ఆలయాన్ని తరలిస్తే సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటాం...Hindu activistsల బెదిరింపు

ABN , First Publish Date - 2022-04-30T17:28:12+05:30 IST

ఆగ్రా నగరంలోని రాజాకీమండి రైల్వేస్టేషన్ ప్రాంగణం నుంచి 250 ఏళ్ల నాటి చాముండా దేవి ఆలయాన్ని మార్చాలని రైల్వే అధికారులు నోటీసు జారీ చేయడంతో హిందూ కార్యకర్తలు నిరసన తెలిపారు...

ఆలయాన్ని తరలిస్తే సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటాం...Hindu activistsల బెదిరింపు

ఆగ్రా(ఉత్తరప్రదేశ్):ఆగ్రా నగరంలోని రాజాకీమండి రైల్వేస్టేషన్ ప్రాంగణం నుంచి 250 ఏళ్ల నాటి చాముండా దేవి ఆలయాన్ని మార్చాలని రైల్వే అధికారులు నోటీసు జారీ చేయడంతో హిందూ కార్యకర్తలు నిరసన తెలిపారు.ఆగ్రాలోని రైల్వే స్టేషన్ ప్రాంగణం నుంచి ఆలయ భవనాన్ని మార్చాలని ఆలయ అధికారులకు డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) ఆనంద్ స్వరూప్ ఏప్రిల్ 20వతేదీన  నోటీసు జారీ చేయడంతో సమస్య మొదలైంది.ఆలయాన్ని తరలిస్తే తాము సామూహిక ఆత్మహత్య చేసుకుంటామని హిందూ కార్యకర్తలు బెదిరించారు. ఆలయం వల్ల రైల్వే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, ఆలయాన్ని తరలించాలని రైల్వే అధికారులు కోరారు.


రైల్వేస్థలాల్లో ఆక్రమణల తొలగింపులో భాగంగా మసీదు, దర్గాలను తరలించాలని అధికారులు నోటీసులు జారీ చేశారు.ఆలయాన్ని తరలించ వద్దని కోరుతూ విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు ఉత్తర మధ్య రైల్వే ఆగ్రా డివిజన్ డీఆర్‌ఎం కార్యాలయంలో హనుమాన్ చాలీసా పఠించారు.ఆలయాన్ని తొలగించకుంటే ఆగ్రాలోని రాజామండి రైల్వే స్టేషన్‌ను మూసివేసే అవకాశం ఉందని డీఆర్‌ఎం ట్వీట్ చేశారు.250 సంవత్సరాల ఆలయం ఒక్క ఇటుక కూడా ఎవరూ కదపలేరని, ఆలయం కోసం తాము ఆత్మాహుతికి సిద్ధమని మహంత్ వీరేంద్ర ఆనంద్ చెప్పారు.బ్రిటీష్ కాలం నుంచి ఉన్న ఆలయంలో రైల్వే ప్రయాణికులు కూడా ప్రార్థనలు చేస్తారని పూజారి చెప్పారు.


ఆలయాన్ని రక్షించుకునేందుకు తాము పోరాడుతామని రాష్ట్రీయ హిందూ పరిషత్ భారత్ జాతీయ అధ్యక్షుడు గోవింద్ పరాశర్ చెప్పారు.సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి ఆక్రమణల తొలగింపు డ్రైవ్‌లో భాగంగా ఆలయం, దర్గా, మసీదులకు నోటీసులు పంపించామని రైల్వే అధికారులు చెప్పారు. ఆగ్రా కంటోన్మెంటు రైల్వే స్టేషన్ ఆవరణలోని రైల్వే భూమిలో ఉన్న మసీదు దర్గాకు కూడా తాము నోటీసు జారీ చేశామని అధికారులు పేర్కొన్నారు. ఆలయాన్ని తొలగించాలని నోటీసు ఇచ్చిన డీఆర్ఎంను తొలగించాలని హిందూ జాగరణ్ మంచ్ మాజీ కార్యదర్శి సురేంద్ర భాగోరే డిమాండ్ చేశారు.


Updated Date - 2022-04-30T17:28:12+05:30 IST