని. కానీ, గతంలో జరిగిపోయిన తప్పులకు దిద్దుబాట్లను, ప్రతీకారాలను కానీ సంకల్పించి, అదే చారిత్రక న్యాయం అనుకోవడం మూర్ఖత్వం. గతంలోని దుర్మార్గాలు కొనసాగుతూ ఉంటే, వాటిని నిరోధించాలి. చరిత్రలో తప్పులు చేసినవారు నేటికీ అవే తప్పులు చేస్తూ ఉంటే, దౌర్జన్యాల ఫలాలను అనుభవిస్తూ ఉంటే, ఆ స్థితిని చక్కదిద్దాలి. కానీ, దురదృష్టవశాత్తూ, గతంలో జరిగాయని భావించే కొన్ని సంఘటనలకు వర్తమానంలో ప్రతీకారాలు చేయడానికి భావోద్వేగాలను సమీకరించడం పెద్ద రాజకీయ కార్యక్రమమై పోయింది. ఆ రాజకీయాల నిర్వహణలో భాగంగా, చరిత్రకు వక్రవ్యాఖ్యానాలు చేసి, సమాజంలో విభజనలను తీవ్రం చేస్తున్నారు. గతానికి మరమ్మత్తులు చేయాలనే పెద్ద మనుషులు, భారతీయ సమాజంలో పరంపరాగతంగా వస్తున్న కులవ్యవస్థను నిర్మూలించి, బాధితులుగా ఉన్నవారిని సమాజశీర్షంలో నిలిపే విధంగా గొంతెత్తడానికి మాత్రం ఎందుకు ముందుకు రారో?


వేల సంవత్సరాల నాగరికతా ప్రస్థానం భారతదేశానిది. మతాల కంటె, కులాల కంటె ప్రాచీనమైనది ఇక్కడి జనావాస చరిత్ర. హరప్పా మొహంజోదారో నాగరికతల కాలానికి ఉన్న ఆరాధనా సంప్రదాయమేమిటో, మతమనదగ్గ సాంస్కృతిక సంపుటి ఆ రోజులలో ఉన్నదో లేదో మనకు ఇంకా తెలియదు. నాగరికత, సభ్యత, సంస్కృతి వలెనే, మతం కూడా రూపొందుతూ వచ్చిన విశేషం. గౌతమ బుద్ధుడు, మహావీర జైనుడి కాలానికి వైదిక మతంతో పాటు, అనేక చిన్న చిన్న మతాలు, మతధోరణులు, తాత్విక సంప్రదాయాలు ఉనికిలో ఉన్నాయి. శిల్పం కానీ, విగ్రహాలు కానీ, ధ్యానమందిరాలు కానీ బౌద్ధం ద్వారానే మొదట అవతరించాయి. రెండువేల సంవత్సరాలకు ముందు, మన దేశంలో అన్ని పార్శ్వాలూ ఉండే సంపూర్ణ శిల్పాలు లేవని, కొండరాళ్ల మీద, శిలాఫలకాల మీద చెక్కే ముఖపార్శ్వ శిల్పాలే ఉండేవని శిల్పచరిత్రకారులు చెబుతారు. ఒక మతం పోయి మరో మతం ఉధృతి పెరగడం మృదువుగా జరిగిన పరిణామం కాదు. బౌద్ధ స్థలాలన్నీ ఈనాడు దిబ్బలుగా, ధ్వంసమై కనిపించడానికి కారణం, విజేతలు చేసిన దౌర్జన్యాలో లేదా మతానికి ఆదరణ తగ్గి పాడుపడడమో కారణాలు. అనేక బౌద్ధ జైన స్థలాలు ఆలయాలుగా పరివర్తన చెందాయి కూడా. గౌతముడు జ్ఞానోదయం పొందాడని చెప్పే గయలోని ఆలయం కూడా బౌద్ధుల చేతిలో లేదు. బుద్ధుడే అవతరాలలో ఒకరిగా మారిపోయాడు. కాబట్టి, చరిత్రలో ఎవరి ఆలయాలను ఎవరు కూల్చారు, ఏ మత స్థలం కింద ఏమున్నది వంటి విచికిత్సలు వర్తమానానికి మంచిది కాదు. 


