Hijab కేసులో నేడు హైకోర్టు తీర్పు...కర్ణాటకలో నిషేధాజ్ఞలు

ABN , First Publish Date - 2022-03-15T12:45:53+05:30 IST

హిజాబ్ కేసులో కర్ణాటక రాష్ట్ర హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ముందుజాగ్రత్తగా రాష్ట్రవ్యాప్తంగా నిషేధాజ్ఞలు విధించింది....

Hijab కేసులో నేడు హైకోర్టు తీర్పు...కర్ణాటకలో నిషేధాజ్ఞలు

బెంగళూరు(కర్ణాటక): హిజాబ్ కేసులో కర్ణాటక రాష్ట్ర హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ముందుజాగ్రత్తగా రాష్ట్రవ్యాప్తంగా నిషేధాజ్ఞలు విధించింది. హైకోర్టు తీర్పు అనంతరం ఎలాంటి నిరసన కార్యక్రమాలు జరగకుండా బెంగళూరు నగరంలో మార్చి 15వతేదీ నుంచి వారం రోజులపాటు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 144ని విధించారు. బెంగళూరు నగరంలో ఎలాంటి నిరసన కార్యక్రమాలు లేదా సమావేశాలు అనుమతించరు.మార్చి 15న మంగళూరు, శివమొగ్గలో అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు.షెడ్యూల్ ప్రకారం వార్షిక పరీక్షలు జరుగుతాయని, అన్ని పాఠశాలలు, కళాశాలల్లో అంతర్గత పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు మంగళూరు డిప్యూటీ కమిషనర్ ప్రకటించారు.


శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లాలో నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు శివమొగ్గ డీసీ ఆర్‌ సెల్వమణి ప్రకటించారు. ఈ ఉత్తర్వు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి మార్చి 21 రాత్రి 10 గంటల వరకు అమల్లో ఉంటుంది.కర్ణాటక రాష్ట్రంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 8 బెటాలియన్ల కర్ణాటక స్టేట్ రిజర్వు పోలీసులు, 6 జిల్లా ఆర్మ్ డ్ రిజర్వు పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలను మోహరించామని శివమొగ్గ ఎస్పీ లక్ష్మీ ప్రసాద్ చెప్పారు. కబురగి, దావణగెరె, బెల్గాం, కొప్పల్, గడగ్, హాసన్ జిల్లాల్లో కూడా నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి.


Updated Date - 2022-03-15T12:45:53+05:30 IST