Abn logo
Apr 12 2021 @ 00:36AM

ఆవేశం అతడి కవితాత్మ

పుణ్యపురుషుల్లాగే కవుల్లోనూ పుణ్య కవులుంటారు. వాళ్ళు సాధారణ కవులకి మల్లే ఎడతెగకుండా రాస్తూనే ఉండేవాళ్ళు కాదు. పాఠకులూ, సాటి కవులూ మర్చిపోతారేమోననే బెంగ వాళ్ళకి ఉండదు. రాయకుండా ఉండలేనప్పుడే వాళ్ళు రాస్తారు. అది కూడా ఎంతో అపురూపమైన కవిత్వం! అలాంటి అరుదైన కవి ‘వజీర్‌ రహ్మాన్‌’! ఆవేశం అతడి కవితాత్మ! కేవలం ఆవేశ పరుడు మాత్రమే కాదు, తన జీవితానుభవాల్నే ఆస్తీ, అస్త్రం చేసుకున్న కవి కూడాను. ధారా ప్రవాహం లాంటి అతని శైలికి మనం ఆశ్చర్యచకితులౌతాం! అతని శిల్పచాతుర్యం అనన్యసాధ్యం. కాలానికి నిలబడినవాడు. రాసిన కవితలన్నీ కలిపి వొందకి పైచిలుకు మాత్రమే! అందులో తొంభై కవితల్ని ఇరవై యేళ్ళ వ్యవధిలో (1963-1983) రెండు కవితా సంపుటాలుగా ప్రచురించాడు. తొలి కవితా సంపుటి - ‘ఎచటికి పోతావీ రాత్రి?’. దీన్ని చెలానికి అంకితమిచ్చాడు. రెండో కవితా సంపుటి- ‘సాహసి’! ఈ సాహసి ఎవరో కాదు - చెలమే! వజీర్‌ రహ్మాన్‌ని, చెలాన్ని వేరు చేసి చూడలేము. చెలానికి వజీర్‌ రహ్మాన్‌కి ఉన్న బంధం... భగవంతుడికీ, భక్తుడికీ మధ్యన ఉండే అనుబంధం! చెలం మీద తనకున్న అవ్యాజమైన ప్రేమని వజీర్‌ రెహ్మాన్‌ ఏనాడూ దాచుకో లేదు. చెలం వచనంలోంచి కవితా ఖండికల్ని ఏరి ‘కవిగా చెలం’ అన్న కవితా సంపుటిని ప్రచురించాడు కూడా!


వజీర్‌ రహ్మాన్‌ నిజానికి చెలం అల్లుడు! అంతేనా? ఇస్మాయిల్‌కి చిన్న తమ్ముడు కూడా! ఈ ఇద్దరు మహోన్నతుల మధ్యన తన ‘వ్యక్తిత్వాన్ని’ నిలబెట్టుకోవటమే కాదు, వాళ్ళని ప్రభావితం చేశాడు! 


1963 వరకు రాసిన కవితల సమా హారం ‘ఎచటికి పోతావీ రాత్రి?’; 1965- 1975ల మధ్య ఈ పదేళ్ళ వ్యవధిలో రాసిన కవితల గుచ్ఛం- ‘సాహసి’. తదనంతర కాలంలో తన శైలీ, శిల్పం ఎన్నో మార్పులకి లోను కావటాన్ని గుర్తించి, ఆ కవితల్ని విడిగా ప్రచురించాలని వాటిని పక్కనపెట్టాడు వజీర్‌ రహ్మాన్‌. ఆ కవితలేమైనాయో ఆరా తీయాలి. ప్రస్తుతం ఇవి అలభ్యం. 


