హిందూజాల ఇంటి పోరు

ABN , First Publish Date - 2020-06-25T06:20:06+05:30 IST

ఆస్తుల పంపకాల విషయంలో అన్నదమ్ములు మధ్య తగాదాలు సర్వసాధారణమే. కానీ, బయటి ప్రపంచానికి ఎంతో ఆత్మీయంగా కన్పించే హిందూజా సోదరులు కూడా కుటుంబ ఆస్తుల విషయంలో కోర్టుకెక్కడం...

హిందూజాల ఇంటి పోరు

  • సోదరుల మధ్య ఆస్తి తగాదా 
  • కోర్టుకెక్కిన ఎస్‌పీ హిందూజా  
  • వివాదానికి కేంద్ర బిందువుగా 2014 నాటి లెటర్‌  


లండన్‌: ఆస్తుల పంపకాల విషయంలో అన్నదమ్ములు మధ్య తగాదాలు సర్వసాధారణమే. కానీ, బయటి ప్రపంచానికి ఎంతో ఆత్మీయంగా కన్పించే హిందూజా సోదరులు కూడా కుటుంబ ఆస్తుల విషయంలో కోర్టుకెక్కడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. హిందూజా కుటుంబానికి పెద్ద దిక్కు, అందరిలో అగ్రజుడైన శ్రీచంద్‌ పరమానంద్‌ (ఎస్‌పీ) హిందూజా.. తన సోదరులు గోపీచంద్‌  హిందూజా, ప్రకాశ్‌ హిందూజా, అశోక్‌ హిందూజాలకు వ్యతిరేకంగా కేసు వేశారు. ఈ వివాదానికి 2014 జూలై నాటి లెటర్‌ కేంద్ర బిందువుగా మారింది. ఆ లేఖ చెల్లుబాటు, ప్రభావం చుట్టే ఈ కేసు ముడిపడి ఉంది. ఆస్తుల పంపకం విషయంలో ప్రతి సోదరుడు మరో సోదరుడిని తన ఎగ్జిక్యూటర్‌గా నియమించుకుంటాడనీ,  ఏ సోదరుడి పేరుమీదున్న ఆస్తి అయినా నలుగురికీ చెందుతుందని ఆ లెటర్‌లో ఉంది. అయితే ఆ పత్రం గతంలో సోదరులు కుదుర్చుకున్న అనధికారిక అగ్రిమెంట్‌ లేదా వీలునామా లేదా కుటుంబ నియమం లేదా పవర్‌ ఆఫ్‌ అటార్నీ అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. తాజాగా 84 ఏళ్ల ఎస్‌పీ హిందూజా.. ఈ లెటర్‌కు చట్టపరంగా ఎలాంటి విలువ, ప్రభావం లేదని, వీలునామాగానూ భావించలేమని ప్రకటించాలంటూ కోర్టును ఆశ్రయించారు.


వృద్ధాప్యంలో చిత్తవైకల్యానికి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో ఎస్‌పీ హిందూజా తరఫున ఆయన కూతురు వినూ ఈ కేసులో పాల్గొనేందుకు ఇంగ్లాండ్‌ హైకోర్టు మంగళవారం అనుమతించింది. ఈ సందర్భంగా హిందూజాల మధ్య వివాదం బయటికి వచ్చింది. 

హిందూజా గ్రూపులోని చాలా కంపెనీల్లో ఈ సోదరులకు వ్యక్తిగత వాటాలు లేవు. కంపెనీల్లోని ప్రమోటర్ల వాటాలన్నీ గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీల పేరిటే ఉన్నాయి. స్విట్జర్లాండ్‌లోని హిందుజా బ్యాంక్‌ మాత్రం ఎస్‌పీ హిందూజా పేరున ఉంది. భారత్‌లోని హిందూజా గ్లోబల్‌ సొల్యూషన్స్‌లోనూ సోదరులకు వ్యక్తిగత హోదాలో వాటాలున్నాయి. గతంలో రాసుకున్న లెటర్‌ను ఉపయోగించుకొని గోపీచంద్‌, ప్రకాశ్‌, అశోక్‌ హిందూజాలు పెద్దన్న పేరుమీదున్న హిందూజా బ్యాంక్‌ నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఈ వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. 




వ్యాపారాలపై ఎలాంటి ప్రభావం ఉండదు.. 

తమ మధ్య కొనసాగుతున్న ఆస్తి తగాదాతో గ్రూప్‌ వ్యాపారాలపై ఎలాంటి ప్రభావం ఉండదని ముగ్గురు సోదరులు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, కోర్టుకెక్కడం మాత్రం తమ గ్రూప్‌ వ్యవస్థాపకుడు, కుటుంబ విలువలకు వ్యతిరేకమని వారు పేర్కొన్నారు. ‘‘ప్రతీదీ అందరికీ చెందుతుంది. ఏది కూడా ఏ ఒక్కరికో సంబంధించింది కాదు’’ అన్న కుటుంబ నియమం దశాబ్దాలనాటిదన్నారు. అయితే, కోర్టులో ఎస్‌పీ హిందూజా నెగ్గితే, ఆయన పేరిట ఉన్న బ్యాంక్‌ ఆస్తులన్నీ వినూ పేరిట బదిలీ అవుతాయి. 


కుబేర కుటుంబం

హిందూజా సోదరులు ప్రపంచ కుబేరుల్లో ఒకరు. ఫోర్బ్స్‌ రియల్‌ టైం బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం.. ప్రస్తుతం వారి ఆస్తి 1,310 కోట్ల డాలర్లు. ఈ జాబితాలో వారు 125వ స్థానంలో ఉన్నారు. సుమారు 40 దేశాలకు విస్తరించిన హిందూజా గ్రూప్‌.. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, ఆటోమొబైల్‌, టీవీ, మీడియా, బీపీఓ, లూబ్రికెంట్స్‌ తదితర వ్యాపారాలను నిర్వహిస్తోంది. 


Updated Date - 2020-06-25T06:20:06+05:30 IST