భద్రిరాజు బాటలో కొండ గుర్తులు

ABN , First Publish Date - 2022-08-08T05:58:17+05:30 IST

‘ఉంటాడు’ ‘ఉండడు’, ‘పంటాడు’ ‘పండడు’ అనే క్రియా పద ప్రయోగాలలో తొలి రూపం, వ్యతిరేక రూపం ఒక క్రమ పద్ధతిలో ఉన్నట్టు గమనిస్తాం. అలానే ‘కంటాడు’, ‘కనడు’, ‘తింటాడు’, ‘తినడు’ అంటామే గాని ‘కంటాడు’, ‘కండడు’, ‘తింటాడు’ ‘తిండడు’...

భద్రిరాజు బాటలో కొండ గుర్తులు

‘ఉంటాడు’ ‘ఉండడు’, ‘పంటాడు’ ‘పండడు’ అనే క్రియా పద ప్రయోగాలలో తొలి రూపం, వ్యతిరేక రూపం ఒక క్రమ పద్ధతిలో ఉన్నట్టు గమనిస్తాం. అలానే ‘కంటాడు’, ‘కనడు’, ‘తింటాడు’, ‘తినడు’ అంటామే గాని ‘కంటాడు’, ‘కండడు’, ‘తింటాడు’ ‘తిండడు’ అని వ్యవహరించం ఎందుకని? ఈ ప్రశ్న 1970 దశకంలో ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారు వేసినప్పుడు చాలామంది నోరు   వెళ్ళ బెట్టేవారు (వారిలో ఈ వ్యాసకర్త కూడా ఉన్నాడు). నిజమే, అలా అని మనం ఎందుకనం? మనం మాట్లాడే భాషకు వ్యాకరణ సూత్రాలు ఏమీ లేవా? అంటే మనం మాట్లాడే వ్యవహారిక భాష వ్యాకరణాతీతమా లేక వ్యాకరణ రహితమా?


1970లో చాలామంది తెలుగు వారికి తెలిసినదేమిటంటే తెలుగు భాషా వ్యాకరణమంతా బాలవ్యాకరణ పరిధిలోనే ఉంటుందని. మహాఅయితే బహుజనపల్లి సీతారామాంజనేయులు రాసిన ప్రౌఢ వ్యాకరణ పరిధిలో ఉండొచ్చు. కాని, కృష్ణమూర్తి గారు లేవదీసిన వ్యాకరణాంశాలు వ్యవహార భాషలో ఎలా అంతర్లీనంగా ఉంటాయో చాలామందికి తెలియదు. ఈ ప్రశ్నలకు కృష్ణమూర్తి గారి సునిశిత పరిశోధనలే అద్భుతమైన జవాబులు ఇచ్చాయి. భాషా వ్యవహర్తల్లో అంతర్లీనంగా ఉన్న వ్యవహార యోగ్యతా నియమాల సంపుటినే భాషా శాస్త్రవేత్తలు వ్యాకరణంగా ఆవిష్కరిస్తారు. అంటే భాషలో ఉన్న నియమాలు లేదా సూత్రాలు అజ్ఞాతంగానే వ్యవహర్తల మనస్సుల్లో ఉంటాయి. ఇలా భాషా వ్యవహర్తల భాషలోపలి సూత్రాలను అంతర్లీన భాషా వ్యాకరణం గాను, దానిని వివరించేందుకు చేసే సమగ్ర ప్రయత్నాన్ని బహిర్గత వ్యాకరణంగాను భద్రిరాజు కృష్ణమూర్తి వివరించేవారు. గతంలోని తెలుగు వ్యాకరణాలన్నీ ‘పదాల రూప నిష్పత్తిలోనే’ ఆగిపోతాయి అని తేల్చారు భద్రిరాజు కృష్ణమూర్తి తన పుస్తకం ‘భాష-సమాజం-సంస్కృతి’ గ్రంథంలో. ఇలాంటి సూక్ష్మ విశ్లేషణలతో తెలుగు భాషకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన మహా మేధావి, భాషాశాస్త్రజ్ఞుడు, సాహితీవేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి. 


