Abn logo
Sep 25 2021 @ 18:47PM

పోలీసు కాల్పుల ఘటన వెనుక పీఎఫ్ఐ హస్తం : హిమంత బిశ్వ శర్మ

గువాహటి : అస్సాంలోని డరంగ్ జిల్లాలో గత వారం జరిగిన హింసాకాండ వెనుక అతివాద ఇస్లామిక్ గ్రూప్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) ఉందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. ఈ సంఘటనలో మతపరమైన కోణం ఉందనడాన్ని తోసిపుచ్చారు. పోలీసు కాల్పులపై ప్రసారమవుతున్న వీడియోలు పూర్తి విషయాలను వెల్లడించడం లేదన్నారు. 


డరంగ్ జిల్లాలో గత గురువారం ఆక్రమణల తొలగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్థానికులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసుల కాల్పుల్లో పన్నెండేళ్ళ బాలుడు సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిది మంది పోలీసులు, ఆరుగురు సాధారణ పౌరులు గాయపడ్డారు. 


హిమంత బిశ్వ శర్మ శనివారం మీడియాతో మాట్లాడుతూ, ఆక్రమణల నుంచి ఖాళీ చేయించకుండా ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని కొందరు వ్యక్తులు కొద్ది నెలల క్రితం స్థానిక పేదల నుంచి రూ.28 లక్షలు వసూలు చేశారన్నారు. ఈ విధంగా డబ్బు వసూలు చేసినవారి పేర్లు తన వద్ద ఉన్నాయన్నారు. ఆక్రమణల తొలగింపును నిరోధించలేకపోవడంతో వారు స్థానికులను రెచ్చగొట్టారని చెప్పారు. 


ఈ సంఘటన గురువారం జరిగిందని, అంతకుముందు రోజు పీఎఫ్ఐ ఈ ప్రదేశానికి వచ్చిందని చెప్పారు. నిర్వాసితులకు ఆహారం ఇస్తామనే నెపంతో పీఎఫ్ఐ వ్యక్తులు వచ్చారన్నారు. కొందరు వ్యక్తుల ప్రమేయంపై సాక్ష్యాధారాలు లభిస్తున్నాయని చెప్పారు. వీరిలో ఓ కళాశాల లెక్చరర్ కూడా ఉన్నట్లు తెలిపారు. పీఎఫ్ఐపై పూర్తి స్థాయి నిషేధం విధించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. 


ఇదిలావుండగా ఈ సంఘటనపై జ్యుడిషియల్ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. గువాహటి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఈ దర్యాప్తు జరుగుతుందని తెలిపింది. అయితే రిటైర్డ్ జడ్జి పేరును ప్రకటించవలసి ఉంది.


ఇవి కూడా చదవండిImage Caption