ఆయన అడుగుజాడలే రాజ్యాధికార సోపానాలు

ABN , First Publish Date - 2020-03-14T06:59:13+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో బలమైన కుల ఉద్యమాలు ఎన్ని జరుగుతున్నా అవి రాజ్యాధికారం దిశగా మాత్రం సాగడం లేదు. మాదిగలు ఇంకా మానసిక బానిసత్వంలోనే ఉన్నారని అనిపిస్తోంది‌...

ఆయన అడుగుజాడలే రాజ్యాధికార సోపానాలు

సైకిల్‌నే ప్రచార రథంగా చేసుకొని, బలానికి చిహ్నమైన ఏనుగును పార్టీ గుర్తుగా పెట్టుకుని, అంబేద్కర్ చెప్పిన రాజ్యాధికారం అనే మాస్టర్ కీని సాధించిన ధీరుడు కాన్షీరాం చమార్ అడుగుజాడల్లో ముందుకు సాగాలి. ఇటువంటి మన జాతి మహనీయుల ఆశయాలన లక్ష్యంగా మార్చుకోకుంటే భవిష్యత్తులో అణగారిన వర్గాలు అంతరించిపోవడం ఖాయం.


తెలుగు రాష్ట్రాల్లో బలమైన కుల ఉద్యమాలు ఎన్ని జరుగుతున్నా అవి రాజ్యాధికారం దిశగా మాత్రం సాగడం లేదు. మాదిగలు ఇంకా మానసిక బానిసత్వంలోనే ఉన్నారని అనిపిస్తోంది‌. జనాభా పరంగా 13శాతం ఉన్న మాదిగలు రాజ్యాధికార కాంక్ష లేకుండా ఉన్నారు. ‘మాదిగ’ అంటే ఆత్మగౌరవం లేని పదమన్న ఆత్మన్యూనతా భావనలో నుంచి మాదిగలు బయటపడలేక పోతున్నారు. తమను తాము తక్కువ చేసుకొని, పోరాడే స్ఫూర్తిని కోల్పోయి, తాత్కాలిక పదవులతో జీవితాలను గడిపేస్తున్న వీరు ఆత్మగౌరవంతో బతుకుతున్న చమార్ల పోరాట స్ఫూర్తితో ముందుకు నడవాల్సి ఉంది. దళితులకు రాజ్యాధికారం సాధించిపెట్టిన ధీరుడు కాన్షీరాం చమార్ అడుగు జాడల్లో సాగాలి. పంజాబ్‌లోని హోషియాపూర్ జిల్లా కవాస్ పూర్లో బిషన్ సింగ్ కౌర్, హరిసింగ్ తేల్ సింగ్‌ల చివరి సంతానంగా 1934 మార్చి 15న జన్మించారు కాన్షీరాం. ఉద్యోగం చేస్తున్న సమయంలో తన మిత్రుడి సహకారంతో అంబేద్కర్‌ను పూర్తిగా అధ్యయనం చేసి, ఆయన బాటలో నడిచారు. 


దేశంలో 35 కోట్లకు పైగా ఉన్న బహుజనులకు ఆత్మగౌరవాన్ని, రాజ్యాధికారాన్ని సాధించి పెట్టడం కోసం తన జీవితాన్ని ధారపోశారు మహనీయుడు మాన్యశ్రీ కాన్షీరాం. సమాజంలో దుఃఖ నివారణ కోసం బుద్ధుడు ఏవిధంగా అయితే సొంత కుటుంబాన్ని, రాజ భోగాలను వదిలి ప్రజల్లోకి వచ్చి జ్ఞానబోధ చేస్తూ సమసమాజ స్థాపన కోసం ఆధ్యాత్మిక పోరాటం చేశారో.. అదే విధంగానే కాన్షీరాం కూడా రాజకీయ బుద్ధుడయ్యారు. ఉన్నత ఉద్యోగాన్ని, కుటుంబాన్ని వదిలేసి, పెళ్లి చేసుకోకుండా, తండ్రి మరణించినా ఇంటికి వెళ్లకుండా తాను చనిపోయే వరకూ బహుజనులకు రాజ్యాధికారం సాధించే కృషి కొనసాగించారు. బహుజనులు నేడు రాష్ట్ర పతి, పార్లమెంట్ స్పీకర్ వంటి అత్యున్నత పదవులు పొందుతున్నారంటే అది ఈయన పోరాటం వల్లనే. 


అంబేద్కర్ జన్మదినం సందర్భంగా 1984లో బహుజన సమాజ్ పార్టీని స్థాపించి, ‘ఓట్లు మావి.. అధికారం మీకా’ అంటూ అగ్రవర్ణాల ఆధిపత్యానికి ఎదురు తిరిగారు‌. అతి తక్కువ కాలంలోనే వెనుకబడిన వర్గాల వారిని ఎమ్మెల్యేలుగా, మంత్రులు, ముఖ్యమంత్రులుగా చేశారు. ఉత్తరప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశ రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. 


