Abn logo
Oct 23 2021 @ 21:35PM

గ్యాంగ్‌వార్‌కు బలైన ఎన్‌ఆర్ఐ మహిళ.. రెస్టారెంట్‌లో భోజనం చేస్తుండగా..

ఇంటర్నెట్ డెస్క్: పుట్టిన రోజు జరుపుకొనేందుకు మెక్సికో వెళ్లిన ఓ ఎన్‌ఆర్ఐ మహిళ(29) అనూహ్యంగా మరణించారు. మాదకద్రవ్యాలు అక్రమరవాణా చేసే ఓ గ్యాంగ్ తన ప్రత్యర్థి వర్గంపై కాల్పులకు తెగబడగా.. ప్రమాదవశాత్తు ఆ యువతికి తుటా తగిలి ఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలారు. మృతురాలు అంజలీ రేయాత్ హిమాచల్ ప్రదేశ్ వాస్తవ్యురాలు. కొంత కాలంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో నివసిస్తున్నారు. వృత్తిరీత్యా ఇంజినీర్ అయిన అంజలీ లింక్డిన్‌లో సైట్ రిలయబిలిటీ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. కాగా.. అంజలి వీలు కుదిరినప్పుడల్లా కొత్త ప్రదేశాలను సందర్శించేందుకు ఇష్టపడేవారు. తన అనుభవాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకునేవారు. 

అంజలికి కొంత కాలం క్రితమే వివాహం అయింది. ఆక్టోబర్ 22న ఆమె పుట్టిన రోజు కాగా.. అంతకు కొద్ది రోజుల మునుపే అంజలి మెక్సికోకు చేరుకున్నారు. కర్రీబియన్ సముద్ర తీరాన ఉన్న ఓ రెస్టారెంట్‌లో బుధవారం రాత్రి 10.30కు భోజనం చేస్తుండగా.. కొందరు ముష్కరులు అసాల్ట్ రైఫిల్స్‌తో దూసుకొచ్చి..అక్కడే ఉన్న ప్రత్యర్థి వర్గంపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ అంజలి కూడా తూటాల బారిన పడి ప్రాణాలు విడిచారు. ఆమె పక్కనే ఉన్న జర్మనీ దేశస్థురాలు కూడా బుల్లెట్లకు నేలకొరిగారు. మరో ఇద్దరు ఆస్పత్రి పాలయ్యారు. కాగా..  అంజలి మృతదేహాన్ని త్వరగా భారత్‌కు చేరేలా చర్యలు తీసుకోవాలంటూ ఆమె సోదరుడు ఆశిష్ రేయాత్ అక్కడి మేయర్‌కు విజ్ఞప్తి చేశారు. తనకు త్వరగా వీసా వచ్చేలా చేస్తే మెక్సికోకు వెళ్లి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటానని భారత్ అధికారులను కూడా కోరారు. 

ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...