చరిత్ర చమత్కారం

ABN , First Publish Date - 2022-05-18T09:31:52+05:30 IST

ఫిలిప్పైన్స్ ప్రజలకు ఏమైంది? అని యావత్ ప్రపంచమూ బాధపడిపోతోంది, ఆశ్చర్యపోతోంది. ఆ దేశ ప్రజలు తమ అధ్యక్షుడిగా ఫెర్డినాండ్ ‘బాంగ్ బాంగ్’ మార్కోస్ ని ఎన్నుకున్నారు...

చరిత్ర చమత్కారం

ఫిలిప్పైన్స్ ప్రజలకు ఏమైంది? అని యావత్ ప్రపంచమూ బాధపడిపోతోంది, ఆశ్చర్యపోతోంది. ఆ దేశ ప్రజలు తమ అధ్యక్షుడిగా ఫెర్డినాండ్ ‘బాంగ్ బాంగ్’ మార్కోస్ ని ఎన్నుకున్నారు. ఈయన ఫిలిప్పైన్స్ ప్రజలను రాసిరంపానబెట్టిన మాజీ నియంత ఫెర్డినాండ్ ఇ. మార్కోస్ కుమారుడు. ఫిలిప్పినోస్ ప్రపంచానికి మరో షాక్ కూడా ఇచ్చారు. ప్రస్తుత అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టీ కుమార్తె సారా డ్యుటెర్టీ ఆ దేశ ఉపాధ్యక్షురాలు కాబోతున్నది. మాదకద్రవ్యాలను నియంత్రించే పేరిట వందలాదిమందిని కాల్చిపారేసినవాడు రోడ్రిగో డ్యుటెర్టీ. ఇంతటి ఘన వారసత్వం ఉన్న ఇద్దరికి ఫిలిప్పైన్స్ ప్రజలు దేశ సారథ్యం బాధ్యతను ఎలా అప్పగించారన్న ప్రశ్న అందరినీ దొలిచేస్తున్నది.


బాంగ్ బాంగ్ సాదాసీదాగా గెలవలేదు. మూడింట రెండువంతుల మెజారిటీతో ప్రజలు ఆయనను ఎన్నుకున్నారు. ఎన్నికలకు చాలాముందునుంచే ఆయన విజయం ఖాయమన్న ప్రచారం జరిగిపోయింది. ఏ నోట విన్నా ఆయన మాటే. నాలుగుదశాబ్దాల క్రితం అవినీతిపరుడనీ, మహాక్రూరుడనీ ఆగ్రహించి, ఉద్యమించి తండ్రిని తరిమికొట్టిన ప్రజలే ఇప్పుడు కుమారుడిని ఘనంగా స్వాగతించి పట్టంకట్టడం విచిత్రం. సీనియర్ మార్కోస్ దేశపాలకుడిగా ఉన్న రెండు దశాబ్దాల్లోనూ ప్రజలు నరకం చూశారు. 1965లో అధ్యక్షుడైన మార్కోస్, తన రెండోపదవీకాలం ముగియడానికి సరిగ్గా ఏడాదిముందు మార్షల్ లా ప్రకటించాడు. పార్లమెంటు రద్దయింది, ప్రతిపక్షనాయకులంతా జైళ్ళలోకి పోయారు, సైన్యం, పోలీసులు, కోర్టులు పూర్తిగా ఆయన నియంత్రణలోకి వచ్చాయి. రాజకీయ ప్రత్యర్థులనే కాదు, ప్రశ్నించేవారెవ్వరినీ మార్కోస్ వదిలిపెట్టలేదు. ఊచకోతలకు అడ్డూఆపూ లేకపోయింది. ఫిలిప్పైన్స్ చరిత్రలో అదో భయానక ఘట్టం. తీవ్రఅణచివేత, అవధుల్లేని అవినీతితో నియంతృత్వానికి మార్కోస్ మారుపేరైనాడు. జనం దుర్భరమైన పేదరికాన్ని అనుభవించారు, దేశం అప్పుల్లోకి జారిపోయింది. అమెరికా పారిపోయిన విపక్షనేత బెనింగో అక్వినో కొంతకాలం తరువాత మార్కోస్ మీద పోరాడాలన్న సంకల్పంతో తిరిగి 1983 ఆగస్టులో స్వదేశంలో కాలూనగానే మనీలా విమానాశ్రయంలోనే దారుణ హత్యకు గురైనాడు. ఇది ప్రజలను కదిలించి, ప్రజాస్వామ్య ఉద్యమానికి దారులు పరిచింది. ప్రజాగ్రహాన్ని చల్లార్చడానికి మార్కోస్ ఎన్నికలు ప్రకటించాల్సి వచ్చింది. బెనింగో భార్య కొరజాన్ అక్వినో ఎన్నికల్లో నిలబడి మార్కోస్ కు ముచ్చెమటలు పట్టించారు. కానీ, భారీ రిగ్గింగ్ తో మార్కోస్ విజయం సాధించడంతో ప్రజా ఉద్యమం మరింత ముమ్మరమైంది. దేశంలోని జనమంతా వీధుల్లోనే ఉన్నారు. ప్రజలమీద చేయివేయడానికి సైన్యం నిరాకరించింది. అక్కడి శాంతియుత ప్రజాఉద్యమాలు అన్ని దేశాల్లోనూ స్ఫూర్తినింపాయి. కొద్దిరోజుల్లోనే మార్కోస్ కుటుంబంతో సహా, దోచుకున్న నగదు, బంగారు ఇటుకలూ ఆభరణాలతో దేశం విడిచిపారిపోయాడు. ఆయన భార్య ఇమెల్డా మార్కోస్ విలాసవంతమైన జీవితానికి రుజువుగా వారి అధికారనివాసంలో వేలాది గౌన్లు, బూట్లు, కోట్లు ఇత్యాదివి ఉద్యమకారులకు దొరికాయి. 