చాలామంది ఆయనను కుల రాజకీయాలు ప్రవేశ పెట్టిన నాయకునిగా ప్రచారం చేశారు. కానీ కులం అనే ముల్లును కులంతోనే తీయాలని, కుల నిర్మూలన కోసమే రాజకీయాల్లో కులాన్ని ప్రధాన ఎజెండాగా చేశారు. యూపీతో పాటు, హర్యానా, మధ్యప్రదేశ్, ఢిల్లీల్లోని చమార్, తదితర కులాలను కలుపుకొని బహుజన రాజ్యానికి ప్రాణం పోశారు. యూపీలో అధికారం నెరపిన బీఎస్పీ తరఫున అంటరాని కులానికి చెందిన మహిళ మూడుసార్లు ముఖ్యమంత్రిని చేశారు కాన్షీరాం. ఆయన నిర్వహించిన ఉద్యమ ఫలితంగానే ఇప్పుడు తెలంగాణ, ఆంద్రప్రదేశ్‌ల్లో దళితులు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో బలమైన కుల ఉద్యమాలు జరుగుతున్నా అవి పాలకులను ప్రశ్నించ లేకపోతున్నాయి. అడుక్కుంటే పాలకులుగా మారరని.. రాజ్యాధికారం అనే మాస్టర్ కీ కోసం ఉద్యమాలు చేయాలని చెప్పిన అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత దళితులపై ఉంది. 


రాజ్యాధికారానికి రాని జాతి అంతరించిపోతుంది. మనం సామాజికంగా ఎదగాలంటే రాజకీయాలలో కూడా ఎదగాలి. రాజకీయాల వల్లే రాజ్యాధికారం లభిస్తుంది. రాజ్యాధికారం నుంచి శాసనాధికారం లభిస్తుంది. మన చేతుల్లో రాజ్యాధికారం ఉంటేనే మన లక్ష్యం సిద్ధిస్తుంది. అందుకే రాజకీయాల గురించి మనం ఆలోచించాలి. సామాజిక హితం కోసం అనేక అంశాలపై అవగాహనతో ముందుకు నడవాలి. బహుజనులు దేశంలోనూ, రాష్ట్రాలలోనూ పాలకులుగా మారినప్పుడే మహనీయుల లక్ష్యం నెరవేరుతుంది. అందుకు కాన్షీరాం చమార్ మార్గమే బహుజనులకు రాచబాట. 


భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీకి ఎంపిక చేయాలంటే, అంబేద్కర్‌ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైతేనే అవకాశం ఇస్తామంటూ ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు అగ్రవర్ణ నేతలు. ఆ సమయంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన జోగీంద్రనాథ్ మండల్ చమార్ తన కల్నల్ నియోజకవర్గం ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఆ స్థానంలో గెలిపించడంతో అంబేద్కర్‌ రాజ్యాంగ పరిషత్తుకు ఎంపికయ్యారు. జోగీంద్రనాథ్ త్యాగం అలా దేశానికే వెలుగులు పంచే రాజ్యాంగ రచనకు తోడ్పడింది. అంబేద్కర్‌, జోగీంద్రనాథ్‌ల స్ఫూర్తితో దేశంలోనే సుదీర్ఘ కాలం.. 38 ఏళ్ల పాటు కేంద్ర మంత్రిగా,ఉప ప్రధానిగా వివిధ మంత్రిత్వ శాఖలు నిర్వహించిన బాబు జగ్జీవన్ రాం తన అధికారాన్నంతా ఉపయోగించి అణగారిన వర్గాల సంక్షేమం, ప్రగతి కోసం పాటుపడ్డాడు. ఇదే కోవలో సాగుతున్న చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ చమార్, యువనాయకుడు జిగ్నేష్ మేవానీ చమార్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకుని మాదిగలు ధీరత్వాన్ని నింపుకోవాలి. తమ కోసం తామే దీక్షగా సాగాలి. లేని పక్షంలో భవిష్యత్తు మాదిగ తరాల పరిస్థితి మరింత అధ్వాన్న స్థితికి దిగజారే ప్రమాదం ఉంది. పాలకులుగా ఉన్న మన జాతి ప్రతినిధులు జాతి ఆర్థిక ఎదుగుదలకు దోహదపడక పోవడం కూడా ప్రమాదమే.‌ ఏ స్థాయిలో అధికారం దక్కితే ఆ స్థాయిలో ఆ అధికారాన్ని విస్తృతంగా ఉపయోగించి మాదిగ పాలకులు తమ జాతి అభ్యున్నతికి కృషి చేయాలి. కాన్షీరాం చమార్‌ చైతన్యాన్ని నింపుకొని మనమంతా ఏ ఉద్యమాన్నైనా రాజ్యాధికారం దిశగా మలిచిన నాడే మనమంతా నిజమైన విద్యావేత్తలం.. నిజమైన డాక్టరేట్లం.. నిజమైన ఉద్యమకారులం.. అనిపించుకుంటామనేది నా భావన. సైకిల్‌నే ప్రచార రథంగా చేసుకొని, బలానికి చిహ్నమైన ఏనుగును పార్టీ గుర్తుగా పెట్టుకుని, అంబేద్కర్ చెప్పిన రాజ్యాధికారం అనే మాస్టర్ కీని సాధించిన ధీరుడు కాన్షీరాం చమార్ అడుగుజాడల్లో ముందుకు సాగాలి. ఈ మన జాతి మహనీయుల ఆశయాలు లక్ష్యంగా మార్చుకోలేకపోతే భవిష్యత్తులో అణగారిన వర్గాలు అంతరించిపోవడం ఖాయం.

సంపత్‌ గడ్డం

(రేపు కాన్షీరాం జయంతి)

Updated Date - 2020-03-14T06:59:13+05:30 IST