ఆంధ్రా యూనివర్సిటీలో బి.ఎ.ఆనర్సు చదువుతున్నప్పుడు అక్కడ లైబ్రేరియన్‌గా ఉన్నా ప్రముఖ కవి అబ్బూరి రామ కృష్ణారావు సాన్నిహిత్యం ఆయన దృష్టిని సాహిత్యం వైపు నుంచి భాష వైపుకు మరల్చింది. ‘‘పైకి ఇసుక విసిరితే నేల మీద పడనంతమంది కవులున్నారు తెలుగునాట. కాని ఒక్క భాషావేత్త ఈ నేలపైన లేడు కృష్ణమూర్తి, ఆలోచించు. నువ్వు ఏ తీగనెగబ్రాకితే ఒక్కడిగా, అందరికీ అతీతుడిగా నిలుస్తావో’’ అన్న అబ్బూరి రామకృష్ణారావు మాటలను ఆయన అంతర్జా తీయ ఖ్యాతిగాంచిన భాషా శాస్త్రవేత్తగా రూపాంతరం పొందాక కూడా చివరివరకూ స్మరిస్తూనే ఉన్నారు. 


కృష్ణమూర్తి గారు భాషను బి.ఏ.ఆనర్సులో ప్రత్యేక అంశంగా మలుచుకొనడానికి మరో ముఖ్య కారణం నాడు ఆ యూనివర్శిటీలో ఎంతో పేరు ప్రఖ్యాతులున్న ఆచార్య గంటి జోగి సోమయాజి. వారి దర్శకత్వంలో భద్రిరాజువారు తొలుత తెలుగు భాషాచరిత్ర, ద్రావిడ మూలాలపై దృష్టి సారించారు. అప్పటికే సోమయాజి, కోరాడ రామకృష్ణయ్య వంటివారి కృషివల్ల ఆంధ్ర - ద్రావిడ అధ్యయనాల్లో కొంత మార్గం సుగమమైంది. ‘‘దానిని గట్టి పరచడమే కాదు, అంతర్జాతీయ ప్రమాణాలతో దానిపైన ఒక భవ్యమైన కట్టడం కట్టే భాగ్యం భద్రిరాజు వారికి దక్కింది’’ అంటారు ఆచార్య గంగిశెట్టి లక్ష్మి నారాయణ. బి.ఎ ఆనర్సు 1948లో పూర్తి కాగానే, గుంటూరు హిందూ కాలేజీలో ఒక సంవత్సరం పాటు స్పెషల్‌ ట్యూటర్‌గా పని చేసి, 1949లోనే ఆంధ్రా విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా చేరారు. నాడు రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని తాత్కాలికంగా గుంటూరు మార్చారు. ఆ సమయంలోనే సోమయాజి గారి దర్శకత్వంలో ‘తెలుగు క్రియ ధాతు స్వరూపం’ మీద పరిశోధనలు మొదలుపెట్టారు కృష్ణమూర్తి గారు. ఈ ధాతువులూ, శబ్దాలు, ఇతర భాషా శబ్దాలతో పోల్చి చూసుకోవడం అనేది ప్రతి రోజు ఏ పనిలో ఉన్నా చెయ్యడం ఒక అలవాటుగా మారిపోయింది ఆయనకు.