వజీర్‌ రహ్మాన్‌ తాతయ్యలిద్దరూ తెలుగు కవులే! ఛందోబద్ధ పద్యాలు రాశారు. అందులో ఒక తాత పేరు వజీరుద్దీన్‌. ఆ పేరే తన పేరైంది. వజీర్‌ రహ్మాన్‌కి ఇద్దరన్నయ్యలు. ఇద్దరూ కవులే. పెద్దన్నయ్య ఇస్మాయిల్‌ జగత్ప్రసిద్ధుడు. రెండో అన్నయ్య రహమాన్‌ డాక్టరు. ఛాతీ శ్వాస కోశ వ్యాధుల స్పెషలిస్టు. ఈయనా కవిత్వం రాశాడు. కానీ ఎక్కడా ప్రచురించ లేదు. ఈ కవిత్వ వాతావరణంలో పెరిగి పెద్దవాడైన వజీర్‌ రహ్మాన్‌ కూడా సహజంగానే కవిగా రూపాంతరం చెందాడు. ‘‘మా పెద్దన్న ఇస్మాయిల్‌ గనక చిన్నప్పుడే నా చుట్టూ తలుపులు తెరిచి కవిత్వంలోనూ, కళల్లోనూ అందాలు చూపకపోతే, నేనింకెట్లా మారి ఉండేవాణ్ణో’’- అన్నాడొక చోట. 


‘‘వజీర్‌ గొప్ప భావుకుడు. చాలా ఆవేశపరుడు. అంతరాళాల్లోంచి స్పాంటేని యస్‌గా తన్నుకొచ్చినట్టు ఉంటాయి అతని పద్యాలు’’ అని ఒక ఇంటర్వ్యూలో తమ్ముడి గురించి ఇస్మాయిల్‌ అంటారు. 


వజీర్‌ రహ్మాన్‌ కేవలం కవి మాత్రమే కాదు. చిత్రకారుడూ, సంగీతజ్ఞుడూ కూడా! త్యాగరాజకృతులతోపాటు అమోఘమైన పాశ్చాత్య శాస్త్రీయ సంగీతం తోనూ పరిచయముంది వజీర్‌కి! 


‘సముద్రఘోష’ అనే కవితలో వజీర్‌ ఇట్లా అంటాడు- ‘‘సంధ్యా సముద్రం లోంచి... హాహా కారాలేవో/ నా మల్లే/ చేదు బతుకు తాగలేక/ వొంటరై/ దిక్కులేక యేడ్చినట్టు’’! వజీర్‌ రహ్మాన్‌ కవిత్వం వేదనాభరితం. జీవితం అశ్రుతప్త శోకసిక్తం అయినప్పుడు వేదనే కదా పలుకుతుంది. వజీర్‌ కవిత్వంలో జీవితంలోని సంశయాలూ, సందేహాలూ, మోహాలూ, ఖేదాలూ అన్నీ ఒక్క ఉదుటున వెల్లువెత్తి మనల్ని ముంచెత్తుతాయి. ఆ ప్రవాహంలో పడి కొట్టుకు పోతాం. ‘‘మనమూ వెర్రెక్కిన సంధ్యా సముద్రాలమై’’!


‘గమ్యం’ అనే కవితలో మనిషి అన్వేషణ, జీవిత గమనం రెండూ అర్థం లేనివేనని అంటాడు. జీవితం ఎంత అసంగతమో, ఎంత అసంబద్ధమో చెప్తాడు. ‘‘నీ గమ్యం నీ అన్వేషణ/ నీ బాధా నిరాశా/ అంతా నీలోనే..../ కానీ చూస్తే/ నువ్వే లేవు’’ అంటాడు. అంతేకాదు, ‘‘చివరికేం/ సాధించాలని/ ఈ గుంజాటన/ తాపత్రయం’’ అని కూడా అంటాడు. అంతేనా, మృత్యువుతో జీవితం అంతమైపోతుందా? మరణానంతరం ఇంకేమీ ఉండదా? ఈ ప్రశ్నలకి మళ్ళీ తనే సమాధానమూ చెప్తాడు: ‘‘ఎక్కడో/ ఏ కొండ పంచనో/ గడ్డిపూల గుంపులో నించుని/ సృష్టి వైచిత్రికి/ తలలూపుతో మిగులుతాం- చివరికి/ మళ్ళీ/ నిరంతరం’’ అంటాడు ‘చివరికి’ అనే కవితలో. 


