కొనసాగుతున్న టెన్షన్

ABN , First Publish Date - 2022-02-13T17:41:41+05:30 IST

రాష్ట్రంలో హిజాబ్‌ వివాదంతో చెలరేగిన ఆందోళన సద్దుమణగలేదు. పలు విద్యా సంస్థల్లో టెన్షన్‌ కొ నసాగుతోంది. విద్యార్థులు హిజాబ్‌, కాషాయ శాలువాలతో విద్యాసంస్థలకు రాకూడదని హైకోర్టు ధర్మాసనం మధ్యంత

కొనసాగుతున్న టెన్షన్

- 16 వరకు అన్ని కళాశాలలకు సెలవులు

- పాఠశాలల వద్ద 144వ సెక్షన్‌ అమలు

- రాష్ట్రంలో మరింత జఠిలమైన హిజాబ్‌ వివాదం


బెంగళూరు: రాష్ట్రంలో హిజాబ్‌ వివాదంతో చెలరేగిన ఆందోళన సద్దుమణగలేదు. పలు విద్యా సంస్థల్లో టెన్షన్‌ కొ నసాగుతోంది. విద్యార్థులు హిజాబ్‌, కాషాయ శాలువాలతో విద్యాసంస్థలకు రాకూడదని హైకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వుల్లో ఆదేశించినా వివాదం సద్దుమణగలేదు. ఇప్పటి వరకు ఆరేడు జిల్లాల్లో వివాదం కొనసాగుతుండగా రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో నిరసనలకే పరిమితమైంది. బెంగళూరులో శనివారం చంద్రా లే అవుట్‌లోని ఓ పాఠశాలలో వివాదం తలెత్తి పెద్ద ఎత్తున ఆందోళనకు కారణమైంది. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు పాఠశాలలకు వచ్చి హిజాబ్‌ ధరిస్తే ఏమవుతుందని ప్రశ్నించడం వివాదానికి కారణమైనట్టు తెలుస్తోంది. కాగా ఏడో తరగతి క్లాస్‌ టీచర్‌ బోర్డుపై ‘క్లాస్‌ రూంలో హిజాబ్‌ ధరించరాదు’ అని రాయడం రెచ్చగొట్టేలా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ విషయమై తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకోవడం మరింత ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. పెద్ద ఎత్తున తల్లిదండ్రులు చేరుకోవడంతో పాఠశాల ప్రాంగణమంతా అట్టుడికింది. చంద్రా లే అవుట్‌ పోలీసులు స్పందించి అక్కడి నుంచి అందరినీ పంపించేశారు. హైకోర్టు మధ్యంతర ఆదేశాల ప్రకారం శుక్రవారం నుంచే విద్యాసంస్థలు యథావిధిగా పనిచేయాల్సి ఉండేది. కానీ రాష్ట్రమంతటా ఉద్రిక్తత ఉన్నందున ప్రభుత్వం విద్యాసంస్థలు తెరిచేందుకు వెనుకడుగు వేసింది. సోమవారం పదో తరగతి పాఠశాలలను తెరుస్తామని ఆ తర్వాత పీయూ తరగతులకు అవకాశం ఇస్తామని స్వయంగా ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ప్రకటించారు. అందుకు అనుగుణంగా సోమవారం పాఠశాలలు తెరుచుకోవాల్సి ఉండేది. కానీ కర్ణాటకలోనే కాకుండా దేశవ్యాప్తంగా హిజాబ్‌పై ఆందోళనలు కొనసాగుతున్నందున ప్రభుత్వం మరోసారి పునరాలోచనలో పడింది. ఈమేరకు మరోసారి సమావేశమై రాష్ట్రంలోని అన్ని కళాశాలలకు ఈ నెల 16వరకు సెలవులు ప్రకటించారు. విద్యాసంస్థలలో హిజాబ్‌ లేదా కాషాయం శాలువాలను ధరించరాదని సూచనలను ఏమేర అమలవుతాయో లేక ఆందోళనకు కారణమవుతోందనని విద్యాశాఖ ఆందోళన చెందుతోంది. ఇక సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉండే అన్ని పాఠశాలల వద్ద 144వ సెక్షన్‌ను అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని పోలీసులకు సూచించినట్టు సమాచారం. మరోవైపు శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్నందున సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య హిజాబ్‌, కాషాయం శాలువా అంశం తీవ్రమైన చర్చలకు దారితీసే అవకాశం ఉంది. 

Updated Date - 2022-02-13T17:41:41+05:30 IST