చిత్తూరులో హైటెన్షన్‌

ABN , First Publish Date - 2022-06-24T08:01:01+05:30 IST

చిత్తూరులో గురువారం రాత్రి హైటెన్షన్‌ నెలకొంది. గంజాయి కేసు పేరిట కటారి వర్గీయుడిని పోలీసులు తీసుకెళ్తుండగా అనుచరులతో కలిసి మాజీ మేయర్‌ హేమలత అడ్డుపడ్డారు.

చిత్తూరులో హైటెన్షన్‌
ఎమ్మెల్సీ దొరబాబు,టీడీపీ నేతలు పులివర్తి నాని పరామర్శి

మేయర్‌ దంపతుల హత్య కేసులో సాక్షులను బెదిరిస్తున్నారంటూ హేమలత ఆరోపణ

కాసేపటికల్లా గంజాయి కేసు పేరిట కటారి వర్గీయుడి అరెస్టుకు యత్నం 

అనుచరులతో కలిసి అడ్డుకున్న హేమలత 

సీఐ జీపు తగిలి మాజీ మేయర్‌ కాలికి గాయం 

చిత్తూరు, ఆంధ్రజ్యోతి/చిత్తూరు సిటీ: చిత్తూరులో గురువారం రాత్రి హైటెన్షన్‌ నెలకొంది. గంజాయి కేసు పేరిట  కటారి వర్గీయుడిని పోలీసులు తీసుకెళ్తుండగా అనుచరులతో కలిసి మాజీ మేయర్‌ హేమలత అడ్డుపడ్డారు. ఈ క్రమంలో సీఐ జీపు తగిలి ఆమె కాలికి గాయమైంది.వివరాల్లోకి వెళితే...తన అత్తమామలు, దివంగత మేయర్‌ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడైన చింటూ అనుచరులు సాక్షులను బెదిరిస్తున్నారని గురువారం సాయంత్రం మూడున్నర గంటలకు మాజీ మేయర్‌,టీడీపీ నాయకురాలు హేమలత మీడియాకు చెప్పారు. ఇందులో అధికార పార్టీకి చెందిన కొందరి పేర్లనూ ఆమె ప్రస్తావించారు.రాత్రి 10గంటలకల్లా గంజాయి కేసు పేరిట పోలీసులు రంగంలోకి దిగడం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.కటారి హేమలత అనుచరుడు, అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన సాక్షి అయిన సతీ్‌షను సంతపేటలోని అతడి ఇంటి వద్ద అదుపులోకి తీసుకునేందుకు చిత్తూరు టూ టౌన్‌ పోలీసులు సీఐ జితేంద్ర ఆధ్వర్యంలో వెళ్లారు. అయితే సతీష్‌ అప్పటికే స్నేహితుడు ప్రసన్నతో కలిసి అక్కడినుంచి వెళ్లిపోయాడు.దీంతో కటారి కుటుంబానికి ముఖ్య అనుచరుడైన ప్రసన్న తమ్ముడు పూర్ణను సంతపేటలోని ఇంట్లో పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న కటారి హేమలత, అనుచరులతో కలిసి పోలీ్‌సస్టేషన్‌ వద్దకు వెళ్లారు. ఆమె చూస్తుండగానే పోలీసులు పూర్ణను తీసుకుని మళ్లీ సంతపేటలోని ఇంటికి వెళ్లారు. హేమలత వర్గం కూడా వెంటే వెళ్లింది. పోలీసులు తమ జీపులో నుంచి ఓ మూట తీసుకుని పూర్ణ ఇంట్లో పెట్టబోయారు. గంజాయి కేసులో పూర్ణను ఇరికించి సాక్షుల్ని బెదిరించాలని పోలీసులు చేస్తున్న దుశ్చర్యగా కటారి వర్గం నిర్ధారించి ఆరోపించింది. పూర్ణ ఇంట్లో పెట్టిన మూట మరొకటి పోలీసుల జీపులోనూ ఉండటాన్ని గమనించారు. సంతపేటలోని ఇంటి నుంచి పూర్ణను మళ్లీ పోలీ్‌సస్టేషన్‌కు తీసుకెళుతుండగా అనుచరులతో కలిసి హేమలత పోలీసు జీపును అడ్డుకున్నారు. జీపు కదలకుండా ముందు వైపు ఆమె అనుచరులు, వెనుక వైపు రోడ్డు మీద హేమలత కూర్చుండిపోయారు. పరిస్థితిని అదుపులోకి తీసుకుని, నెమ్మదిగా అడుగేయాల్సిన పోలీసులు దురుసుగా ప్రవర్తించినట్లు అక్కడి వ్యక్తులు ఆరోపిస్తున్నారు. సీఐ జీపును వెనక్కి నడపడంతో హేమలత కాలికి గాయమైంది. వెంటనే ఆమెను ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. ఎమ్మెల్సీ దొరబాబు,టీడీపీ నేతలు పులివర్తి నాని, షణ్ముగంతదితరులు ఆమెను పరామర్శించారు. 


Updated Date - 2022-06-24T08:01:01+05:30 IST