భాషా శాస్త్రాధ్యయనం కోసం అమెరికాలోని పెన్సిల్వేనియా యూని వర్శిటీకి వెళ్లారు. తెలుగు భాషాధ్యయన కోసం అమెరికా వెళ్ళింది కృష్ణ మూర్తి గారే. ఆ రోజుల్లో ఇది ఒక వింతగా చెప్పుకున్నారు. 1955లో ఎం.ఏ చేశారు భాషాశాస్త్రంలో, ఆ తర్వాత అమెనోగారి వద్ద యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా (బెర్క్‌లీ క్యాంపస్‌)లో తెలుగు ధాతువుల తులనాత్మక పరిశోధన అనే అంశంపై పరిశోధన చేసి సంవత్సరంలోనే పిహెచ్‌డి పట్టా పొందారు. 1961లో కాలిఫోర్నియా యూనివర్శిటీ దీనిని ‘తెలుగు వెర్బల్‌ బేసిస్‌: ఎ కంపారటివ్‌ అండ్‌ డిస్ర్కిప్టివ్‌ స్టడీ’ పేరుతో అచ్చు వేసింది. తొలుత అమెరికా వెళ్ళడానికి ఫుల్‌ బ్రైట్‌ స్కాలర్‌షిప్‌ లభించినా, అది అమెరికాలో ఒక సంవత్సరం ఎం.ఏ భాషా శాస్త్రం చేయను మాత్రమే సరిపోయింది. అయితే పిహెచ్‌డికి ముర్రె బి అమెనో సిఫార్సు మేరకు రాక్‌ఫెల్లర్‌ ఫౌండేషన్‌ వారి స్కాలర్‌షిప్‌ అందుబాటులోకి రావడం చాలా గొప్ప మేలు చేసింది కృష్ణమూర్తిగారి కృషికి. గంటి సోమయాజి గారి దర్శకత్వంలో 1949లో ప్రారంభించిన తెలుగు క్రియాధాతువుల పరిశీలన 1956 నాటికి ఒక స్థాయికి రావడంతో కేవలం సంవత్సర కాలంలోనే అమెనో గారి దగ్గర పిహెచ్‌డి పూర్తి చేయడానికి తోడ్పడింది. 


కృష్ణమూర్తిగారి ‘తెలుగు వెర్బల్‌ బేసిస్‌’ గ్రంథం 1961లో అచ్చయి, బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టాక అప్పటికి వందేళ్ల నుండి చెలమణిలో ఉన్న బిషప్‌ కాల్డ్‌వెల్‌ గ్రంథం మొదటిసారిగా సంపూర్తిగా పరాస్తమైంది. ఆ తరువాత వారి గురువులు, 1945 తరువాత ప్రధాన గురుస్థానీయులు అయిన బరో, ఎమినో గార్లు సంయుక్తంగా రూపొందిం చిన ‘ద్రవిడియన్‌ ఎటిమలాజికల్‌ డిక్షనరీ’కి (డి.ఈ.డి : ద్రవిడ భాషల అధ్యయనానికి సర్వోత్కృష్టమైన ఆకర గ్రంథం) కృష్ణమూర్తిగారి సిద్ధాంత గ్రంథం ముఖ్య ఆధార గ్రంథాలలో ఒకటైందంటే ఆయన కృషి ఎంత మౌలికమైందో ఇట్టే ఊహించవచ్చు. ఆ పరిశోధన ప్రచురణతో ద్రవిడ భాషాధ్యయనానికి సంబంధించి మూర్తిత్రయంలో భాగమయ్యారు (బరో, ఎమినో, కృష్ణమూర్తి) అని అంటారు ఆచార్య గంగిశెట్టి లక్ష్మినారాయణగారు. చేకూరి రామారావు గారి మాటల్లో తెలుగు భాషాశాస్త్ర అధ్యయనంలో మూడే అధ్యయాలు ఉన్నాయి : 1) కృష్ణమూర్తి పూర్వయుగం, 2) కృష్ణమూర్తి యుగం, 3) కృష్ణమూర్తి అనంతరయుగం.


