వదలని వాన అంతా హైరానా

ABN , First Publish Date - 2021-07-23T06:15:58+05:30 IST

ఎడతెరిపిలేని వర్షం ఉమ్మడి నల్లగొండ జిల్లాను అతలాకుతలం చేస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు, జిల్లాలో ముసిరిన వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా, చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నాయి. కొన్నిచోట్ల చెరువుల కింది పంటపొలాలు మునిగిపోయి, రైతులు నష్టాల పాలయ్యారు.

వదలని వాన అంతా హైరానా
భూదాన్‌పోచంపల్లిలో మూసీ వరద ఉధృతి

పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు

యాదాద్రి ఘాట్‌రోడ్డులో విరిగిపడిన కొండచరియలు

అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు 

పత్తికి పొంచిన గండం

ఆందోళనలో రైతులు



ఎడతెరిపిలేని వర్షం ఉమ్మడి నల్లగొండ జిల్లాను అతలాకుతలం చేస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు, జిల్లాలో ముసిరిన వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా, చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నాయి. కొన్నిచోట్ల చెరువుల కింది పంటపొలాలు మునిగిపోయి, రైతులు నష్టాల పాలయ్యారు. ముసురు వానకు గోడలు తడిసి పాత ఇళ్ళు నేలకూలాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనృసింహుడి ఘాట్‌రోడ్డులో కొండిచరియలు విరిగిపడడంతో ట్రాఫిక్‌ను మళ్లించారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదమే తప్పింది. ముసురు వర్షంతో పల్లెలు, పట్టణాలు అనే తేడాలేకుండా జనజీవనం స్తంభించిపోయింది. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే వారు, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు ఇబ్బందులు పడ్డారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రాలేదు. ఇక జిల్లాలోని రెండు నదులు వరద నీటితో ప్రవహిస్తున్నాయి. ఇటు మూసీ, అటు కృష్ణానదులకు వరద తాకిడి పెరిగింది. నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్ట్‌కు వరద తాకిడి పెరగడంతో ఆరుగేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి -నల్లగొండ, ఆంధ్రజ్యోతి- యాదాద్రి, సూర్యాపేట): నల్లగొండ జిల్లాలో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా అడపాదడప కురిసిన వానలు బుధవారం రాత్రినుంచి గురువారం సా యంత్రం వరకు కూడా పడుతూనే ఉన్నాయి. మరో రెండు రోజులపాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొంటోంది. మునుగోడువాగుతోపాటు పలుచోట్ల వాగులు, వంకలు పొంగుతున్నాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు జిల్లాలో సగటున 35.5మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిర్యాలగూడలో అత్యధికంగా 61.3మి.మీలు, అత్యల్పంగా పీఏపల్లిలో 13.5 మి.మీ వర్షపాతం నమోదైంది. దేవరకొండ, మిర్యాలగూడ, నల్లగొండ డివిజన్లలో ఎడతెరిపి లేకుండా ముసురు పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. మూసీకి వరద కొనసాగుతుండగా, ఆరు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నకిరేకల్‌ మండలం పాలెంలో విద్యుదాఘాతంతో ఐదు మేకలు మృతి చెందాయి.   

 

