Abn logo
Sep 15 2021 @ 21:24PM

హిందువులకు సహనం ఎక్కువ: రచయిత జావెద్ అఖ్తర్

ముంబై: హిందువులు చాలా మంచి వారని, వారికి సహనం ఎక్కువగా ఉంటుందని కవి, బాలీవుడ్ గేయ రచయిత జావెద్ అఖ్తర్ అన్నారు. బుధవారం శివసేన అధికారిక పత్రిక సామ్నాకు రాసిన వ్యాసంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితం ఇదే సామ్నా ఎడిటోరియల్‌లో జావెద్ అఖ్తర్‌ను విమర్శిస్తూ రాసుకొచ్చారు. అయితే తన వ్యాఖ్యలకు వివరణ సామ్నా ద్వారా ఇచ్చుకోవడం గమనార్హం.


జావెద్ అఖ్తర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్‌లు తాలిబన్ లాంటివని అన్నారు. అయితే జావెద్ వ్యాఖ్యలను సామ్నాలో తప్పు పట్టారు. ‘‘సంఘ్‌తో విభేదాలు ఉండొచ్చు. కానీ..’’ అనే హెడ్డింగ్‌తో రాసిన ఎడిటోరియల్‌లో ‘‘హిందుత్వను తాలిబన్‌తో పోల్చడం హిందుత్వ సంస్కృతిని అవమానించడమే’’ అని రాసుకొచ్చారు. కాగా బుధవారం జావెద్ అఖ్తర్ రాసిన వ్యాసంలో ‘‘నా తాజా ఇంటర్వ్యూలో హిందువులు చాలా మంచివారు, ప్రపంచంలోనే అత్యంత సహనం ఉన్నవారు అని చెప్పాను. భారతీయ మూలాలు ఎప్పటికీ అఫ్ఘాన్ లాంటి పరిస్థితులకు లొంగవు. భారతీయులు ఎప్పటికీ తాలిబన్‌లా ప్రవర్తించరు. ఇక్కడి డీఎన్‌ఏ అందుకు అంగీకరించదు’’ అని రాసుకొచ్చారు.