అంతేగాదు, కృష్ణమూర్తి గారి తెలుగు, క్రియాధాతు పరిశోధన వైశిష్ట్యం అంతా అమెరికాలో వారు భాషా శాస్త్రం చదివాకనేనన్న అపోహ కూడా కొందరి రచనల్లో కనిపించేది. నిజానికి కృష్ణమూర్తి గారు అమెరికాకు ఉన్నత విద్యలకు వెళ్ళక ముందు భాషా శాస్త్రపరంగా అద్భుతమైన పరిశోధనలు కావించారు. అవి అప్పట్లో ఆంధ్ర పత్రిక యాజమాన్యంలో నడిచే ‘భారతి’ పత్రికలో అచ్చయినాయి. కొన్ని ‘త్రిలింగ’ అనే పత్రికలో అచ్చయినాయి. అందులో ఈ నాటికీ రచయితలకు, తెలుగు వ్యవహర్తలకు (ముఖ్యంగా గ్రామ్యాన్ని వ్యవహారికంతో మిళితం చేసే రాజకీయ నాయకులకు) వర్తించేది ఒక ముఖ్యమైన పరిశోధన- షష్ఠివిభక్తి ‘యొక్క’ విచారణ. ఇది 1951లో ‘త్రిలింగ’లో అచ్చయింది.


తెలుగు శాసనాలల్లో పదిహేనవ శతాబ్ది దాకా ‘యొక్క’ ప్రయోగం కనిపించదు. పదిహేను తర్వాత చాలా వచన రచనలలో దీని ప్రయోగం కనిపిస్తుంది. (పండితారాధ్య చరిత్ర, 1-89 పేజీల్లో): ‘అవిరల సూక్త భాష్యార్థ మెట్లనిన హేరుద్ర యానగ తానో రుద్రయానుట వారక మరియున్‌, దవ ప్రణితా వనంగన్‌ బూర్వార్ద మనంగ నీ యొక్క సంగతి లింగ పూజ వేళయందు’. ఈ పద్యంలో సంస్కృత శబ్దానికి అర్థ వివరణలో ‘యొక్క’ ఏకైక ప్రయోగం కనిపిస్తుంది. (పండితా. ఉపో.232). దీనిని బట్టి షష్టివిభక్తికి తెలుగులో వివరణ ఇచ్చేప్పుడు ‘యొక్క’ ప్రాచీన కాలం నుంచి పండిత వ్యవహారంలో ఉన్నట్లు తెలుస్తుంది. విశ్వనాధ నాయకుని (1520) ‘రాయ వాచకం’లోనూ, ‘బాల సరస్వతీయం’లోనూ ఈ విభక్తి ప్రయోగం తరచుగా కనిపిస్తుంది. అర్వాచీన రచనలో ఇంకా దీని వాడుక పెరిగిందనే చెప్పుకోవాలి. ఈనాటి రాజకీయ నాయకులు, ఇతర వక్తలు కూడా, ‘ఈ యొక్క’, ‘ఆ యొక్క’ అని వ్యవహరిస్తుంటారు. అయితే కృష్ణమూర్తి గారి పరిశీలనలో వెల్లడైన మూడు సూత్రాలలో మూడవది చాలా ప్రధానమైంది. మొదటి రెండు సూత్రీకరణలు ‘యొక్క’ ప్రయోగం ఎప్పట్నించి ఆరంభం అయింది, ఎలా వాడుకలోకి వచ్చిందన్నది తెలిపితే మూడవది కావ్య భాషలో ఎవ్వరూ, ఎప్పుడూ, ఎక్కడా దీనిని వాడక పోవడం. ‘‘అంటే ‘యొక్క’ వాడుక తెలుగు భాష మాట్లాడటానికి గాని, రాయడానికి గాని అనవసరమనీ, మన నుడి కారానికి సరిపడదనీ, కేవలం సంస్కృత పండితులు తెలుగు పాఠం చెప్పేటప్పుడు దీన్ని అవసరమని గ్రహించవచ్చు’’ అంటారు భద్రిరాజు కృష్ణమూర్తి. అంతటితో దీనిని వదలేయలేదు. ఏ లక్ష్యం లేకుండా లక్షణం రాసినది ఈ ‘యొక్క’ ఒక్కటే కావడానికి కారణాలను చీల్చిచెండాడారు. 


