హిందీ వివాదం : సుదీప్‌నకు మద్దతుగా ఏకమవుతున్న కన్నడ నేతలు

ABN , First Publish Date - 2022-04-28T20:20:41+05:30 IST

జాతీయ భాషపై బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్

హిందీ వివాదం : సుదీప్‌నకు మద్దతుగా ఏకమవుతున్న కన్నడ నేతలు

బెంగళూరు : జాతీయ భాషపై బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్, కన్నడ నటుడు కిచ్చా సుదీప్ మధ్య ట్విటర్ వేదికగా రేగిన వివాదంపై రాజకీయ నేతలు కూడా స్పందిస్తున్నారు. కర్ణాటక బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సుదీప్‌నకు మద్దతుగా ఏకమవుతున్నారు. 


కన్నడ సినిమా  కేజీఎఫ్ చాప్టర్-2 పాన్ ఇండియా సినిమాగా విజయవంతమైన నేపథ్యంలో సుదీప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇక హిందీని జాతీయ భాషగా చూడవలసిన అవసరం లేదన్నారు. బాలీవుడ్ సినిమాలను డబ్బింగ్ చేసి ప్రాంతీయ భాషలలో విడుదల చేయాలన్నారు. దీనిపై అజయ్ దేవ్‌గన్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ, హిందీ జాతీయ భాష కాకపోతే మీ మాతృభాషల్లోని సినిమాలను హిందీలోకి డబ్ చేసి, ఎందుకు రిలీజ్ చేస్తున్నారని అడిగారు. హిందీ మన మాతృభాష, జాతీయ భాష  అని, గతంలో, వర్తమానంలో, భవిష్యత్తులో అదే విధంగా కొనసాగుతుందని చెప్పారు. 


దీనికి సుదీప్ బదులిస్తూ ఇచ్చిన ట్వీట్‌లో, తాను మన దేశంలోని అన్ని బాషలను గౌరవిస్తానని తెలిపారు. ఈ అంశాన్ని ఇక ముగించాలన్నారు. తాను ఈ మాటలను పూర్తిగా వేరొక సందర్భంలో చెప్పానని, తాను స్వయంగా కలిసినపుడు వివరంగా అన్ని విషయాలు చెబుతానని పేర్కొన్నారు. 


సుదీప్‌ను అందరూ సమర్థించాలి : సీఎం

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ గురువారం విలేకర్లతో మాట్లాడుతూ, భాషల వల్లే మన రాష్ట్రాలు ఏర్పడ్డాయని, ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం ఉందని తెలిపారు. సుదీప్ చేసిన వ్యాఖ్యలు సరైనవేనన్నారు. భాషల ఆధారంగానే రాష్ట్రాలు ఏర్పడ్డాయని, అందువల్ల ప్రాంతీయ భాషలు చాలా ముఖ్యమైనవని చెప్పారు. ప్రతి ఒక్కరూ సుదీప్ చెప్పిన మాటలను అర్థం చేసుకోవాలని, గౌరవించాలని చెప్పారు. 


బీజేపీకి మౌత్‌పీస్ అజయ్ దేవ్‌గన్ : కుమార స్వామి

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జెడీఎస్ నేత హెచ్‌డీ కుమార స్వామి ఇచ్చిన ట్వీట్లలో సుదీప్‌ను సమర్థించారు. హిందీ జాతీయ భాష కాదన్నారు. అజయ్ దేవ్‌గన్ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారన్నారు. బీజేపీ చెప్తున్న హిందీ జాతీయ వాదానికి మౌత్‌పీస్‌గా అజయ్ దేవ్‌గన్ వ్యవహరిస్తున్నారన్నారు. బీజేపీపై విరుచుకుపడుతూ, ఓ విత్తనాన్ని నాటారని, అది అంటువ్యాధిలా మారిందని, అది దేశాన్ని విభజిస్తోందని ఆరోపించారు. అది దేశ ఐకమత్యానికి ముప్పు అని హెచ్చరించారు. 


‘‘నటుడు కిచ్చా సుదీప్ హిందీ జాతీయ భాష కాదని చెప్పడం సరైనదే. ఆయన స్టేట్‌మెంట్‌లో తప్పుబట్టడానికేమీ లేదు. అజయ్ దేవ్‌గన్ స్వభావరీత్యా హైపర్ మాత్రమే కాదు, ఆయన తన మూర్ఖపు ప్రవర్తనను ప్రదర్శిస్తున్నారు’’ అని కుమార స్వామి ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎక్కువ మంది మాట్లాడుతున్నంత మాత్రానికి హిందీ జాతీయ భాష అయిపోదని మరొక ట్వీట్‌లో చెప్పారు. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు కేవలం తొమ్మిది కన్నా తక్కువ రాష్ట్రాల్లో మాత్రమే హిందీ రెండో, మూడో భాషగా ఉందని, అంతకన్నా ఏమీ లేదని అన్నారు. వాస్తవ పరిస్థితి ఇది అయితే అజయ్ దేవ్‌గన్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో సత్యం ఎంత వరకు ఉందని ప్రశ్నించారు. మొదటి నుంచి కేంద్రంలోని హిందీ ఆధారిత రాజకీయ పార్టీలు ప్రాంతీయ భాషలను నాశనం చేయడానికి కృషి చేస్తున్నాయన్నారు. ప్రాంతీయ భాషలను అణచివేయడాన్ని కాంగ్రెస్ ప్రారంభించిందని, దానిని బీజేపీ కొనసాగిస్తోందని ఆరోపించారు. ఆధిపత్యం కోసం పాకులాట దేశాన్ని విభజిస్తోందన్నారు. 


ప్రతి భాషకు చరిత్ర ఉంది : సిద్ధరామయ్య 

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ఇచ్చిన ట్వీట్‌లో, హిందీ ఎప్పటికీ జాతీయ భాష కాదన్నారు. మన దేశ భాషా వైవిద్ధ్యాన్ని గౌరవించడం ప్రతి భారతీయుని కర్తవ్యమని చెప్పారు. ప్రతి భాషకు తనదైన సొంత సుసంపన్న చరిత్ర ఉందని, అది ఆ భాషకు చెందినవారికి గర్వకారణమని తెలిపారు. తాను కన్నడిగుడినైనందుకు గర్విస్తున్నానని తెలిపారు. 


ఆధిపత్యం తగదు : డీకే శివకుమార్ 

కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ఇచ్చిన ట్వీట్‌లో, దేశంలో దాదాపు 19,500 భాషలు ఉన్నాయని, వీటిలో ఏదీ మరొకదానిపై ఆధిపత్యం చలాయించకూడదని అన్నారు. భారత దేశం పట్ల మన ప్రేమ, ప్రతి భాష పట్ల కనిపిస్తుందన్నారు. తాను కన్నడిగుడినైనందుకు, కాంగ్రెస్ వ్యక్తినైనందుకు గర్విస్తున్నానని చెప్పారు. ఒక భాష మరో భాషపై ఆధిపత్యం చలాయించకుండా చూడటానికి కాంగ్రెస్ భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసిందని గుర్తు చేస్తున్నానన్నారు. 


Updated Date - 2022-04-28T20:20:41+05:30 IST