అకారణ ద్వేషం ఎవరిది?

ABN , First Publish Date - 2022-04-13T06:45:42+05:30 IST

ఈ దేశంలో హిందువులు కలిసి మాట్లాడుకోకూడదు. తమకు జరుగుతున్న అన్యాయాలపై నిరసన వ్యక్తం చేయకూడదు.

అకారణ ద్వేషం ఎవరిది?

ఈ దేశంలో హిందువులు కలిసి మాట్లాడుకోకూడదు. తమకు జరుగుతున్న అన్యాయాలపై నిరసన వ్యక్తం చేయకూడదు. అలా చేస్తే లౌకికవాదం ప్రమాదంలో పడినట్లు లెక్క. ఈ నేపథ్యంతో కూడుకున్నదే ఈ నెల 9వ తేదీన రామచంద్ర గుహ రాసిన వ్యాసం. కర్ణాటక ఉడిపి జిల్లాలో జరిగిన సంఘటనకు శ్రీలంకలోని తమిళ సమస్యకూ పొంతనే లేదు.


ఇక ఉడిపి పీఠాధిపతి తనను కలిసిన ముస్లిం సమాజ ప్రతినిధులతో మాట్లాడిన విషయాలను కొన్నిటిని వ్యాసకర్త దాచిపెట్టారు. ఈ సమస్య పరిష్కారంలో మూడో వ్యక్తి అవసరం లేకుండా సమస్య పరిష్కారం మీ చేతుల్లోనే ఉందని, తమ వైపు నుంచి తప్పులు జరిగినప్పుడు తప్పులు చేసిన వారిని సమర్థించడం, తప్పులు చేయడమే మా హక్కు అంటూ బరితెగించి ప్రవర్తిస్తే–తప్పులను భరించే సమాజం ఇలాగే ప్రవర్తిస్తుందని ఆయన ఇచ్చిన వివరణ ప్రపంచంలో ఎవరికైనా వర్తిస్తుంది.


మాకు చదువు కంటే, విద్యాసంస్థల నియమాల కంటే నా మతాచారాలే ముఖ్యమని మొండి వాదన చేసే వారిని వెనకేసుకుని రావడమే లౌకికవాదం అనుకుంటే సరిపోదు. హిజాబ్ వ్యవహారం ఇలాంటిదే. ముస్లిం బాలికలకు విద్యను దూరం చేయడం అనే విషయాన్ని వాస్తవ దృష్టితో చూస్తే, ముస్లిం మత పెద్దలే ఈ విషయంలో ముందు ఉంటారు. స్వాతంత్ర్యానంతరం ఈ దేశ ప్రభుత్వాలు కుల, మత, లింగ వివక్ష లేకుండా బాలికల విద్యకు ప్రాధాన్యత ఇచ్చాయనే విషయం వాస్తవం. అయినప్పటికీ ముస్లిం సమాజంలోని స్త్రీలు విద్యాపరంగా ఎంతో వెనుకబడి ఉన్నారు. హిందువుల అణచివేత వల్ల ముస్లిం స్త్రీలు విద్యాపరంగా వెనుకబడి ఉన్నారని వాదన చేస్తే, ఇస్లామిక్ దేశాలలో వారు విద్యాపరంగా ఎందుకు వెనుకబడి ఉన్నట్లు?


చట్టసభల్లో, పౌర ఉద్యోగాలలో ముస్లిం జనాభాకు సరిపోయే ప్రాతినిధ్యం లేదన్న వ్యాసకర్త వాదనలో సత్యం లేకపోలేదు. ఈ దేశం 1947లో మతం ఆధారంగా ముస్లిం మెజారిటీగా ఉండే ప్రాంతాలు పాక్‌, బంగ్లాదేశ్‌లుగా, హిందూ మెజారిటీ ప్రాంతాలు భారతదేశంగా విడిపోయాయనే విషయం గుర్తుపెట్టుకుని, మూడు ప్రాంతాల్లోని జనాభా, వారి ప్రాతినిధ్యం, మూడు ప్రాంతాల్లోని మత వివక్షతలు, అణచివేతలు ఇత్యాది విషయాలను పరిశీలిస్తేనే వాస్తవ విషయాలు బోధపడతాయి. ఇక ముస్లింలు తినే ఆహారంపై, వస్త్రధారణపై, ఆచార వ్యవహారాలపై హిందుత్వవాదులు నిబంధనలు విధిస్తున్నారని చెప్పడం విష ప్రచారమే. ఈ విష ప్రచారంలో కుహనా లౌకికవాద హిందువులే ముందు వరుసలో ఉంటున్నారు. ముస్లింల అభిమానాన్ని చూరగొనటం కోసం దేశ భద్రతకు ప్రమాదం కలిగించే జిహాదీ ఉగ్రమూకలను సైతం వెనకేసుకుని వచ్చే భావ దాస్య పరిధిలోకి వెళ్తున్నారు. కాశ్మీర్ లోయలో ప్రభవించిన ద్వేషం, ఉన్మాదం గురించి వ్యాసకర్తకు తెలియదా? తెలిసినా–దాచి పెట్టాలి కదా!


ఈ దేశంలో ముస్లింలు అత్యంత భద్రతతో జీవిస్తున్నారు. వారికి భద్రత లేదని వాపోయేవారు అకారణ ద్వేషం, ఉన్మాదాన్ని ముస్లింలలో నింపి, వారికి ప్రశాంతతను దూరం చేస్తున్నారనేది వాస్తవమని రామచంద్ర గుహ తెలుసుకుంటే మంచిది.


– ఉల్లి బాల రంగయ్య

Updated Date - 2022-04-13T06:45:42+05:30 IST