కస్టమర్‌ను హిజాబ్ తొలగించమన్న బ్యాంకు క్యాషియర్.. బీహార్‌లో రాజుకున్న వివాదం!

ABN , First Publish Date - 2022-02-22T22:16:03+05:30 IST

కొన్ని రోజులుగా కర్ణాటకలో హిజాబ్ వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తున్న సంగతి తెలిసింది.

కస్టమర్‌ను హిజాబ్ తొలగించమన్న బ్యాంకు క్యాషియర్.. బీహార్‌లో రాజుకున్న వివాదం!

కొన్ని రోజులుగా కర్ణాటకలో హిజాబ్ వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తున్న సంగతి తెలిసింది. తాజాగా ఈ వివాదం బీహార్‌కు కూడా పాకింది. బ్యాంకులో డబ్బులు తీసేందుకు వచ్చిన కస్టమర్‌ను క్యాషియర్ హిజాబ్ తొలగించమనడంతో వివాదం ప్రారంభమైంది. హిజాబ్ తొలగిస్తేనే డబ్బులు ఇస్తానని క్యాషియర్ చెప్పడం వివాదాస్పదమైంది. ఆ ఘటన మొత్తాన్ని కస్టమర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా, ఈ ఘటనపై బ్యాంకు ఉద్యోగుల స్పందన వేరే విధంగా ఉంది. 


బీహార్‌లోని బెగూసరాయ్ ప్రాంతంలో ఉన్న యూకో బ్యాంక్ బ్రాంచ్‌కు ఓ యువతి హిజాబ్ ధరించి వెళ్లింది. తన అకౌంట్ నుంచి డబ్బులు తీసుకునేందుకు క్యాషియర్ దగ్గరకు వెళ్లింది. అయితే డబ్బులు ఇచ్చే ముందు హిజాబ్ తీయాలని క్యాషియర్ ఆమెను అడిగాడు. హిజాబ్ తీయకపోతే డబ్బులు ఇవ్వలేనని తేల్చి చెప్పాడు. దీంతో ఆ యువతి, ఆమె తండ్రి సదరు ఉద్యోగితో వాగ్వాదానికి దిగారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


ఆ వీడియోపై బ్యాంకు అధికారులు స్పందించారు. ఆమెని హిజాబ్ తీయమనడం వెనుక తమ ఉద్యోగికి వేరే ఉద్దేశం లేదని, విత్ డ్రా ఫామ్‌పై ఆమె పెట్టిన సంతకం తమ సిస్టమ్‌లో ఉన్న సంతకంతో మ్యాచ్ కాలేదని, దీంతో ఆమె ఫేస్ ఐడెంటిటీ చెక్ చేసేందుకు మాత్రమే తమ ఉద్యోగి హిజాబ్ తొలగించమన్నాడని చెప్పారు. ఆ మాత్రం దానికే ఆ యువతి, ఆమె తండ్రి బ్యాంక్‌లో పెద్ద గొడవ చేశారని చెప్పారు. 

Updated Date - 2022-02-22T22:16:03+05:30 IST