‘నా భర్త, కుటుంబ సభ్యులతో ప్రాణహాని.. వారి వెనుక వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు’

ABN , First Publish Date - 2022-02-15T14:30:42+05:30 IST

పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాను.. పెళ్లైన తర్వాత రోజు నుంచే అత్తమామలు...

‘నా భర్త, కుటుంబ సభ్యులతో ప్రాణహాని.. వారి వెనుక వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు’

  • రక్షణ కల్పించాలని హిమబిందు మాధురి వినతి


హైదరాబాద్ సిటీ/పంజాగుట్ట : పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాను.. పెళ్లైన తర్వాత రోజు నుంచే అత్తమామలు, ఇతర కుటుంబ సభ్యులు పలు రకాలుగా వేధించారు. దీనిపై పోలీ‌స్‌స్టేషన్లలో ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని, న్యాయం చేయాలని వైఎ్‌సఆర్‌ కడప జిల్లా, కొత్తపల్లి మండలం, పెనమలూరు గ్రామానికి చెందిన బాధితురాలు నంది మండలం హిమబిందు మాధురి విజ్ఞప్తి చేసింది. వారి వెనుక వైఎ్‌సఆర్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపింది. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె తన గోడు వెళ్లబోసుకుంది. 2011 అక్టోబర్‌ 19న చాపాడు మండలం, నరహరిపురం గ్రామానికి చెందిన నందిమండలం పుల్లారెడ్డితో వివాహం జరిగిందన్నారు. పెళ్లి సమయంలో రూ. 4 లక్షల విలువైన బంగారు నగలు, 4 లక్షల నగదు కట్నం కింద ఇచ్చామని తెలిపారు.


 వివాహం అయిన మరుసటి రోజు నుంచే వేధింపులు మొదలయ్యాయని, వేధింపులు పెరగడంతో తాను పుట్టింటికి వచ్చేశానని తెలిపింది. కుటుంబ సభ్యుల ఒత్తిడితో రెండు నెలలు అత్తగారింట్లో ఉండగా, కొద్ది రోజులు పుట్టింట్లో ఉన్నానని వివరించింది. 2015 జనవరిలో కొడుకు పుట్టాడని, అదనపు కట్నం తేవాలని అత్తింటివారు వేధించడంతో కడప మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు. దీంతో తన భర్త పాస్‌పోర్ట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని న్యాయస్థానంలో డిపాజిట్‌ చేశారన్నారు. అమెరికాలో అవకాశం రావడంతో అక్కడికి వెళ్లడానికి పుల్లారెడ్డికి పాస్‌పోర్ట్‌ అవసరం కావడంతో తనను బాగా చూసుకుంటానని, తనతో అమెరికా తీసుకెళ్తానని న్యాయస్థానంలో చెప్పి తమను నమ్మించాడన్నారు.


భర్తతో కలిసి 2017 జూలైలో అమెరికా వెళ్లానన్నారు. కొద్ది రోజులు బాగానే చూసుకున్నా అనంతరం వేధింపులు అధికమయ్యాయని తెలిపారు. అక్కడే మరో కొడుకు పుట్టాడని తెలిపింది. వేధింపులు తీవ్రం కావడంతో సొంతూరుకు తిరిగి వచ్చానన్నారు. అక్కడ, రాజంపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. గత ఏడాది భర్త, అతడి కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో తనపై హత్యాయత్నం జరిగిందన్నారు. ఈ విషయమై స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. నాకు ఏం జరిగినా భర్త పుల్లారెడ్డి, అత్త మామలు అమరావతమ్మ, కృష్ణారెడ్డి, బావ నాగేశ్వర్‌రెడ్డి, తోటి కోడలు నారాయణమ్మ, సుబ్బిరామిరెడ్డి, అతడి కుమారుడు ప్రభాకర్‌ రెడ్డిదే బాధ్యత అని ఆమె అన్నారు. హిమబిందుకు పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య సంఘీభావం తెలిపారు.

Updated Date - 2022-02-15T14:30:42+05:30 IST