పత్తి పంటకు పొంచి ఉన్న గండం

విస్తారంగా వానలు కురుస్తుండటంతో పత్తివేసిన రైతులు ఆందోళనలో ఉన్నారు. జిల్లాలో ఏడు లక్షల ఎకరాల మేరకు పత్తి సాగైంది. ప్రధానంగా నల్లరేగడి నేలల్లో నీటి నిల్వలు ఉండటంతో పత్తి ఎర్రబారే ప్రమాదం ఉంది. దాదాపు 50శాతం పత్తి నల్లరేగడి నేలల్లోనే ఉంది. నీటి నిల్వలు ఉండకుండా గండ్లుకొట్టి నీటిని బయటికి పోయేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. నీటినిల్వలు ఉన్నట్లయితే పత్తి ఎర్రబారి వేరుకుళ్లు తెగుళ్లు సోకే అవకాశాలు ఉన్నాయి. ఒక్కో రైతు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పత్తిని సాగు చేశారు. గతేడాది ఆగస్టు నుంచి సెప్టెంబరు వరకు వరుసగా కురిసిన వానలతో పత్తి వేసిన రైతులు నిండా మునిగారు. ఒక్కో ఎకరానికి 12 క్వింటాళ్లకు బదులు కేవలం 3 క్వింటాళ్ల నుంచి 4 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. దీంతో ఆ సంవత్సరం పత్తి రైతులు ఆర్థికంగా నష్టపోయి అప్పులఊబిలో కూరుకుపోయారు. ఈ ఏడాది జూన్‌ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు పలుమార్లు వర్షాలు కనుమరుగు కాగా, మరికొన్ని సార్లు అధిక వర్షాలు వస్తున్నాయి. దీంతో అతివృష్టి, అనావృష్టి మూలంగా పత్తి రైతులు అయోమయంలో పడిపోతున్నారు. మళ్లీ గతేడాది మాదిరిగానే ఈసారి కూడా అధిక వర్షాలు వస్తే పత్తి రైతులు కోలుకునే అవకాశాలు తక్కువే. జూన్‌ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 187.3మిల్లీ మీటర్లకు గానూ 328.3మి.మీ నమోదైంది. అడపాదడప వర్షం పడితే ఎలాంటి నష్టం లేకున్నప్పటికీ ఎడతెరిపి లేకుండా కురిసిన వానల మూలంగా పత్తిపంటపై నీలినీడలు అలుముకుంటున్నాయి. ఇకపోతే ఇప్పటికే లక్ష ఎకరాల్లో వరిసేద్యం కాగా, కందులు కూడా 15వేల ఎకరాల వరకు సేద్యం చేశారు. సెప్టెంబరు 15వ తేదీ వరకు కూడా కందులు సాగు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. 


యాదాద్రి జిల్లాలో ఎడతెరిపిలేని వానలు 

యాదాద్రి భువనగిరి జిల్లావ్యాప్తంగా ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షంతో చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో మూసీవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. తుర్కపల్లి మండలంలో రెండు పాత ఇళ్లు కూలిపోయాయి. వెంటనే వారికి గ్రామంలో ఆశ్రయం కల్పించారు. భువనగిరి తహసీల్దార్‌ కార్యాలయంలోకి వర్షం నీరు చేరింది. నీటిలో సిబ్బంది విధులు నిర్వర్తించారు. గోడలన్నీ తడిసిపోవడంతో కూలడానికి సిద్ధంగా మారింది. భువనగిరిలోని ప్రధానరోడ్లన్నీ జలమయమై, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణా లు, గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన ఇళ్లను సంబంధిత అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా ఎక్స్‌కవేటర్‌తో కూల్చివేస్తున్నారు. మూసీపరివాహక ప్రాంతాల్లోని ప్రజలంతా అప్రమత్తం గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాలకు ఇబ్బందులు తలెత్తినట్లయితే జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కంట్రోల్‌రూంను సంప్రదించాలని సూచిస్తున్నారు. ముసురులోనూ జిల్లాలోని పలు మండలాల్లో వ్యవసాయ పనుల్లో కూలీలు నిమగ్నమయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సగటున 3.52 సెం.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా రాజాపేట మండలంలో 4.8 సెం.మీ నమోదు కాగా, అత్యల్పంగా సంస్థాన్‌నారాయణపురం మండలంలో 1.8 సెం.మీ వర్షపాతం నమోదైంది.  


నృసింహుడి క్షేత్రంలో విరిగిపడిన కొండచరియలు

రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు యాదాద్రి క్షేత్రానికి వెళ్లే ప్రధాన రహదారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. గురువారం ఉదయం రెండో ఘాట్‌ రోడ్డులో ఈ ఘటన జరిగింది. ఆసమయంలో భక్తులెవరూ అటువైపుగా రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.  


సూర్యాపేట జిల్లాలో అదే జోరు

జిల్లాలో మూడు రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆత్మకూర్‌(ఎస్‌) మండల కేంద్రం, అనంతగిరి మండలం వాయిలసింగారం, నాగారం మండలం వర్ధమానుకోటలో పాత ఇళ్ళు తడిసి కూలిపోయాయి. నాగారం నుంచి డీ.కొత్తపల్లి చెరువులోకి భారీగా వరద నీరు చేరుకుంటుంది. నాగారం బంగ్లా వద్ద వరద నీరు పంటపొలాల్లో చేరి చెరువును తలపించింది. వర్షం వల్ల పంట పొలాలకు ఎలాంటి నష్టం లేకపోయినప్పటికీ కూరగాయల సాగు చేసే రైతులకు నష్టం వాటిల్లుతోంది. జిల్లాలో ఏడువేల ఎకరాల్లో రైతులు కూరగాయలు సాగుచేస్తున్నారు. వర్షాలకు ఆకు కూరలకు మచ్చలు వస్తున్నాయి. దోస, బీర, కాకరకాయలకు పూతరాలిపోతోంది. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. నడిగూడెం మండలంలో అత్యధికంగా 6.58 సెం.మీ వర్షపాతం నమోదుకాగా, అత్యల్పంగా పాలకీడులో 1.3 సె.మీ వర్షంపాతం నమోదైంది.  