వజీర్‌ రహ్మాన్‌ భారతీయ సాహిత్యంతోపాటు ప్రపంచ సాహిత్యాన్నీ బాగా చదువుకున్నవాడు. అనేక ప్రభావాలకిలోనై తన మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దుకున్న వాడు. తన అన్న ఇస్మాయిల్‌, శ్రీశ్రీ మొదలుకొని (అతని కవితా సంపు టాల శీర్షికలు రెండూ శ్రీశ్రీ మహాప్రస్థానం లోనివే), బెంగాలీ, ఉర్దూ, పారశీ, పాశ్చాత్య, అమెరికన్‌ కవుల కవిత్వాన్ని ప్రగాఢంగా ప్రేమించాడు. ఆయా కవుల ప్రేరణతో గొప్ప కవితల్ని సృజించాడు. అదే విషయాన్ని బాహాటంగా ప్రకటించాడు. వజీర్‌ రాసిన కవితలన్నీ ‘స్వతంత్రత’ ఉన్న స్వీయకవితలే. యే వొక్కటి కూడా అనుసృజన కానీ, అనుసరణ కానీ కాదు. 


వజీర్‌ రహ్మాన్‌ జీవితంలో కానీ, కవిత్వంలో కానీ కాపట్యానికి చోటు లేదు. నిజాయితీ మాత్రమే తొణికిస లాడుతుంటుంది. ఆ నిజాయితీయే అతని కవిత్వంలోని ఆకర్షణ! అదే అతణ్ణి మిగతా కవులకి భిన్నంగా నిలబెట్టింది. ఈ విషయంలోనే వజీర్‌ ఇస్మాయిల్‌కి ఆదర్శమయ్యాడు. స్మైల్‌, మో, నాతోసహా చాలామంది వజీర్‌ రహ్మాన్‌ ప్రభావానికి లోనైన వాళ్ళే. వజీర్‌ రహ్మాన్‌ కాలం కంటే ముందు నడిచిన కవి. తెలుగు కవిత్వంలో అతని ముద్ర సుస్పష్టం. 


ఇవాళ కవులు కన్ను తెరవగానే కీర్తి స్తన్యం కోసం తడుముకుంటున్నారు. వాళ్ళ కవిత్వం ప్రిటింగ్‌ ప్రెస్‌లో అచ్చై పుస్తకంగా బైటికి రాకముందే, ఆ పుస్తకానికి అవార్డులు అందుకుంటున్న కాలమిది. పైరవీలూ, లాబీయింగ్‌లే జీవిత లక్ష్యంగా మనుగడ సాగి స్తోన్న కవుల ‘బతకనేర్చినతనాన్ని’ చూస్తే జాలే స్తోంది. ఆ రోజుల్లో వజీర్‌ రహ్మాన్‌ ఎంత కరా ఖండీగా బతికాడు. జీవన పర్యంతం విద్రోహిగానే ఉన్నాడు. గజ్జిమందు ప్రకటనల మధ్య కవిత్వమే మిటని పత్రికలకి తన కవితల్ని ప్రచురణార్థం పంపించలేదు. కొన్ని విలువలకి కట్టుబడి తన మానాన తాను కవిత్వం రాసుకున్నాడు. కవిత్వాన్ని ప్రేమించాడు. కవిత్వమై జీవించాడు. ‘డబ్బూ, పదవీ, కీర్తీ!’ అనే కవితలో- ‘‘కొందరాశతో/ లోనికి పోవాలని/ తోసుకు పోతో/ కత్తులు నెత్తురై/ విరామమెరక్క/ యెగబాకుతో/... ఏముంది లోపల/ డబ్బూ, పదవీ, కీర్తీ’’ అన్నాడు. 


అందుకే వజీర్‌ రహ్మాన్‌ అచ్చమైన కవిత్వం రాసిన వాడు మాత్రమే కాదు అచ్చమైన కవిగా బతికినవాడు కూడా! అందుకే అతని కవిత్వం కాలానికి నిలబడింది. భౌతికంగా తను లేనప్పటికీ, అతను గతించిన ముప్ఫై యేళ్ళకి పునర్ముద్రణకి నోచుకొంది (2014- అయోనా ప్రియదర్శిని ప్రచురణల తరఫున). 


