Abn logo
Jun 21 2021 @ 00:42AM

ఆయన మార్గం

దాదాపు నలభై ఏళ్ల క్రితం ఆంధ్రజ్యోతి వారపత్రికలో శ్రీశ్రీ కన్న శ్రీశ్రీ మార్గం గొప్పది అంటూ ఒక వ్యాసం వచ్చింది. దానిని కాళీపట్నం రామారావు రాసారు. ఆయన గురించి నలుగుతున్న ఆలోచనలలో ఆయన చేసుకున్న ఈ నిర్ధారణ గుర్తు వచ్చింది.


ఇపుడు ఆయన గురించి మాటాడవలసిన సందర్భం వచ్చింది, నిజమే. ఇలాంటి సందర్బం ఒకటి రాకూడదని నేను చాలా గట్టిగా కోరుకున్నాను. అది అసాధ్యమైన కోరిక. పుట్టినవారు గిట్టక తప్పదు. నెత్తిమీద మృత్యువును పెట్టుకుని తల్లి నుండి బయటపడుతుంది ప్రాణి. గుండె చప్పుడును చావు బాజాలతో పోల్చారు కవులు. జూన్‌ నాలుగు వచ్చింది. నిత్యం వింటున్న మృత్యు సందేశాలలో కారా ప్రశాంత మరణం ఒకటైపోయింది. నాబోటి వారు తమకు ఇష్టమైన వారి గురించి కోరుకునే అసాధ్యమైన కోరికల మరణంలో మరొకటి చేరింది.


మాస్టారు లేరు అనే సత్యం మెల్లగా నా మనసు ఒప్పుకుంది. కాని ఆయన సాహితీ సృజన ఉంది, జీవించిన పద్ధతిని గుర్తుచేస్తున్నాయి ఎందరెందరో స్మృతులు. స్థాపించిన కథానిలయం ఉంది. 


ఈ సందర్భంలో మాస్టారి గురించి కలబోసుకోవలసిన అంశం ఏమిటి? ఈ ప్రశ్న కలిగినపుడు వారి అబ్బాయి సుబ్బారావు శ్రీశ్రీపై వ్యాసాన్ని గుర్తు చేసారు. కారా నిర్ధారణ గుర్తు వచ్చింది. దారి దొరికినట్టయింది.


ఆయన మరో నిర్ధారణ ఉంది. తాజ్‌ మహల్‌ గొప్పదా? ధవిళేశ్వరం ఆనకట్ట గొప్పదా? ఈ ప్రశ్నకి జవాబు మరో ప్రశ్న రూపంలో వచ్చింది. మనిషికి అందం బ్రతుకిస్తుందా? ఆహారమా?

మరో సందర్భంలో ఆయన మరో ప్రశ్న వేసుకున్నారు. దోపిడీ కంటికి కనపడదు. పీడన వెంటనే తెలుస్తుంది. సాహిత్యంలో పీడన గురించి చెప్పి కళ్ల తడిపెట్టించవచ్చు. కాని కంటికి కనిపించని దానిని, గుండెకు పట్టని దానిని, మెదడుకు తట్టని దానిని కనిపించేట్టు చేస్తే? పట్టేటట్టు రాస్తే? తట్టేటట్టు విడమరిచితే? నిజమే.. కష్టమే.. కాని మార్గం వెతుక్కునే శక్తిని పఠితలో నింపాలి. సృజనకారుడు అందుకు పూనుకోవాలి. దోపిడీ మూలాలు వెతకాలి. వెతికించాలి. ఈ నిర్ధారణకి కూడా వచ్చారు.


ఈ మూడు నిర్ధారణలనూ కలిపి ఆలోచించాలి. ఆయన మూడు కృషులలో ఏది ఆయన ప్రధానంగా భావించారో నేను నిర్ధారించుకోవాలి. అది నలుగురి ముందూ ఉంచాలి. అప్పుడు ఆయన మార్గం గొప్పదా ఆయనే గొప్పవారా అనే ప్రశ్నకి జవాబు ఇచ్చుకోగలం.


