Abn logo
Oct 1 2020 @ 00:22AM

చరిత్ర, సాక్ష్యాలు

ఇరవై ఎనిమిదేళ్ల కిందట, 1992 డిసెంబర్‌ 6వ తేదీన ఉత్తరప్రదేశ్‌ లోని ఫైజాబాద్‌ జిల్లా అయోధ్యలో జరిగిన బాబ్రీమసీదు కూల్చివేతకు సంబంధించి, బుధవారం నాడు లక్నో సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనది, ఆశ్చర్యకరమైనది, వివాదాస్పదమైనది కూడా. భారతీయ జనతాపార్టీకి చెందిన వయోధిక దిగ్దంతులు లాల్‌కృష్ణ అద్వానీ, మురళీమనోహర్‌ జోషి, కళ్యాణ్‌సింగ్‌, ఉమాభారతి, విశ్వహిందూ పరిషత్‌ అగ్రనేతలు అశోక్‌ సింఘాల్‌, గిరిరాజ్‌ కిశోర్‌, సాధ్వి రితంభర మొదలైన 32 మంది నిందితులను నిర్దోషులుగా న్యాయస్థానం తీర్పు చెప్పింది. బాబ్రీమసీదు విధ్వంసానికి ముందస్తు కుట్ర ఏదీ జరగలేదని, అప్పటికప్పుడు ఎవరో ఆవేశపూరితంగా ఉన్న జనం నుంచి జరిగిన సంఘటన అని, నిందితులుగా ఉన్నవారు కూల్చివేతను నిరోధించడానికి ప్రయత్నించారని న్యాయస్థానం భావించింది. 


తీర్పు మంచిచెడ్డల గురించిన స్పందనలు సహజంగానే మిశ్రమంగా ఉంటాయి. కొందరికి ఇది సంతోషించదగ్గ తీర్పుగాను, మరి కొందరికి బాధాకరమైన తీర్పుగాను ఉండడానికి అవకాశం ఉన్నది. సంబరాలు చేసుకుంటున్నవారు, మిఠాయిలు పంచిపెట్టుకుంటున్నవారు, తమ అభిమాన నాయకులపై అభియోగం తొలగినందుకు చాలా ఆనందంగా ఉన్నారు. అద్వానీ కూడా ఈ తీర్పును ‘చాలా గొప్ప తీర్పు’ అన్నారు. నిజానికి అద్వానీతో సహా నిర్దోషులుగా ప్రకటితులైన 32 మంది, డిసెంబర్‌ 6న జరిగిన సంఘటనకు ఏదో ఒక రూపంలో సంతోషించినవారే. కరోనాతో ఆస్పత్రిలో ఉండి కోర్టుకు వెళ్లలేకపోయిన ఉమాభారతి, తనను కనుక దోషిగా నిర్ణయిస్తే, బెయిల్‌ కోరకుండా సగర్వంగా శిక్షను అనుభవిస్తానని అన్నారు. ఆ గర్వం దేనికి సంబంధించిందో అర్థం చేసుకోవచ్చు. మాజీ ప్రధాని వాజపేయి బాబ్రీ మసీదు విధ్వంసం దురదృష్టకరమని, కరసేవకులలో కొందరు అదుపు తప్పడం వల్ల అది జరిగిందని ఒక సందర్భంలో అన్నారు. అదంతా ఎట్లా జరిగిందో తెలియదని, ఆవేశంతో అదుపు తప్పారా, నాయకత్వం మీద అసంతృప్తితో తీవ్ర చర్యకు పాల్పడ్డారా తనకు అర్థం కావడంలేదని 2000 సంవత్సరంలో అద్వానీ అన్నారు. భారతీయ జనతాపార్టీ అగ్రనేతలు ఇద్దరూ, మసీదును కూల్చివేయడంతో సాంకేతికంగా ఏకీభావం ప్రకటించలేదు, అట్లాగని ఆ సంఘటనతో తమను తాము దూరం చేసుకోలేదు కూడా. రామజన్మభూమి ఉద్యమంతో ఉన్న శ్రేణులన్నీ డిసెంబర్‌ 6న జరిగినదాన్ని సొంతం చేసుకున్నాయి, దానికి సంబంధించిన ఉద్వేగాలను దేశమంతా వ్యాపింపజేశాయి కూడా. 