అప్పటికి పాతికేళ్ళుదాటిన బాంగ్ బాంగ్ కూడా తండ్రితో పాటు దేశం విడిచిపారిపోయినవాడే. ఇంతటి ఘననేపథ్యం ఉన్న అతనిని తిరిగి ప్రజలు ఎలా ఆదరించారు, అధికారంలో కూచోబెట్టారన్నది ప్రశ్న. ఫిలిప్పీన్స్ ప్రస్తుత జనాభాలో ఎక్కువమంది 1986లో పుట్టి ఉండకపోవచ్చు కానీ, మార్కోస్ సాగించిన మారణహోమాన్ని, తమ పోరాటాలను అప్పటితరంవారు ఇప్పటివారికి చెప్పే ఉండాలి కదా? కేవలం మూడున్నరదశాబ్దాల్లో జనం మస్తిష్కాలనుంచి చరిత్రను చెరిపేయడం సాధ్యమా? తన విజయానికి జూనియర్ మార్కోస్ ప్రధానంగా సోషల్ మీడియాను నమ్ముకోవడం ఎంతగానో ఉపకరించిందని అంటారు. ఫిలిప్పీన్స్ ప్రజలు రోజుకు నాలుగుగంటలు సోషల్ మీడియాలో గడుపుతారనీ, దీనిని వేదికగా చేసుకొని మార్కోస్ ఓ కొత్త చరిత్ర రాశాడని అంటారు. తండ్రి నియంతృత్వం, అవినీతి, కర్కశత్వం శత్రువుల సృష్టిగా, తప్పుడు కథనాలుగా, ఆయన ఏలుబడి ఓ స్వర్ణయుగంగా, అటువంటి పాలనే దేశాన్ని ప్రగతిపథంలో నిలిపేదిగా ప్రజలు నమ్మేట్టు చేశాడట. ప్రస్తుత అధ్యక్షుడు డ్యుటర్టే కుమార్తె సారా కూడా ఇటువంటి ఘన వారసత్వంమీదనే ఉపాధ్యక్షస్థానంలో నెగ్గుకొచ్చింది. నియంతృత్వ లక్షణాలున్నవారిని ఆరాధించడం, దేశం బాగుపడాలంటే అటువంటివాళ్ళే పాలకులుగా ఉండాలనుకోవడం విచిత్రం, విపరీతం.

Updated Date - 2022-05-18T09:31:52+05:30 IST