నిజమే.. ఆయన కథానిలయం స్థాపించారు. సప్తతి నిండిన వయసులో సంకల్పించారు, దానికి రూపం ఏర్పరిచారు. దాని ఫలాలు అవసరమైన అందరికీ వేగంగా అందటం కళ్లతో చూడగలిగారు. దానికోసం పుస్తకాలు కావాలి, పత్రికలు కావాలి, రచయితల వివరాలు కావాలి, ధనం కావాలి... అందుకు జోలె పట్టుకుని తెలుగువారినెందరినో కలిసారు. మనసు ఫౌండేషన్‌ వంటి భారీ సంస్థలు మొదలుకుని ఎందరెందరో వ్యక్తుల వరకూ వివిధ రూపాలలో సహకరించారు. అటువంటి తాజ్‌మహల్‌ కళ్ల ముందుంటే అదే మనకు కనిపిస్తుంది, మాటాడాలంటే అదే మనసుని ఆక్రమిస్తుంది. చూసి మాటాడవచ్చు. 


అది విని మరిన్ని విశేషణాలు చేర్చవచ్చు. ప్రశంసలతో ముంచెత్తవచ్చు. నిజమే.. అది ప్రశంసనీయమైన కృషే. సంకల్పించిన వయసుని బట్టి చూస్తే మరింత హర్షించవచ్చు. అబ్బురపడవచ్చు.


కాని- రామారావు గొప్పదనంతో ఆగిపోతే మనం ఆయన ఆశించిన మార్గానికి చేరగలమా? నిజమే.. ఒక భవనం గానూ ఒక ప్రాంతపు అపురూప సంపద గానూ, ఒక ప్రాంతపు వ్యక్తి అనితరసాధ్య సాధన గానూ కథానిలయం గుర్తించబడితే అంతకన్న హర్షణీయం లేదు. అయితే బహుముఖీన వ్యక్తిత్వంతో ఆయన సాధించినవి అర్థం చేసుకోవాలంటే మనం కథానిలయంతో ఆగిపోరాదు కదా?


తప్పనిసరిగా ఆయన వ్యక్తిత్వంలోకి అడుగు పెట్టాలి. నేను అర్థం చేసుకున్న మేరకు ఆయనలో ముఖ్యమైనది వినగలగటం. వినగలిగితే ఎదుటి వారిపై సానుభూతి (sympathy) అంటే.. ఎదుటివారి ఆనందవిషాదాల పట్ల, అబిప్రాయాల పట్ల సానుకూల ధోరణి కలుగుతుంది. ఆ వినేశక్తి పూర్తిస్థాయిలో ఉంటే సహ అనుభూతి (empathy) అంటే.. ఎదుటివారి ఆనంద విషాదాలలో అభిప్రాయాలలో కలిసిపోవటం.. జరుగుతుంది. దానివల్ల ఇతరుల హృదయపు సవ్వడిలో మన హృదయపు సవ్వడి మిళితమవుతుంది. చెప్పే వాక్యాలతోసహా దాని వెనక చెప్పుకోలేని ఉద్వేగాలతో సహా సారం పీల్చుకోగలుగుతాం. 76లో రామారావు మాస్టారితో నాకు ప్రత్యక్ష పరిచయం. అప్పటి నుంచి దాని ఫలం నేను పొందుతూనే ఉన్నాను. అంతేకాదు, అది నా ఒక్కరికే పరిమితం కాదు. నేరుగా సంబంధం ఉన్నవారితో ఆయన ప్రవర్తన నేను గమనిస్తూనే ఉన్నాను. తన భావాలతో ఏకీభవించని వారని ముందే తెలిసినా ఆయన ప్రవర్తన అలాగే ఉండేది. ఎదుటివారి అభిప్రాయాలలోకి అడుగుపెట్టి అర్థం చేసుకునేవారు. చిన్న పిల్లలతో సహా ఎవరినైనా ఆయన అలాగే వినగలిగేవారు. అటువంటి వినే శక్తి మరింత ఫలప్రదం కావాలంటే విన్నాక అనేది మరింత ముఖ్యం, ఆయన మాటలాడేవాటిలో సాంప్రదాయకమైన సలహాలు ఉండేవి కావు. నిత్యం చెప్పే సాధారణ నీతి వాక్యాలు కావు. అలాగే ఆయన ఒప్పుకునే భావజాలానికి చెందినవి కూడా కావు. చెప్పుతున్న వ్యక్తి తనతో తనే సంభాషించుకుని, ఆత్మపరిశీలన చేసుకుని, పరిష్కారాల మీద దృష్టి నిలిపి, పూర్వాపరాలనూ సాధ్యాసాధ్యాలనూ ఆకళింపు చేసుకుని తనంత తనే ఒక అడుగు వేయించే శక్తిని ఇచ్చే మాటలు అవి. ఇదీ నేను గమనించిన వ్యక్తిత్వ మూలం, పునాది. ఈనాడు ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్న అనేకమంది రాతలలో నాకు దాని ఫలితం కనిపిస్తున్నది.