అద్వానీ, వాజపేయి ఇరవయ్యేళ్ల కిందట ఏ వివరణ అయితే ఇచ్చారో, దానితో తాజా న్యాయనిర్ణయం సరిపోతుంది. 1992 డిసెంబర్‌ 6 నాడు అక్కడ ప్రత్యక్షంగా ఉన్న నాయకులు కూల్చివేతను ప్రోత్సహించారన్న కథనాలు ఉన్నాయి. వాటికి సాక్ష్యాలు లేవని న్యాయస్థానం పేర్కొన్నది. నిజానికి, విధ్వంసానికి కారణాలను కేవలం ప్రత్యక్షంగా, భౌతికంగా మాత్రమే, వ్యక్తులలో మాత్రమే వెదకడం సరి అయినది కాదు. ఒక క్రమంలో జరిగిన సంఘటనకు బాధ్యతను నిర్ధారించేటప్పుడు వివిధ దశలలో పోగుపడిన ఆవేశాలను, నాయకులిచ్చిన నినాదాలను, ఉద్యమలక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవాలి.


ఒక చోట ఒక కట్టడం ఉన్నది. దాని మీద వివాదం మొదలయింది. వివాదక్రమంలోనే దాన్ని కూల్చివేశారు. కూల్చివేత మీద నేర విచారణ, భూమి ఎవరదనే సివిల్‌ విచారణ– వేర్వేరుగా ప్రయాణించాయి. కూల్చివేత జరిగిన స్థలాన్ని కూల్చివేసిన వారికే ఇస్తూ సివిల్‌ వివాదంలో తీర్పు వచ్చింది. కూల్చివేసిన చోట మరో కట్టడం నిర్మించడానికి జరిగిన కార్యక్రమంలో సాక్షాత్తూ దేశప్రధానే పాల్గొన్నారు. ఇంతా జరిగిన తరువాత, కూల్చివేత నేరం మీద న్యాయనిర్ణయమన్నది విచిత్రంలోకెల్లా విచిత్రం. కూల్చివేత ఎందుకోసం జరిగిందో ఆ ప్రయోజనం నెరవేరడానికి మార్గం సుగమం అయినప్పుడు, కూల్చివేత తప్పని చెబితే మాత్రం ఉపయోగం ఏమిటి? రామాలయ నిర్మాణం ఆరంభం ఒక్కటే ప్రయోజనం కాదు, నిజానికి అది ఒక అనుబంధ ప్రయోజనం. అసలు ప్రయోజనం, పెద్ద ఎత్తున జనసమీకరణ, తద్వారా అధికారం. రామజన్మభూమి ఉద్యమమే తమ అధికారానికి రాచబాట వేసిందని బిజెపి నాయకులు ఏమాత్రం మొహమాటం లేకుండా ఒప్పుకుంటారు. ఆనాడు కూల్చివేత, అనంతర నిరసనలు, మత హింసాకాండ, పోలీసు కాల్పులు– వీటిలో ఎంతో ప్రాణనష్టం జరిగింది. విభజన వాతావరణం స్థిరపడింది. ప్రజలలో విభజన ఓట్లను ప్రభావితం చేస్తూ వచ్చింది. డిసెంబర్‌ 6 పర్యవసానాలు నేటి జాతీయ అధికారపీఠం రూపంలో చూస్తున్నాము. అయోధ్య వివాదం ఆసాంతం ప్రజాజీవితంలో బాహాటపు సన్నివేశం. సాక్ష్యాలు అక్కరలేని చరిత్ర అది. ఒక సంఘటన పర్యవసానాలన్నీ జరిగిపోయాక, ఆ సంఘటన బాధ్యులను నేరస్థులు అన్నా, నిర్దోషులు అన్నా తేడా ఏమీ ఉండదు. జరిగేది జరిగిపోయింది. మున్ముందు కూడా అట్లా జరిగే క్రమమే ఇంకా కొనసాగుతోంది. 


ఆ రోజు అక్కడ చట్టవ్యతిరేకమయిన సంఘటన అయితే జరిగింది. దానికి ముందస్తు కుట్ర ఏదీ జరగలేదని కోర్టు చెబుతున్నది. మరి చట్టవ్యతిరేకమయిన సంఘటనకు బాధ్యులు ఎవరు? వారిపై విచారణ ఉంటుందా? లేదా? కేంద్రప్రభుత్వ సంస్థ అయిన సిబిఐ ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ నిర్వహించింది. కింది కోర్టు తీర్పు ఇట్లా ఉన్నప్పుడు ప్రభుత్వ సంస్థ సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకుంటుందా లేదా? సుప్రీంకోర్టు చెప్పిన తరువాతనే ప్రాసిక్యూషన్‌ ఈ కేసులో నేరపూరిత కుట్ర అభియోగాన్ని చేర్చింది. ఆ సూచనను కిందికోర్టు తోసివేసిన తరువాత, అత్యున్నత న్యాయస్థానం పరిగణన ఎట్లా ఉంటుంది? ఇవన్నీ తేలవలసిన ప్రశ్నలు.

Advertisement
Advertisement
Advertisement