‘చేపా!’ అనే కవితలో- చేప గురించి ‘‘సుందరనగ్నంగా/ మెరిసిపోతో/ తిరుగు తావు-/ ఆనంద పరవశంతో/ నీలి నీరవ లోతుల/ మెత్తని కాంతిలో’’ అంటాడు. ఎంత గొప్ప ఎక్స్‌ప్రెషన్‌! శృంగార భావనని సున్నితంగా వెలిబుచ్చిన వాక్యాలివి! 


‘నర్తకి కల’ అనే కవితలో- ‘చీకటి పడటాన్ని’ - ‘‘సాయంత్రమై/ అవని/ విసుగుతో చీకటిని/ కళ్ళపైకి లాక్కొని/ నిశ్శబ్దించినప్పుడు’’ అంటూ అభివర్ణిస్తాడు. 


వజీర్‌- ‘ముసలితనం’ గురించి రాస్తూ... ‘‘పగబట్టిన త్రాచుకన్న/ క్రూరం/ ముసలితనం!/ విధి విసిరే చివరి అస్త్రం/ తప్పించుకోలేవు/ దాని ఘాతం.../ తల వొంచి/ తనువు చాలించు’’ అన్నాడు. అలాగే ముసలితనాన్ని- ‘బైపాస్‌’ చేసి ఈ లోకాన్నించే నిష్క్రమించాడు. ‘క్యాన్సర్‌ సెకండరీస్‌’ అంటూ పొరపాటుగా వ్యాధి నిర్ధారణ చేసి అతడికందించిన చికిత్స వికటించి వజీర్‌ మరణించాడు. 


1975 నుంచి 1983 వరకు రాసిన కవిత్వం ఇంకా అచ్చు కావాల్సి ఉంది. అంతకుముందు రాసిన కవిత్వపు శైలీశిల్పాలతో పోల్చితే- ‘ఇది’ విభిన్నంగా ఉందని పక్కనపెట్టాడు వజీర్‌ రహ్మాన్‌. (చూ. ‘సాహసి’ 1983 ప్రచురణ, పుట-90). ఈ సంగతేమిటో ఎవరైనా ఆరా తీస్తే బాగుండును.


వజీర్‌ రహ్మాన్‌ ఏ యితర కవితో పోల్చటానికి వీల్లేని- ‘విభిన్న కవి’! గొప్ప ప్రేమికుడు మాత్రమే కాదు. అంతకుమించిన సున్నిత మనస్కుడు. ‘అనామిక’ అనే కవితలో- ‘‘ఆనాడే నిన్ను సాహసించి/ నా వెంట తీసుకుపోతే/ చివరికి నువ్విట్లా కఱకు రసికులకి బలై/ హీనావస్థకి రాకుందువని/ కాని, దేనికివన్నీ ఉత్త మాటలు/ శుష్క ప్రేలాపనలు/ కోరికలెన్నైనా కానీ/ దుఖ్కమన్నా చెప్పలేని పిరికిని/ ప్రియా, క్షమించవా నన్ను’’ అంటూ వాపోతాడు.


‘సాహసి’ అనే కవితలో- ‘‘తనకి తనే/ ప్రశ్నై ప్రోద్బలమై/ తనకి తానే శిక్షై శిలువై/ గుండె కాల్చే ఏకాకితనం/ అనామక పరిత్యాగం/ అదీ సాహసం!’’ అంటాడు చెలం గురించి. చెలం మాత్రమేనా, వజీర్‌ రహ్మాన్‌ కూడా అటువంటి సాహసే! అతడు సాహసిక అన్వేషకుడు. ‘‘ఎచటికి పోతావీ రాత్రి?’’ అంటూ తరలిపోయాడు కానీ, అతడెచటికీ పోలేదు. తన కవిత్వమై మన మధ్య తిరుగాడుతూనే ఉన్నాడు. వజీర్‌ రెహ్మాన్‌కి ముసలితనమే కాదూ, మరణమూ లేదు. అతని కవిత్వం లాగే అతనూ... అజరామరం! 

రవూఫ్‌

98490 41167

Advertisement
Advertisement
Advertisement