35 మండలాల్లో పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2021-07-20T05:33:57+05:30 IST

జిల్లాలోని 35 మండలాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు తిరిగి పెరుగుతున్నాయి.

35 మండలాల్లో పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

తిరుపతి, జూలై 19 (ఆంధ్రజ్యోతి):జిల్లాలోని 35 మండలాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు తిరిగి పెరుగుతున్నాయి. ముఖ్యంగా 62 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఈ పెరుగుదలను జిల్లా యంత్రాంగం గుర్తించింది.ఈ నెల 11వ తేదీ నుంచీ 17వ తేదీ వరకూ పీలేరు, రేణిగుంట, ఏర్పేడు, పెనుమూరు, జీడీనెల్లూరు, కేవీపల్లె, తవణంపల్లె, కురబలకోట, తిరుపతి రూరల్‌, కేవీబీపురం, ఎర్రావారిపాళ్యం, చంద్రగిరి, చిత్తూరు, పాకాల, వరదయ్యపాళ్యం, బైరెడ్డిపల్లె, పలమనేరు, విజయపురం, వి.కోట, చిన్నగొట్టిగల్లు, మదనపల్లె, గుడుపల్లె, కలికిరి, నగరి, కలకడ, సోమల, పులిచెర్ల, గుడిపాల, వాల్మీకిపురం, చౌడేపల్లె, కుప్పం, శ్రీకాళహస్తి, గుర్రంకొండ, పలమనేరు, రామకుప్పం మండలాల్లో ఐదు శాతానికి మించి పాజిటివిటీ రేటు నమోదైంది. అలాగే మరో 22 మండలాల్లో సైతం రెండు శాతానికి మించి కేసులు నమోదవుతున్నాయి. ఆయా మండలాల్లో జాతరలు, వివాహ వేడుకలను అనుమతించడంతో జనం మాస్కులు లేకుండా పాల్గొనడం వల్లే కేసులు పెరుగుతున్నట్టు జిల్లా యంత్రాంగం గుర్తించింది. కర్ఫ్యూ సడలింపు ఫలితంగా జనం గుమిగూడడం ఎక్కువైందని, దాని వల్ల కూడా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు అధికార యంత్రాంగం భావిస్తోంది. ఈ నేపధ్యంలో సోమవారం కలెక్టర్‌ హరినారాయణ్‌ కొవిడ్‌ నియంత్రణ విధుల్లో వున్న విభాగాలను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు.


261మందికి కరోనా... ఐదుగురి మృతి


 జిల్లాలో ఆది, సోమవారాల మధ్య 24 గంటల్లో 261మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా అదే వ్యవధిలో కొవిడ్‌తో రాష్ట్రంలోనే అత్యధికంగా ఐదుగురు మరణించారు. కొత్తగా గుర్తించిన పాజిటివ్‌ కేసులు, సంభవించిన మరణాలతో జిల్లాలో ఇప్పటి వరకూ నమోదైన పాజిటివ్‌ కేసులు 227348కు చేరగా కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 1687కు పెరిగింది. కాగా సోమవారం ఉదయానికి జిల్లాలో 3073 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులున్నట్టు ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. కొత్తగా గుర్తించిన పాజిటివ్‌ కేసులు తిరుపతి నగరంలో 33, చిత్తూరు, తిరుపతి రూరల్‌ మండలాల్లో 26 చొప్పున, మదనపల్లెలో 15, పెనుమూరు, బంగారుపాళ్యం మండలాల్లో 11 చొప్పున, పూతలపట్టులో 10, పీలేరు, పులిచెర్ల మండలాల్లో 8 వంతున, శ్రీకాళహస్తి, పలమనేరు, చంద్రగిరి మండలాల్లో 7 చొప్పున, నగరి, జీడీనెల్లూరు, తొట్టంబేడు, యాదమరి మండలాల్లో 6 చొప్పున, పుత్తూరు, కేవీపల్లె మండలాల్లో 5 వంతున, శ్రీరంగరాజపురం, కలికిరి, రొంపిచెర్ల, పాలసముద్రం మండలాల్లో 4 వంతున, ఎర్రావారిపాళ్యం, బీఎన్‌ కండ్రిగ మండలాల్లో 3 వంతున, ఐరాల, వి.కోట, చిన్నగొట్టిగల్లు, గుడిపాల, బైరెడ్డిపల్లె, కలకడ, గంగవరం, వాల్మీకిపురం, రామచంద్రాపురం మండలాల్లో 2 చొప్పున, రేణిగుంట, తవణంపల్లె, సదుం, వెదురుకుప్పం, పాకాల, శాంతిపురం, కుప్పం, నిండ్ర, గుడుపల్లె, ములకలచెరువు, పుంగనూరు, పీటీఎం, గుర్రంకొండ, వరదయ్యపాళ్యం, సత్యవేడు, తంబళ్ళపల్లె, కురబలకోట, రామకుప్పం మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి.


జిల్లాకు చేరిన 28 వేల డోసుల వ్యాక్సిన్‌ : జేసీ


ప్రభుత్వం నుంచి సోమవారం జిల్లాకు 28వేల డోసుల వ్యాక్సిన్‌ వచ్చినట్లు జేసీ రాజశేఖర్‌ తెలిపారు. ఇందులో 20వేల కొవిషీల్డ్‌, 8వేల కొవాగ్జిన్‌ డోసులు ఉన్నాయన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లకు వ్యాక్సిన్‌ పంపనున్నట్లు తెలిపారు. మంగళవారం నుంచి టీకాలు వేస్తారన్నారు. 

Updated Date - 2021-07-20T05:33:57+05:30 IST