ఆయన కథానిలయానికి పుస్తకాలూ, నిధులూ, సేవలూ అందించిన అందరూ ఆయన తలపెట్టిన పనిని సాకల్యంగా అర్థం చేసుకున్నవారు కాదు. ఆయన వ్యక్తిత్వంతో ప్రభావితులై అందించిన వారే.. ఆయన చేతులను అందుకున్న వారే. మన పూర్వులు ధనం పాపిష్టిది అనేవారు. ఇలాంటి ప్రాజెక్టుని ఒక సామాన్యుడూ ఆర్థికంగా దుర్బలుడూ అయిన వ్యక్తి తలపెట్టినపుడు ఎవరో ఒకరు ఆ పేరుతో సొమ్ము చేసుకుంటున్నాడనే మాట అనే వీలుంది. దాదాపు ఎవరూ ఆమాట అనకపోవటం ఆయన వ్యక్తిత్వ విజయానికి మరో ఉదాహరణ.


అయితే- ఈ ప్రవర్తనా తీరుని సౌమ్యత, వినమ్రత, నిరాడంబరత, విషయజ్ఞత, మర్యాదాతత్వం, పెద్ద మనిషితనం వంటి ఇంపైన పేర్లతో కొందరు మెచ్చవచ్చు. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు అనే పూర్వీకుల భావన తెలిసిన కొందరు లౌక్యం, అవకాశవాద లక్షణం అనికూడా తప్పు ఎంచవచ్చు. కథానిలయం సాకారం కావటంలో ఆయన ప్రవర్తనాశైలి నిజంగా ప్రముఖ భూమిక వహించింది. అయితే ఇంతమందికి సన్నిహితం కావటం అనే సాఫల్యానికి కారణమైన కారా ప్రవర్తన ఆయన మార్గాన్ని పూర్తిగా అవగతం చేయగలదా? లేదుగదా.. 


ఆయన చెవొగ్గి విన్న వాటినీ, కళ్లుపెట్టి కన్న వాటినీ మనసులో నింపుకున్నారు. వాటిలో ఉన్న సాధారణత్వం (pattern) గ్రహించారు. అందులోని అసమన్యాయాన్నీ, దాన్ని హేతుబద్ధం చేసే వాదనలనూ కలబోసుకున్నారు.


ఈ అసమత్వానికి కారణం ఆయా వ్యక్తుల కృషి లోపం, కర్మఫలం. దైవేచ్ఛ, గ్రహగతి. విధి. వందల కారణాలు చెపుతారు. పరిష్కారాలు నొక్కి వక్కాణిస్తారు. విధిని నమ్ము. కాలం మారుతుంది. శాంతులు చెయ్యి. కృషి చెయ్యి. ఫలమాశించకు.


ఇవన్నీ కారాకి తెలుసు. ఏమో అయితే అయుండవచ్చు అనుకున్నారు వ్యక్తిగత కష్టాలలో. వ్యక్తుల సమస్యలకు సమాజస్థితి కారణం అని వివరించే భావజాలం గురించీ విన్నారు. అది చెప్పే పరిష్కారమూ విన్నారు. ఏమో కావచ్చు- అనుకున్నారు సమాజ గమనం గురించి ఆలోచిస్తూ.


కాని స్వవిచేనతో సామాజిక విశ్లేషణ చేసుకుంటూ కథలు రాసారు మాస్టారు. తను రాసిన కథలని తానే విమర్శించుకుని పక్కనపెట్టారు. కొంత సమాధానపడిన కథలు ‘ఆర్తి’, ‘చావు’, ‘శాంతి’, ‘యజ్ఞం’, ‘కుట్ర’, ‘హింస’, ‘భయం’, ‘జీవధార’ వంటివి. ఇలాంటి కథలు రాసేటపుడు ఆయన ఎక్కడ ఆరంభమయారో అక్కడనే కథ ఆరంభించి ఎక్కడ ఆయన ఆలోచనలు ఆగాయో అక్కడ ముగించారు. 


