Abn logo
Sep 24 2021 @ 18:31PM

ఆత్మవిశ్వాసాన్ని నింపే పవిత్ర గ్రంథం భగవద్గీత: ధర్మాచార్యులు

హైదరాబాద్:"సర్వేజనా సుఖినోభవంతు" అంటూ లోకకళ్యాణం కోరుకునే ఏకైక ధర్మం హిందూ ధర్మమని, తోటి మనిషిలో దైవాన్ని చూసి, సాటి మనిషికి సహాయం పడే వ్యక్తిత్వం హిందువుల సొంతమని ధర్మాచార్యులు చెప్పారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో రెడ్‌హిల్స్‌ మారుతి గార్డెన్స్‌లో ధర్మాచార్యుల సమ్మేళనం నిర్వహించారు. డిసెంబర్ 14న గీత జయంతి రోజున లక్ష మంది యువకులతో "లక్ష యువ గళ గీతార్చన" కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా సాధు సంతులతో ఈ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాచార్యులు మాట్లాడుతూ యువతీ యువకులకు సంస్కార అమృతం అందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. యువతలో ఆత్మవిశ్వాసం నింపే భగవద్గీత వైభవాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం చాలా ఉందన్నారు. ప్రపంచ దేశాలకు గురు స్థానంలో ఉన్న భారత్ భగవద్గీత ఆధారంగా జ్ఞానాన్ని అందించిందని చెప్పారు.

 


విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సంఘటన కార్యదర్శి యాదిరెడ్డి మాట్లాడుతూ ప్రతి హిందువూ తమ కర్తవ్యంగా ధర్మ రక్షణలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 14 గీత జయంతి రోజున 16 నుంచి 40 సంవత్సరాల వయసున్న లక్ష మంది యువకులతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భగవద్గీత పారాయణం చేస్తామన్నారు. అంతకుముందు అక్టోబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన లక్ష యువ గళ గీతార్చన పేరుతో రథయాత్ర నిర్వహిస్తామని యాదిరెడ్డి తెలిపారు. సమావేశానికి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి స్వాములతో పాటు 165 ధార్మిక సంస్థల ప్రతినిధులు హాజరు కావడం ఆనందంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జాతీయ నాయకులు రాఘవులు, రాష్ట్ర అధ్యక్షులు రామరాజు, లక్ష యువ గళ గీతార్చన కార్యక్రమ కన్వీనర్ వెంకటేశ్వర రాజు, కైలాష్ నారాయణ, అశ్విని సుబ్బారావు, వికాస్ తరంగిని రమేష్, లక్ష్మీనాథాచార్యులు, కసిరెడ్డి వెంకటరెడ్డి, పుల్ల సత్యనారాయణ, జగదీశ్వర్ జి, రాజేశ్వర్ రెడ్డి, రాజేందర్రెడ్డి, పండరి నాథ్, పగుడాకుల బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

హైదరాబాద్మరిన్ని...