గ్యాస్‌..బండ

ABN , First Publish Date - 2022-05-08T06:34:31+05:30 IST

గ్యాస్‌..బండ

గ్యాస్‌..బండ

మరోసారి పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

రూ.50 పెంచుతూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం

విజయవాడలో రూ.1,022కు చేరిన సిలిండర్‌ ధర

రెండు జిల్లాల వినియోగదారులపై రూ.100 కోట్ల భారం

తగ్గిపోతున్న సబ్సిడీ.. ప్రస్తుతం రూ.15 మాత్రమే..

ప్రత్యామ్నాయంవైపు చూస్తున్న వినియోగదారులు

తగ్గుతున్న గ్యాస్‌ కనెక్షన్లు 

పెరుగుతున్న పైపులైన్‌ గ్యాస్‌ కనెక్షన్లు


పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో హడలిపోతున్న వినియోగదారులపై మరో పిడుగు పడింది. గ్యాస్‌బండ ధరను మరో రూ.50 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. రెండు నెలలు కూడా కాకుండానే, మళ్లీ ఈ పెంపు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీంతో రెండు జిల్లాల్లో కొత్త కనెక్షన్లు తీసుకునే వారి సంఖ్య తగ్గుతుండగా, పైపులైన్‌ ద్వారా గ్యాస్‌ వినియోగించే వారి సంఖ్య పెరుగుతోంది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : గృహ వినియోగదారులపై మరోసారి గ్యాస్‌’బండ’ పడింది. రెండు నెలల కిందటే గ్యాస్‌ ధరలు పెరిగాయి. అయినా సబ్సిడీ వస్తుంది కదా అనుకుంటే దాన్ని కూడా కుదించేశారు. మళ్లీ గ్యాస్‌ సిలిండర్‌పై మరో రూ.50 పెంచారు. దీంతో విజయవాడ నగరంలో గ్యాస్‌ బండ ధర రూ.1,022 అవుతోంది. పెరిగిన గ్యాస్‌ ధర ప్రకారం ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాల ఎల్పీజీ వినియోగదారులపై రూ.100 కోట్ల భారం పడనుంది. ప్రస్తుతం అందే సబ్సిడీ రూ.15. త్వరలో అది కూడా కనుమరుగయ్యే పరిస్థితి. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో సతమతమవుతున్న వినియోగదారులు గ్యాస్‌ ధరలను చూసి హడలెత్తిపోతున్నారు. 

గ్యాస్‌ కనెక్షన్లు తగ్గుముఖం

గ్యాస్‌ ధరల పెరుగుదలతో కనెక్షన్లు తీసుకునే వారి సంఖ్య కూడా బాగానే తగ్గింది. రెండు జిల్లాల్లో మొత్తం 80 ఏజెన్సీలు ఉన్నాయి. ఒక్కో ఏజెన్సీకి సగటున నెలకు 500 కనెక్షన్లు తగ్గగా (వేరే ప్రాంతాలకు బదిలీలు, వలస వెళ్లినవారు), 1,000 కనెక్షన్లు పెరుగుతున్నాయి (కొత్తవారు). గతంలో పెరుగుదల సంఖ్య 2వేల వరకూ ఉండేది. అలాగే, మూడొంతుల గ్యాస్‌ ఏజెన్సీలు పట్టణ ప్రాంతాల నుంచి రూరల్‌ ప్రాంతాలకు వెళ్లిపోతున్నాయి. అద్దెల భారం, నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవటానికే ఇలా చేస్తున్నారు. వినియోగదారులు పొదుపు పాటించడం సమస్యగా మారింది. సిలిండర్ల వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. 

పెరుగుతున్న పైపులైన్‌ గ్యాస్‌ వినియోగం

వినియోగ దారులు గ్యాస్‌ ధరల భారాన్ని తగ్గించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలవైపు దృష్టి సారిస్తున్నారు. ఇందుకోసం పైపులైన్‌ గ్యాస్‌వైపు మొగ్గు చూపుతున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ అనంతరం ఇంటింటికీ పైపుల ద్వారా సరఫరా చేసే గ్యాస్‌ వినియోగదారుల సంఖ్య ఎనిమిది శాతం పెరిగింది. గ్రామాల్లో మెఘా, పట్టణాల్లో భాగ్యనగర్‌ సంస్థలు ఇంటింటికీ పైపులైన్‌ ద్వారా గ్యాస్‌ను అందిస్తున్నాయి. ఇది ఎల్‌పీజీ కాదు. సహజ వాయువునే కంప్రెస్‌ చేసి అతి తక్కువ డెన్సిటీగా ఉండే గ్యాస్‌గా మార్చి సరఫరా చేస్తారు. దీనికి పేలుడు స్వభావం కూడా ఉండదు. దరఖాస్తు చేసుకుంటే చాలు.. ఎలాంటి డబ్బు చెల్లించకుండానే నేరుగా వంటగదికి పైపును అమరుస్తున్నారు. దీని ఇన్‌స్టలేషన్‌ చార్జీలు కూడా తక్కువే. వాయిదాల రూపంలో చెల్లించవచ్చు. పైపులైన్‌ గ్యాస్‌ బిల్లు రెండు నెలలకు కలిపి సగటున రూ.1,000 వస్తుంది. అంటే ఒక చిన్న ఫ్యామిలీకి వినియోగాన్ని బట్టి నెలకు రూ.500 మించి బిల్లు కాదు. ఇన్‌స్టలేషన్‌ చార్జీలు రూ.500 చొప్పున తీసుకుంటారు. సిలిండర్లను తీసి బిగించే శ్రమ తప్పుతుంది. అయితే, ఈ పైపులైన్‌ గ్యాస్‌ విస్తృతంగా అందుబాటులో లేదు. రెండు జిల్లాల్లో 20 శాతం మేర మాత్రమే ఏర్పాటయ్యాయి. స్థానిక సంస్థల నుంచి అనుమతులు తీసుకోవటం, నెట్‌వర్క్‌ పనులు చేపట్టడం, రోడ్ల వెంబడి లైన్లు వేయాల్సి రావటం ఇబ్బందిగా ఉండటమే ఇందుకు కారణం. పట్టణ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. 

Read more