అంటే 30ఏళ్లు ఒక కుటుంబం మొత్తం రేయింబవళ్లు శరీరకష్టం చేసినా 3వేల అప్పు ఎందుకు మిగిలింది? అక్కడ ఆరంభమయింది ఆలోచన. ఆ అప్పుని ధర్మబద్ధం చేసే సాంప్రదాయక గ్రామం, ఆ సాంప్రదాయకతని ప్రశ్నించకుండా చేసే ఆదర్శతత్వం, అప్పు అనే విధానాన్ని కాపాడుకుంటే తప్ప తాము చెల్లుబడికామని కర్ర పట్టుకునే ఆసాములు, చట్టబద్ధం చేసే ప్రభుత్వం ఇవన్నీ ఆయన ఆలోచనా మార్గంలో కనిపించాయి. కనిపించిన వాటిని కథాబద్ధం చేయటానికి ప్రయత్నించాడు, సమస్య అర్థమైనంతగా పరిష్కారం అర్థం కాకపోతే ఏం చెయ్యాలి. ఇప్పుడు ఉన్న స్థితిని చెప్పాలి అనుకున్నారు. గతం వర్తమానాన్ని బలిపెట్టడమనే వాస్తవం ఆయన కంటికి కనిపించింది. ఒక తరం తన తరవాతి తరానికి నీతులతో సంకెళ్లు వేస్తోంది. బానిసత్వంలోకి తోస్తోంది. దాన్ని ఎలా వ్యక్తం చెయ్యాలి? యజ్ఞం ఏ దేవతలను ప్రసన్నం చేసుకోటానికి ఎవరు చేస్తున్నారు? ఎవరు సమిధలవుతున్నారు? ఎవరు యజ్ఞఫలాలు పొందుతున్నారు? ఒక సాధారణుడి గ్రహింపు, దాన్ని అసాధారణంగా వ్యక్తం చేయటమే యజ్ఞం ముగింపు. 


ఇలా ఆయన మార్గం వేసుకున్నారు. అది ఒక స్కూల్‌ ఆఫ్‌ థాట్‌గా మనం అధ్యయనం చెయ్యాలి. ఆయన కట్టిన కథానిలయం కన్న, చేసుకున్న స్నేహాల వెనక ప్రవృత్తి కన్న మనం గమనించవలసింది అదే. కథానిలయం బరువు కింద ఆలోచనా బాటసారి కారా మిగలకపోవచ్చనే విషయం కూడా ఆయన నాతో ప్రస్తావించేవారు. కథా నిలయం కట్టినాయన కథలు కూడా రాసేడంట అనే రోజు వస్తుందని సరదాగా ఇద్దరం అనుకునేవాళ్లం. చేసిన పాపం కట్టి కుడుపుతుంది మాస్టారూ అంటే నవ్వేవారు.


ఆయన ఒక ప్రాంతంలో పుట్టారు. కథ చెప్పటానికి తానెరిగిన మనుషుల నుంచే పాత్రల స్వభావాలు నిర్మించారు. అది సర్వ సాధారణం. అంత మాత్రాన ఆయన కథ ఆ ప్రాంతానికే పరిమితం అనే పరిస్థితులు వర్తమానంలో బలోపేతమయాయి. మహా రచయితలు మానవజాతి సంపద. వారు అణువు నుంచి బ్రహ్మాండాన్ని చూడగలిగినవారు. వారు తమభాషలో రాసినట్టే.. తమ ప్రాంత జీవితాన్నే కథని చెప్పటానికి వాడుకుంటారు. పాత్రలూ, భాష, జీవితం వారికి కేవలం ఉపకరణాలు. కాని వారి కథ మానవజాతికి చెందినది. కారా కన్న కారా మార్గమే గొప్పదని మనం తెలుసుకున్న రోజున మహా రచయతని మానవజాతికి అందించే ప్రయాణం ఆరంభమవుతుంది.

వివిన మూర్తి