మళ్లీ తెరపైకి హిజాబ్ (hijab) డిమాండ్.. విద్యార్థినులను అనుమతించని యూనివర్సిటీ..

ABN , First Publish Date - 2022-05-30T22:10:21+05:30 IST

హిజాబ్ వివాదం (hijab row) మరోసారి తెరపైకి వచ్చింది. హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్థినులు శనివారం యూనివర్సిటీ కా

మళ్లీ తెరపైకి హిజాబ్ (hijab) డిమాండ్.. విద్యార్థినులను అనుమతించని యూనివర్సిటీ..

బెంగళూరు : హిజాబ్ వివాదం (hijab row) మరోసారి తెరపైకి వచ్చింది. కర్ణాటకలో హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్థినులు శనివారం మంగళూరు యూనివర్సిటీ కాలేజీకి వచ్చారు. కానీ కాలేజీ అధికారులు అనుమతించలేదు. మళ్లీ సోమవారం(ఈ రోజు) కూడా హిజాబ్ ధరించే వచ్చారు. మళ్లీ అదే ఫలితం. అధికారులు కాలేజీలోకి రానివ్వలేదు. ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ ఉండడంతో దానిని పాటించాలని సూచించారు. అనుమతించాలంటూ విద్యార్థినులు పదేపదే డిమాండ్ చేస్తుండడంతో డిస్ట్రిక్ట్ డిప్యూటీ కమిషనర్‌ను ఆశ్రయించాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు. దీంతో సోమవారం అధికారిని కలిసిన ముగ్గురు విద్యార్థినులు తమ మెమోరాండమ్‌ను  సమర్పించారు. క్యాంపస్ ప్రాంగణంలో ఇస్లామిక్ హెడ్‌స్ర్కాఫ్(హిజాబ్) ధరించేందుకు అనుమతించాలని  దక్షిణ కన్నడ జిల్లా డిప్యూటీ కమిషనర్‌(డీసీ) రాజేంద్రను కోరారు. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించేందుకు మార్గంసుగుమం చేయాలంటూ 12 మంది విద్యార్థినులు ఈ మేరకు అభ్యర్థన చేశారు. దీంతో మరోసారి హిజాబ్ డిమాండ్ తెరపైకి వచ్చినట్టయింది. 


హైకోర్ట్ ఆదేశాలకు కట్టుబడాల్సిందే..

ఈ వ్యవహారంపై డిప్యూటీ కమిషనర్ డాక్టర్ రాజేంద్ర కేవీ స్పందిస్తూ.. కాలేజీ యూనిఫాంకు కట్టుబడి ఉండాలని విద్యార్థినులకు సూచించానని చెప్పారు. ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా హిజాబ్ ధరించిన విద్యార్థులను కాలేజీ యాజమాన్యం లోపలికి అనుమతించడంలేదని చెప్పారు. యూనివర్సిటీ అధికారులు హైకోర్ట్ ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నారని, విద్యా ప్రాంగణాల్లో హిజాబ్ లేదా కాషాయ వస్త్రాలు ధరించడం వల్ల శాంతికి విఘాతం కలిగే అవకాశాలున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా జిల్లా స్థాయిలో తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేయొద్దని విద్యార్థినులకు సూచించానని అధికారి రాజేంద్ర చెప్పారు. చట్టపరమైన అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని, కాలేజీ క్యాంపస్‌లో శాంతి, సామరస్యాల గురించి ఆలోచించాలని విద్యార్థినులకు సూచించానన్నారు.


ఈ విషయంపై మంగళూరు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ పీ సుబ్రమణియం యడపడితయ మాట్లాడుతూ.. హైకోర్ట్, ప్రభుత్వ ఆదేశాలకు యూనివర్సిటీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఆదేశాల అమలులో ఏ విద్యార్థికైనా సమస్య ఉంటే పరిష్కరించేందుకు తమవంతు ప్రయత్నం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - 2022-05-30T22:10:21+05:30 IST