నిర్లక్ష్యానికి భారీ మూల్యం!

ABN , First Publish Date - 2020-08-03T09:40:28+05:30 IST

హిందూస్థాన్‌ షిప్‌యార్డులో అధికారుల నిర్లక్ష్యం వల్లనే క్రేన్‌ కుప్పకూలిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నిర్లక్ష్యానికి భారీ మూల్యం!

భారీ క్రేన్‌ కూలిపోవడానికి ఇదే కారణమా?

షిప్‌యార్డులో ప్రమాదంపై అనేక అనుమానాలు

ముంబై కంపెనీ ఎందుకు  తప్పుకుంది? 

‘ఆ మొత్తం’ ఇవ్వకపోవడంతోనే షిప్‌యార్డు అధికారులు టెస్టింగ్‌కు రాలేదా?

క్రేన్‌ తయారీదారు లేకుండానే సామర్థ్య పరీక్షా!

ఇద్దరుండే క్యాబిన్‌లో పది మందా?  అదే పెద్ద పొరపాటు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): హిందూస్థాన్‌ షిప్‌యార్డులో అధికారుల నిర్లక్ష్యం వల్లనే క్రేన్‌ కుప్పకూలిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు...  ప్రమాదానికి గురైన క్రేన్‌ను ‘‘లెవెల్‌ లాఫింగ్‌ క్రేన్‌’’గా వ్యవహరిస్తారు.. ఇలాంటివి దేశంలో చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. అత్యంత భారీ క్రేన్‌ ఇది. విశాఖపట్నంలో ఇలాంటి క్రేన్‌ లేదు. ఇదే మొదటిది. దీని ఖరీదు రూ.14 కోట్లు. ముంబైకి చెందిన అనుపమ్‌ కంపెనీ దీనిని సరఫరా చేసింది. కంపెనీ ఎండీ మెహుల్‌ పటేల్‌ విశాఖకు చెందిన ఓ సంస్థకు అందించిన వివరాల ప్రకారం... 2106లో క్రేన్‌ ను సరఫరా చేశారు. దానిని 2017లో కమిషనింగ్‌ చేశారు.


ఆ ఏడాదే ప్రిలిమినరీ లోడ్‌ టెస్టింగ్‌ చేశారు. దీనికి హెచ్‌ఎస్‌ఎల్‌ తరఫున అధికారులు హాజరు కావాలి. కానీ ఎవరూ రాలేదు. ఆ తరువాత 2018లో మరోసారి లోడ్‌ టెస్టింగ్‌ చేశారు. అప్పుడు షిప్‌యార్డు అధికారులు రాలేదు. సంతకాలు చేయలేదు. ఇలాంటి పరీక్షలు నిర్వహించేటప్పుడు కాంట్రాక్టర్‌కు అనుకూలంగా వ్యవహరించడానికి ‘కొంత మొత్తం’ చేతులు మారుతుంది. అలాంటిదేమీ లేకుండా లోడ్‌ టెస్టింగ్‌కు పిలవడంతో ఎవరూ రాలేదని ప్రధాన ఆరోపణ. చివరకు గత ఏడాది జనవరిలో షిప్‌యార్డు అధికారులు కాంట్రాక్టర్‌ని పిలిచి సమావేశం నిర్వహించారు.


మరోసారి లోడ్‌ టెస్టింగ్‌ చేయమన్నారు. తమకు బిల్లులు ఇవ్వలేదని, వాటిని క్లియర్‌ చేస్తే లోడ్‌ టెస్టింగ్‌ చేస్తానని కాంట్రాక్టర్‌ మెలిక పెట్టారు. ఇది జరిగిన రెండు మూడు నెలలకు అనుపమ్‌ సంస్థ కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తున్నట్టు హెచ్‌ఎస్‌ఎల్‌ అధికారులు సమాచారం పంపారు. లిక్విడిటీ డామేజీ కింద రూ.2.5 కోట్లు, బ్యాంక్‌ గ్యారెంటీతో కలిపి మొత్తం రూ.5.20 కోట్లు ఆ సంస్థకు ఇవ్వకుండా నిలిపివేశారు. ఆ తరువాత స్థానికంగా ఉండే గ్రీన్‌ ఫీల్డ్‌, లీడ్‌ ఇంజనీర్స్‌ సంస్థలకు క్రేన్‌ ఎరక్షన్‌, టెస్టింగ్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చారు. దేశంలో అరుదైన క్రేన్‌ను హ్యాండిల్‌ చేసే సామర్థ్యం ఈ సంస్థలకు ఉందా? అన్న అనుమానం... ఈ  ప్రమాదం జరిగిన తరువాత  వ్యక్తమవుతున్నది. 


తయారీదారు లేకుండా లోడ్‌ టెస్టింగా?