అలాగే 1953-54లలో ‘సంస్కృతి’ పత్రిక సంపుటాలలో ప్రచురించిన ‘‘తెలుగులో ‘లు’ కార పరిణామం’’ అనే వ్యాసం. తులనాత్మకంగా ప్రాచీన ద్రావీడానికి ప్రత్యేకమైన ‘లు’ కారం తెలుగులో, ఇతర భాషలో పొందిన పరిణామాన్ని చాలా విపులంగా, శాస్త్రీయంగా నిరూపించారు కృష్ణమూర్తి. ఈ పరిశోధన కొత్తతరం ద్రావిడ భాషా విజ్ఞానుల్లో, ఆయనకు పదిలమైన స్థానాన్ని సంపాదించి పెట్టింది. ‘అరకు లోయకు ఆంధ్రతో సంబంధం’ పరిశోధన కృష్ణమూర్తి గారి క్షేత్రస్థాయి పరిశోధనలకు పతాక స్థాయిగా చెప్పవచ్చు. అరకు లోయలో బతక, కోట్య, కొండదొర, సామంతు వంటి ఎన్నో ఆదివాసీ తెగలున్నాయి. వాళ్ళు మాట్లాడే ‘కొండ’ లేక ‘కూబీ’ భాషను పరిశోధించి వారి భాషకు 23 అక్షరాలతో వర్ణమాలను తయారు చేశారు కృష్ణమూర్తి. ఈ భాష ప్రధాన లక్షణాలను ప్రదర్శించి తెలుగుతోనూ, మిగిలిన ముఖ్య ద్రావిడ భాషలతోనూ పోల్చి చూపారు. నన్నయ్యకు పూర్వపు తెలుగు శాసనాల్లో కనిపించే ‘వాన్ఱు’, ‘మూన్ఱు’ వంటి శబ్దాలు 9వ శతాబ్దం నాటికే ‘వాణ్డు, మూణ్డు’గా మారి, నన్నయ్య కాలానికి వాడు, మూడుగా రూపొం దాయి అని నిరూపించారు. కొండ భాషలో ఇప్పటికీ మన ప్రాచీన రూపాలకు దగ్గరైన ‘న్ఱ’ సహిత రూపాలు ఉచ్చారణలో ఉన్నాయి. సమగ్ర ద్రావిడ భాషా చరిత్ర రాయడానికి అనాగరిక భాషా సామాగ్రి ఎంతో అవసరమన్నది ఆయన పరిశోధనల ద్వారా నిరూపించారు. 