పిలాయిపల్లి కాల్వకు గండి 

భూదాన్‌పోచంపల్లి: కురుస్తున్న ముసురుతో భూదాన్‌ పోచంపల్లి-కొత్తగూడెం మధ్యనున్న కళ్లేడువాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పిలాయిపల్లి కాల్వ కట్టకు గండిపడింది. ఓవైపు కాల్వపనులు కొనసాగుతున్న నేపథ్యంలో నాణ్యత కొరవడి కాల్వకు గండి పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాల్వకు గండిపడి మెహర్‌నగర్‌కు వెళ్లే మార్గంలోని పంటపొలాల్లోకి నీరు చేరడంతో పంటచేలు తీవ్రంగా నష్టపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.  


మూసీకి పెరిగిన ఇన్‌ఫ్లో

ఆరు క్రస్ట్‌ గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల 

కేతేపల్లి/నాగార్జునసాగర్‌/డిండి/చింతలపాలెం/సూర్యాపేట రూరల్‌, జూలై 22: ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు గురువారం ఇన్‌ఫ్లో పెరిగింది. దీంతో ప్రాజెక్టు అధికారులు ఆరు క్రస్ట్‌ గేట్లనుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. 10రోజులకు పైగా ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద నీటి తాకిడి రెండు రోజుల క్రితం తగ్గుము ఖం పట్టింది. ఉపరితల ఆవర్తనంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో బుధవా రం రాత్రి నుంచి ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద వస్తోంది. గురువారం ఉద యం 2700 క్యూసెక్కులు ఉన్న ఇన్‌ఫ్లో మధ్యాహ్నానికి తొమ్మిది వేల క్యూ సెక్కులు, సాయంత్రానికి 12,034 క్యూసెక్కులకు చేరింది. దీంతో అప్రమత్తమైన మూసీ అధికారులు ప్రాజెక్టులోని 2, 3, 4, 7, 8, 10వ నెంబరు క్రస్టు గేట్లను తొమ్మిది అడుగుల మేర ఎత్తి 27,581 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిసా ్థయి నీటిమట్టం 645అడుగులు(4.46టీఎంసీలు) కాగా 636.60అడుగులు(2.49టీఎంసీలు) ఉంది. పరిసర గ్రామాల నుంచి వచ్చే వర్షపు నీరు, ప్రాజెక్టు నుంచి విడుదల అవుతున్న వరదతో దిగువ మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది.  నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590అడుగులు(312.0450టీఎంసీలు) కాగా ప్రస్తుతం 534.90అడుగులు(177.8698టీఎంసీలు)గా ఉంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 21,189క్యూసెక్కులు కాగా 500 క్యూసెక్కులను ఎస్‌ఎల్‌బీసీకి వదులుతున్నారు. అదే విధంగా మూసీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175అడుగులు(45.77టిఎంసీలు) కాగా ప్రస్తుతం 173.55అడుగులు(43.54టిఎంసీలు)గా ఉంది. ప్రాజెక్టుకు 10600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా 10వేల క్యూసెక్కుల నీటిని పవర్‌హౌస్‌తో దిగువకు వదులుతున్నారు.  


ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఏవీ. రంగనాథ్‌, ఎస్పీ, నల్లగొండ జిల్లా

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పోలీస్‌ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. కల్వర్టులు, వాగుల వద్ద రహదారిపై జాగ్రత్తగా ఉండాలి. ఇబ్బందులెదురైతే డయల్‌ 100 ద్వారా సమాచారం ఇవ్వాలి. ప్రజలు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలను పట్టుకోవద్దు. చిన్న పిల్లలను దూరంగా ఉంచాలి. గ్రామాలకు వెళ్లే రహదారులు, పొలాలకు వెళ్లే రహదారులు కొట్టుకపోయే ప్రమాదం ఉంది. ఇబ్బందులు ఎదురైతే సమాచారం ఇవ్వాలి.  


Updated Date - 2021-07-23T06:15:58+05:30 IST