హిందూ ధర్మ ప్రచారానికి ప్రత్యేక వేదిక అవసరం

ABN , First Publish Date - 2021-03-08T07:31:31+05:30 IST

హిందూ భావజాలం వ్యాప్తి చెందితే హైదరాబాద్‌ను భాగ్యనగరంగా మార్చడాన్ని ఎవరూ ఆపలేరని బీజేపీ మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జి మురళీధర్‌రావు అన్నారు.

హిందూ ధర్మ ప్రచారానికి ప్రత్యేక వేదిక అవసరం

బీజేపీ మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జి మురళీధర్‌రావు 

హైదరాబాద్‌ సిటీ/ఖైరతాబాద్‌ మార్చి 7 (ఆంధ్రజ్యోతి): హిందూ భావజాలం వ్యాప్తి చెందితే హైదరాబాద్‌ను భాగ్యనగరంగా మార్చడాన్ని ఎవరూ ఆపలేరని బీజేపీ మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జి మురళీధర్‌రావు అన్నారు. ఖైరతాబాద్‌ విశ్వేశ్వరయ్యభవన్‌లో ఆదివారం భారత్‌నీతి ఏర్పాటు చేసిన ‘డిజిటల్‌ హిందూ కాన్‌క్లేవ్‌’లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ వేదికలు పారదర్శకంగా పనిచేయడంలేదని, హిందూ జన జాగృతి కోసం ప్రత్యేక వేదిక కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం హిందూ ధర్మంపై సోషల్‌మీడియాలో దాడి జరుగుతుందని.. దానికి ధీటుగా జవాబు చెప్పేందుకు ప్రతి హిందువు పనిచేయాలన్నారు. రాముడికి కోట్లాది మందిని ప్రేరేపించే శక్తి ఉందని.. కోట్లాదిమందితో పూజించబడే రాముడు ప్రపంచంలో ఎక్కడా లేడన్నారు. హిందూ ఎజెండాను విశ్వవ్యాప్తం చేయడం ద్వారా రామరాజ్య స్థాపనకు ప్రతి హిందువు కృషిచేయాలన్నారు. కొందరు హిందూ ధర్మాన్ని కించపరుస్తూ సోషల్‌మీడియాలో పోస్టింగ్‌లు పెడుతున్నారని, వారికి సరైన సమాధానమివ్వాలన్నారు. ఛందోబద్దమైన భాష తెలుగు అని, అవధాన ప్రక్రియ గురించి అందరికీ అవగాహన వచ్చేలా ప్రచారం చేయాలని కోరారు. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న మధ్యప్రదేశ్‌ ఎమ్మెల్యే మనోజ్‌ తివారి కూడా మాట్లాడారు. భారత్‌నీతి జాతీయ కో-ఆర్డినేటర్‌ కిరణ్‌కల్లూరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇస్కాన్‌ గౌరంగదా్‌సతోపాటు హిందూ సంఘాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-08T07:31:31+05:30 IST