కృష్ణమూర్తి గారి పరిశోధనల్లోని కొన్ని విలక్షణ ఉదాహ రణలు మనల్ని నవ్విస్తాయి కూడ. మధురమైన వాక్కు, ఛమక్కులు, గంభీరమైన కంఠం, అద్భుత మూర్తిమత్వం కలబోస్తే మన కళ్ళ ముందు నిలిచే రూపమే ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి. ఆయన ప్రసంగిస్తుంటే అదేదో పాఠం చెబుతున్నట్లు, మనం వింటున్నట్లు ఉండదు. ఆహుతుల్లో మొదటి వరుస వారు, చివరి వరుస వారు అంతే హాయిగా, ఆసక్తిగా, ఆయన ఛలోక్తులను ఆస్వాదిస్తూ వినేవారు. ఒకానొక సందర్భంలో కృష్ణమూర్తి గారు మనుషులు ఎలా సౌలభ్యం కోసం మాటల అర్థాలను పరిమితం చేసుకొంటారు వివరించే కొన్ని ఉదాహరణలు చెప్పారు. ‘టీచర్‌’ అనే మాటకు ఆడ - మగ ఎవరైనా ఉపాధ్యాయులు కావచ్చు. కాని బడి పిల్లలు టీచర్‌ అనే శబ్ద ప్రయోగాన్ని ఆడ ‘టీచర్‌’కే పరిమితం చేస్తారు. అలాగే ‘పొట్లాట’ అన్న మాట చాలా వరకు మాటలతో జరిగే సంఘర్షణగా ఇప్పుడు వాడుకలో ఉంది. కాని ప్రాచీన కాలంలో అది ‘పోటు’, కత్తి, ఈటె వంటి ఆయుధాలతో పొడుచుకోవడం అన్న అర్థంలో ఉండేది. కృష్ణ మూర్తి గారి వాదనల్లో వైయాకరణుల మీద సున్నితమైన చణుకులు పేలేవి. ‘ఆవుపాలు’ను మనం ‘ఆవు నుంచి తీసిన పాలు’ అని చెబుతాము. మరి ‘ఆవు నెయ్యి?’ -ఒక్కసారిగా జనం విరగబడి నవ్విన సంఘటన అది. అలాగే పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌కు ‘తపాల శాఖ’ అని తెలుగులో బోర్డుండేది ఆ రోజుల్లో (బహుశ ఇప్పుడు కూడా). నిజానికి ‘టపాల్‌’ అనేది తెలుగు పదం కాదు. కాని ఆశ్చర్యమేమంటే పోస్టల్‌ శాఖలోని దేనికీ తెలుగు పదం ఒక్కటీ నేటికీ లేదు. ఎంతమంది ఈ విషయం ఎప్పుడైనా ఆలోచించి ఉంటారు? మనీ ఆర్డరు, పోస్టుకార్డు, స్టాంపులు, రిజిష్టర్డు లెటర్‌, పోస్ట్‌మాన్‌, పోస్ట్‌ మాష్టరు, రికార్డడ్‌ డెలివరీ వగైరా. తెలుగు భాషకు ‘ప్రాచీన భాషస్థాయి’ని కల్పించటంలోనూ, అంతేగాక తెలుగుకు, కన్నడకు, మలయాళానికి కూడా ప్రాచీన భాష స్థాయిని కలిపించటంలోనూ వారి పాత్ర మరువలేనిది. 


భద్రిరాజువారు జీవితకాలం శోధనలతో ఒక సముద్రాన్నే సృష్టించారు. వాటినే ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జి ముద్రణా సంస్థలు పుస్తకాలుగా తెచ్చాయి. ఎడింబరో విశ్వవిద్యాలయం ఫెలోషిప్‌, అమెరికన్‌ లింగ్విస్టిల్స్‌ సొసైటీ ఫెలోషిప్‌ మొదలైనవి ఆయన కీర్తి కిరీటంలోని కలికితురాయిలు. తన పద్నాలుగవ ఏట నుంచి, ఎనభయ్యవ పడి వరకు అటు తెలుగు భాషా సాహిత్యంపైన, ఇటు భాషాశాస్త్రం పైన అలుపెరగని కృషి సల్పిన ఈ మహామనిషి ఆగస్టు 11, 2012న తుదిశ్వాస విడిచారు. భాషా వ్యాకరణంలో ధ్వనిపైన ఎంతో కృషి సలిపి చివరకు విశ్వశబ్దంలో లీనమైపోయారు. ఆయన ‘చిననాటి పద్యాల’లో ‘మాతృ సందేశం’ ఖండ కావ్యంలో రాసినట్టు- ‘వితంతంబైన చరచరాత్మాక మహా విశ్వ ప్రపంచంబునన్‌.... మయ్యమృత శబ్దావాప్తి నూహించెదన్‌’.

(ఆగస్ట్‌ 11 భద్రిరాజు దశమ వర్ధంతి)

కొప్పరపు నారాయణమూర్తి

76719 09759


Updated Date - 2022-08-08T05:58:17+05:30 IST