తాజ్‌మహల్ విషయంలో న్యాయస్థానం చెప్పినట్టు అటువంటి విషయాలను చరిత్రకారులకు వదిలివేయాలి. ఆధారాలు, అన్వయాలు అవసరమైన గంభీర విద్యా విషయాన్ని వీధి పోరాటాల ద్వారా పరిష్కరించలేము. లక్నో విశ్వవిద్యాలయంలో ఈ మధ్య జరిగిన సంఘటన, చరిత్రను వర్తమాన రాజకీయం కోసం కలుషితం చేస్తే ఏర్పడే అవాంఛనీయ ఉద్రిక్తతలను సూచిస్తుంది. ప్రస్తుతం వివాదం నడుస్తున్న వారణాసిలోని గ్యాన్‌వాపి మసీదు, విశ్వనాథాలయం అంశంపై చరిత్ర అధ్యాపకుడైన రమాకాంత్ చందన్ ఒక హిందీ వార్తా ఛానెల్ చర్చలో పాల్గొన్నారు. ఆయన చర్చావశంగా ఒక కథనాన్ని ప్రస్తావించారు. ఔరంగజేబు వారణాసికి వెళ్లినప్పుడు ఆయన వెంట ఉన్న రాజపరివారంలో కచ్‌కు చెందిన హిందూ రాచమహిళ ఉన్నదట, శివాలయం దర్శించాలనుకున్నవారంతా తిరిగి వచ్చినా ఆ రాచమహిళ వెనుకకు రాలేదట.


ఎందుకు ఆలస్యమైందని ఆరా తీస్తే, ఆలయ విశేషాలను చూపిస్తానని మభ్యపెట్టి, అక్కడి పూజారి ఒకరు ఆమెను గుడిలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి ఆభరణాలను అపహరించాడట. దానితో ఆగ్రహించిన ఔరంగజేబు, ఆ ఆలయాన్ని కూలగొట్టించాడట. ఆ మహిళ కోరిక మీదనే అక్కడ మసీదు నిర్మించాడట. ఇది ఒక కథనం మాత్రమే. దాని నిజానిజాలు తాను నిర్ధారించలేనని కూడా రమాకాంత్ చెప్పారు. ఆయన ఈ కథనాన్ని డాక్టర్ భోగరాజు పట్టాభిరామయ్య రచించిన ‘‘ఫెదర్స్ అండ్ స్టోన్స్’’ అన్న పుస్తకం నుంచి ఉటంకించారు. పట్టాభి క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో నిర్బంధంలో ఉన్నప్పుడు రాసుకున్న మ్యూజింగ్స్ ఆ పుస్తకం. విన్నవీ కన్నవీ రాస్తున్నానని ఆయన ముందుమాటలో రాసుకున్నారు. ఆసక్తికరమైన ఉదంతాలు అనేకం ఆ పుస్తకంలో కనిపిస్తాయి. గోలకొండను జయించిన తరువాత, కూడబెట్టిన ధనం అంతా ఎక్కడ ఉన్నదని అడిగితే, ఒక మసీదు కింద ఉన్నదని తానీషా చెప్పాడని, ఆ డబ్బుకోసం ఔరంగజేబు ఆ మసీదునే కూల్చాడని, అతనేమంత మతనిష్ఠ కలిగినవాడు కాదని కూడా ఒక కథనం ఆ పుస్తకంలో ఉన్నది. ఎప్పుడో 1946లో రాసిన ఒక పుస్తకంలోని ఒక కథనాన్ని ప్రస్తావిస్తే కూడా అపచారం అంటే ఎట్లా? దళిత విద్యావేత్త అయిన రమాకాంత్‌పై లక్నో విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులే దాడి చేశారు. అధ్యాపకులు ఎటువంటి చరిత్రను ప్రస్తావించాలో విద్యార్థులే నిర్దేశించే రోజులు వచ్చాయి. మతావేశంలో ఉన్న విద్యార్థులు ఆ కథనం వల్ల విశ్వనాథాలయంపై తమ వాదం బలహీనపడుతుందని భయపడి ఉండవచ్చు. కానీ, విడ్డూరం ఏమిటంటే, పోలీసులు విద్యార్థులను చెదరగొట్టడం, మందలించడం కాకుండా, ఆ అధ్యాపకుడి మీద కేసు నమోదు చేశారు. అది ఉత్తరప్రదేశ్ కదా!


నెహ్రూ, పటేల్, పట్టాభి అనే జెపిపి త్రయంలో ఒకరు, కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసినవారు, ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకులు అయిన భోగరాజు పట్టాభిరామయ్య రచన కూడా ఇవాళ వివాదాస్పదమై, ఉద్రిక్తతలకు దారితీస్తే, ఇది ఎంత అన్యాయం? ఇంతటి అసహనం మధ్య, చరిత్రపై ప్రజాస్వామిక చర్చ ఎట్లా జరుగుతుంది?

Read more