బెధరహో..

ABN , First Publish Date - 2022-05-17T06:27:47+05:30 IST

బెధరహో..

బెధరహో..

పెరిగిపోతున్న అన్ని రకాల ధరలు

ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌తో బెంబేలు

తాజాగా చికెన్‌, టమోటాల రేట్లు పైపైకి.. జూ చెత్తపన్ను, కరెంట్‌ చార్జీలు, బస్‌ టికెట్లు.. అన్నీ అదనపు భారమే

ఛిద్రమవుతున్న సామాన్యుడి జీవనం జూ పట్టించుకోని ప్రభుత్వాలు 


కరోనా గండం దాటుకుని కాలు, చేయి కూడదీసుకునేలోపే ధరల దరిద్రం ప్రజలను చుట్టేసింది. కూడు తిందామన్నా, గూడు కట్టుకుందామన్నా, బండి తీద్దామన్నా, బస్సు ఎక్కుదామన్నా, స్విచ్‌ వేయాలన్నా అన్నింటికీ భయమే. ఆఖరికి ఇంట్లో చెత్త బయటపడేద్దామన్నా టెన్షనే. నిత్యావసర సరుకులు మొదలు, గ్యాస్‌బండ నుంచి ఇంటి పన్ను, చెత్తపన్ను, కరెంట్‌ చార్జీలు, బస్సు చార్జీలు, పెట్రోల్‌, డీజిల్‌ ఇలా చెప్పుకొంటూ పోతే ఒకటేమిటి అన్ని ధరలు అమాంతం పెరిగిపోయి సగటు మనిషి సాధారణంగా బతికే ఆశలు మాయమవుతున్నాయి. గతంలో నలుగురితో ఉండే ఓ చిన్న కుటుంబం నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలతో హాయిగా జీవించేది. ప్రస్తుతం అదే కుటుంబం బతకాలంటే రూ.35 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. - పాయకాపురం


కేజీ చికెన్‌ రూ.330

చికెన్‌ ధరకు రెక్కలొచ్చాయి. కిలో రూ.330కు విక్రయిస్తున్నారు. నెల కిందట కిలో చికెన్‌ రూ.180 ఉండగా, ప్రస్తుతం ఒక్కసారిగా పెరిగిపోవడంతో మాంసప్రియులు చికెన్‌ తినాలంటేనే బెంబేలెత్తి ముక్క ముట్టడానికి ఆలోచిస్తున్నారు. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు వారానికోసారైనా చికెన్‌ భోజనం చేయలేని పరిస్థితి నెలకొంది. 

కిలో టమోటా రూ.100

మండుతున్న ఎండలు, పంటల దిగుబడి తగ్గిపోవటంతో ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూరగాయల ధరలు స్థానిక పేదలకు చుక్కలు చూపిస్తున్నాయి. వంటకాల్లో కీలకమైన టమోటా బహిరంగ మార్కెట్‌లో రూ.100కు విక్రయిస్తున్నారు. దీంతో టమోటా అంటేనే  భయపడిపోతున్నారు. వంకాయ, బెండకాయ, బీరకాయ వంటి కూరగాయలు కిలో రూ.40 నుంచి రూ.50 వరకు పలుకుతున్నాయి.

మరుగుతున్న నూనెలు

వంటనూనెల ధరలు మరిగిపోతున్నాయి. టీడీపీ హయాంలో వంటనూనె కిలో రూ.100 ఉండగా, ప్రస్తుతం రూ.200 నుంచి రూ.220 వరకు చెల్లించాల్సి వస్తోంది. ఇక గ్యాస్‌ సిలిండర్‌ గతంలో రూ.680 ఉండగా, ప్రస్తుతం రూ.1,080 చేరింది. పెట్రోల్‌ రూ.120కు చేరడంతో వాహనదారులు బండి తీయాలంటే భయపడుతున్నారు.

పట్టించుకోని పాలకులు

ఈ ధరలతో లోలోపల మగ్గిపోవడం తప్ప, ఈ భారీ పెరుగుదలకు ప్రభుత్వాలను నిలదీయలేని పరిస్థితి సగటు మనిషిది. ధరలు తగ్గించాలనే ఆలోచన, నియంత్రించాలనే నిబద్ధత పాలకులకు లేదు. కరోనా కాలంలో ఆహార ధాన్యాలు, ఉచిత సరుకులు అందజేస్తూ ప్రజల కోసమే వెచ్చిస్తున్నామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆ ప్రజలపైనే ధరల భారాన్ని మోపుతూ బతకలేని పరిస్థితికి తెచ్చిందని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు  ధరలను నియంత్రించాలని కోరుతున్నారు.


ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలి

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, విద్యుత్‌  చార్జీలు, నిత్యావసర సరుకుల ధరలతో పాటు ఆర్టీసీ చార్జీల పెంపు సామాన్యులకు పెనుభారంగా మారింది. ప్రజలపై ధరల భారం తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. - హిమబిందు, రామకృష్ణాపురం



సామాన్యుడు బతకడం కష్టం

అన్ని వస్తువుల ధరలు అమాంతంగా పెరగడంతో సామాన్యుడు బతకడమే కష్టం అయిపోయింది. చిరు వ్యాపారం చేసుకుని నా కుటుంబంతో జీవిస్తున్నాను. పెరిగిన ధరలు చూసి ఏం కొనాలో, ఏం తినాలో తెలియట్లేదు.

- సాయి, ప్రకాష్‌నగర్‌

Updated Date - 2022-05-17T06:27:47+05:30 IST