ఉల్లాసంగా.. కళోత్సవం

ABN , First Publish Date - 2022-10-03T06:02:03+05:30 IST

కరీంనగర్‌లో మూడు రోజులుగా తార ఆర్ట్స్‌ అకాడమీ సహకారంతో అంబేద్కర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న కరీంనగర్‌ కళోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి.

ఉల్లాసంగా.. కళోత్సవం

 - ముగిసిన కళల పండుగ

- హాజరైన మంత్రులు కేటీఆర్‌, గంగుల

- ప్రత్యేక ఆకర్షణగా బుల్లితెర, వెండితెర కళాకారులు

- ఆకట్టుకున్న ప్రదర్శనలు

కరీంనగర్‌ కల్చరల్‌, అక్టోబరు 2: కరీంనగర్‌లో మూడు రోజులుగా తార ఆర్ట్స్‌ అకాడమీ సహకారంతో అంబేద్కర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న కరీంనగర్‌ కళోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం భారీ క్రాకర్‌షో  నిర్వహించారు. వందేమాతరం శ్రీనివాస్‌, ఒల్లాల వాణి, మధుప్రియ, స్వర్ణ, వడ్లకొండ అనిల్‌, అంతడ్పులు నాగరాజు, మిట్టపల్లి సురేందర్‌ పాడిన పాటలు ఎంతగానో అలరించాయి. గంగవ్వ, కొమురవ్వ కామెడీ షోలు, శివారెడ్డి మిమిక్రీ ఆకట్టుకున్నాయి. వర్షిణి, నాగదుర్గ బృందం నృత్యాలు, జవహర్‌బాల భవన్‌ చిన్నారులు బతుకమ్మ నృత్యంతో హోరెత్తించారు. వేడుకలను తిలకించిన మంత్రి కేటీఆర్‌ నిర్వాహకుడు, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రిగంగుల కమలాకర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. 

- గంగుల నన్ను ప్రత్యేక హెలీక్యాప్టర్‌లో తీసుకొచ్చారు..

- మంత్రి కేటీఆర్‌

అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ ఢిల్లీ నుంచి వచ్చిన తనను హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలీక్యాప్టర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌ తీసుకువచ్చారన్నారు. ఇక్కడికి రావడంతో పాత కళాకారుల, కొత్త కళాకారులను కూడా కలుసుకునే అవకాశం కలిగిందన్నారు. ఇట్లాంటి అజ్ఞాత సూర్యులైన కళాకారులు ఇంకా ఉన్నారని, ప్రతీ కళాకారుడిని పేరుపేరునా పిలిచి ఆప్యాయంగా మాట్లాడారు. కమలాకర్‌లాగే రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు పెద్దపీట వేస్తోందని, సాంస్కృతిక సారధి చైర్మన్‌ రసమయి బాలకిషన్‌ సారధ్యంలో 574 మంది కళాకారులకు ఉద్యోగాలు, పేస్కేలు ఇచ్చి గౌరవించామన్నారు. కార్యక్రమంలో బిగ్‌బాస్‌ ఫేం సోహైల్‌, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, మేయర్‌ సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి హరిశంకర్‌, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పొన్నం అనిల్‌ కుమార్‌గౌడ్‌, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్‌లాల్‌, గరిమ అగర్వాల్‌, సీపీ సత్యనారాయణ, తెలంగాణ ఈవెంట్స్‌ ఇండస్ట్రీ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు గోగుల ప్రసాద్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-03T06:02:03+05:30 IST