భారీ క్రేన్లకు లోడ్‌ టెస్టింగ్‌ చేసేటప్పుడు తప్పనిసరిగా దానిని తయారుచేసిన కంపెనీ ఉండాలని ఆ రంగానికి చెందిన అనుభవజ్ఞులు చెబుతున్నారు. ఇక్కడ ముంబై కంపెనీ తయారీదారు లేకుండానే లోడ్‌టెస్ట్‌ చేశారు.

లోడ్‌ టెస్టింగ్‌ చేసేటప్పుడు థర్డ్‌ పార్టీ అనుమతి అవసరం. లాయిడ్స్‌, ఇండియన్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ షిప్పింగ్‌, బీవీక్యూఐ వంటి సంస్థలు థర్డ్‌ పార్టీగా ఉంటాయి. వారు క్రేన్‌ని తనిఖీ చేసి టెస్టింగ్‌కు అనుమతి ఇస్తారు. వారు కూడా ఆ సమయంలో ఉంటారు. షిప్‌యార్డులో క్రేన్‌కు ఇలాంటి అనుమతి లేదనే వాదన వినిపిస్తున్నది

లెవెల్‌ లాఫింగ్‌ వంటి భారీ క్రేన్లలో ఎలకా్ట్రనిక్స్‌, ఎలక్ర్టికల్‌ సిస్టమ్స్‌ అనేకం ఉంటాయి. వాటికి సంబంధించిన ఇంజనీర్లు కూడా లోడ్‌ టెస్టింగ్‌ సమయంలో ఉండాలి. వీటిని ఎక్కువగా రిమోట్‌ కంట్రోలర్‌తో ఆపరేట్‌ చేస్తారు. ప్రమాదం జరిగినప్పుడు ఈ ఇంజనీర్లు లేరని అంటున్నారు.

క్రేన్‌ తయారీదారుడు అందుబాటులో లేనప్పుడు అదే స్థాయి కలిగిన మరో తయారీదారు/ సరఫరాదారుని తీసుకువచ్చి లోడ్‌ టెస్టింగ్‌ చేయాలి. అది కూడా ఇక్కడ జరగలేదు.

క్రేన్‌కి ప్రత్యేకంగా డిజైన్‌ డ్రాయింగ్‌ ఉంటుంది. దానిని దగ్గర ఉంచుకొని ఆ ప్రకారం అన్నీ అమర్చారా? లేదా? బోల్టులు, నట్లు ఏమైనా లూజుగా ఉన్నాయా? ఆయా పరికరాలు పనిచేస్తున్నాయా? లేదా? అని చెక్‌ చేస్తారు. క్రేన్‌ డిజైన్‌ అనుపమ్‌ దగ్గర ఉన్నందువల్ల ఇక్కడ టెస్టింగ్‌ ఏ ఆధారంతో చేశారని ఈ రంగంలో అనుభవం వున్న కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

- క్రేన్‌ లోడ్‌ టెస్టింగ్‌ చేసేటప్పుడు క్యాబిన్‌లో పైలట్‌, సహాయంగా మరో అసిస్టెంట్‌ ఉంటారు. మిగిలిన ఆపరేషన్‌ అంతా రిమోట్‌తో చేస్తారు. కానీ ఇక్కడ క్యాబిన్‌లో 10 మంది ఉన్నారు. అక్కడి అధికారులకు క్రేన్‌పై అవగాహన లేదనడానికి ఇదే నిదర్శనం. ప్రమాదంలో ఎక్కువ మంది చనిపోవడానికి కారణం కూడా ఇదేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


అధికారుల వైఫల్యమే

పి.విష్ణుకుమార్‌ రాజు(మాజీ ఎమ్మెల్యే), ఎండీ, ఎస్‌వీసీ ప్రాజెక్ట్స్‌

మా కంపెనీ తరఫున ఇంతవరకు 20 భారీ క్రేన్లను కొనుగోలు చేశాం. తూర్పు నౌకాదళానికి చెందిన షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌లో తయారైన న్యూక్లియర్‌ సబ్‌మెరైన్‌ను లిఫ్డ్‌ చేయడానికి 420 టన్నుల భారీ క్రేన్‌ను సమకూర్చింది కూడా మేమే. ఆ అనుభవంతో చెబుతున్నా. షిప్‌యార్డులో క్రేన్‌ ప్రమాదానికి పూర్తిగా అఽధికారుల వైఫల్యమే కారణం. అనుపమ్‌ కంపెనీ నుంచి మేము కూడా క్రేన్లు కొనుగోలు చేశాం. లోడ్‌ టెస్టింగ్‌ అంటే అదో పెద్ద పరీక్ష. తయారీదారు లేకుండా చేయనేకూడదు. కానీ ఎలా చేశారో.... వారికి ఎవరు అలాంటి సూచనలు చేశారో తెలియడం లేదు.

Updated Date - 2020-08-03T09:40:28+05:30 IST