తన కోపమే తన శత్రువు

ABN , First Publish Date - 2021-03-31T06:03:51+05:30 IST

ఓ కుర్రాడు... గాయాలతో నెత్తురోడుతూ రోడ్డుపక్కన పడివుంటాడు. కష్టంగా లేవడానికి ప్రయత్నిస్తుంటాడు. అక్కడి నుంచి రీలు వెనక్కి తిరుగుతుంది

తన కోపమే తన శత్రువు

ఓ కుర్రాడు... గాయాలతో నెత్తురోడుతూ రోడ్డుపక్కన పడివుంటాడు. కష్టంగా లేవడానికి ప్రయత్నిస్తుంటాడు. అక్కడి నుంచి రీలు వెనక్కి తిరుగుతుంది. ఆ కుర్రాడిది జాలీ జీవితం. డిగ్రీ అయిపోయి ఏ పనీ చేయకుండా తిరుగుతుంటాడు. కోపం ఎక్కువ. ప్రతి చిన్న దానికీ ఎప్పుడూ ఎవరినో ఒకర్ని కొడుతుంటాడు. క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతుంటుంది. మనోడు అవుటవుతాడు. అవుట్‌ కాదని అవతలి జట్టుతో తగాదా! మాటా మాటా పెరిగి ఆ జట్టు కెప్టెన్‌ సురేశ్‌ తలపై బ్యాట్‌తో కొడతాడు. ఈ గొడవల్లో పడి ఆ రోజు తనకు నిశ్చితార్థం అని కూడా మరిచిపోతాడు ఆ కుర్రాడు. అమ్మ ఫోన్‌తో వెంటనే ఇంటికి పరిగెడతాడు. దెబ్బలు తిన్నవాడు ఆసుపత్రికి వెళతాడు. అక్కడ తన పని మానుకుని వైద్యం చేస్తుంది డాక్టర్‌. పేరు శాంతి. మన కథానాయకుడు చూడబోయే అమ్మాయి తనే! పెళ్లి చూపుల్లో శాంతిని చూడగానే అతడు ఇష్టపడతాడు.


ఆమె అతనితో ఏకాంతంగా మాట్లాడాలని అడుగుతుంది. పెరట్లోకి వెళతారు. తను ఏవో చెబుతుంటుంది. ‘ఐ లవ్‌ యూ’ అంటాడు. ‘మీరు నాతో మాట్లాడిన తొలి మాటే ఐ లవ్‌ యూ. తరువాత చెప్పుకోవడానికి బాగుంటుంది’ అంటుంది. ‘అయితే నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేయమని అమ్మావాళ్లకు చెప్పనా’... అడుగుతాడు. తల ఊపుతుంది శాంతి. ఇక అతడికి శాంతే లోకం అయిపోతుంది. కానీ అతడి నడవడిలో మార్పు లేదు. ప్రతి దానికీ కోపం... కొట్లాటలు... కొనసాగిస్తూనే ఉంటాడు. ఒకరోజు అవి శాంతి కంట పడతాయి. పేరుకు తగ్గట్టుగానే ఆమె ‘తన కోపమే తన శత్రువు... తన శాంతమే తనకు రక్ష’ అన్నది అక్షరాలా నమ్మే మనిషి. తనకు కాబోయేవాడు కూడా అలానే ఉండాలనుకొంటుంది. 


కానీ మనోడిలో మార్పు కనిపించక... చివరికి నిశ్చితార్థం రద్దు చేసుకొంటానని చెబుతుంది. దానికి అతడు ఒక్క అవకాశం ఇస్తే మారి చూపిస్తానంటాడు. నెల రోజులు గడువు పెడుతుంది. ఈ ముప్ఫై రోజుల్లో ఎలాంటి గొడవలకూ వెళ్లకూడదని, వెళితే ఇక తన నిర్ణయం మారదని చెబుతుంది. అతడిలో ఆవేశం కట్టలు తెగుతుంటుంది. పొరపాటున ఢీకొట్టినవాడి తల పగలగొట్టాలన్నంత కోపం వస్తుంది. ఎలానో నియంత్రించుకొంటాడు. పది రోజులు... ఇరవై రోజులు... ముప్ఫై రోజులకు ఇంకొన్ని నిమిషాలుందనగా కథ మలుపు తిరుగుతుంది. ఏమిటా మలుపు? అది చందు దర్శకత్వం వహించిన ‘నిశ్చితార్థం’ లఘుచిత్రంలో చూడాల్సిందే! ప్రధాన పాత్రల్లో పవన్‌, తేజస్వీరావు చక్కగా నటించారు. రెండు సందర్భోచిత పాటలు సినిమా బాణీకి ఏ మాత్రం తీసిపోనట్టు వినసొంపుగా ఉంటుంది. యూట్యూబ్‌లో ఈ నెల 25న విడుదలైన ఈ షార్ట్‌ ఫిలిమ్‌ను ఇప్పటికి మూడున్నర లక్షలమందికి పైగా వీక్షించారు. పది వేలమందికి పైగా లైక్‌లు కొట్టారు.  

Updated Date - 2021-03-31T06:03:51+05:30 IST