హిజాబ్‌పై హైకోర్టు తీర్పు: సుప్రీంకు ఐయూఎంఎల్

ABN , First Publish Date - 2022-03-15T20:36:34+05:30 IST

విద్యాసంస్థల్లో హిజాబ్‌ ధరించడంపై కర్ణాటక ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన..

హిజాబ్‌పై హైకోర్టు తీర్పు: సుప్రీంకు ఐయూఎంఎల్

బెంగళూరు: విద్యాసంస్థల్లో హిజాబ్‌ ధరించడంపై కర్ణాటక ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఈ తీర్పుపై పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. తాము కో-పిటిషనర్‌గా సుప్రీంకోర్టును ఆశ్రయించే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు కేరళ బేస్డ్ 'ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్' (ఐయూఎంఎల్) పార్టీ ప్రకటించింది. దీనిపై ఐయూఎంఎల్ ప్రధాన కార్యదర్శి పీకే కున్హలకుట్టి మీడియాతో మాట్లాడుతూ, కో-పిటిషనర్‌గా తమ వాదనలు వినిపించాలని ఐయూఎంఎల్ ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు.


''ఇది చాలా దురదృష్టకమైన తీర్పు. వ్యక్తిగత హక్కులను నీరుగారుస్తున్నారు. ఇది కేవలం స్కూలు యూనిఫాంకే పరిమితమైన అంశం కాదు. ఇది మన మతరపరమైన హక్కుల్లో చొరబడటమే. హిజాబ్ ధరించాలనుకున్న వారిని అనుమతించండి. ఐచ్ఛికం చేయండి'' అని కున్హలకుట్టి వ్యాఖ్యానించారు. కాగా, పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని సుప్రీంకోర్టులో అడ్వకేట్-ఆన్-రికార్డ్‌గా ఉన్న అనస్ తన్వీర్ చెప్పారు. హైకోర్టు ఉత్తర్వును సవాలు చేసిన పలువురు ముస్లిం విద్యార్థినులను ఆయన కలుసుకున్నారు. చదువులు కొనసాగిస్తూనే, హిజాబ్‌ను ధరించే హక్కుపై పోరాటం కొనసాగించాలని విద్యార్థినుల అభిప్రాయంగా ఉందని, ఇప్పటికీ కోర్టులు, రాజ్యాగంపై వారు నమ్మకంగా ఉన్నారని తన్వీర్ తెలిపారు.


హైకోర్టు తీర్పు ఏం చెప్పిందంటే..

ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లాం ప్రకారం ముఖ్యమైన మతపరమైన ఆచారంలో భాగం కాదనీ, పాఠశాల యూనిఫాం ధరించడం సహేతుకమైన పరిమితి మాత్రమేనని, దీనిని విద్యార్థులు అభ్యంతరం చెప్పలేరని కర్ణాటక హైకోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పులో పేర్కొంది. యూనిఫాం ధరించడంపై జీవో జారీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. పాఠశాల యూనిఫాం ధరించడం అనేది విద్యాసంస్థల ప్రొటోకాల్ అని, దీన్ని విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాల్సిందేనని చీఫ్ జస్టిస్ రితురాయ్ అవస్థి, న్యాయమూర్తులు కృష్ణ దీక్షిత్, జేఎం ఖాజీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పుచెప్పింది.

Updated Date - 2022-03-15T20:36:34+05:30 IST