సరికొత్త మాయలు.. హైటెక్ ఆట.. డబ్బుల వేట

ABN , First Publish Date - 2021-06-25T18:46:07+05:30 IST

బీటెక్‌ చదివిన పరిజ్ఞానంతో ఆన్‌లైన్‌ వ్యాపారం పేరుతో...

సరికొత్త మాయలు.. హైటెక్ ఆట.. డబ్బుల వేట

  • వ్యాపార, ధనిక వర్గాలపై నిఘా
  • అదను చూసి వల
  • చిక్కుకున్న వారు విలవిల
  • లక్షలకు లక్షలు పోగొట్టుకుంటున్న బాధితులు
  • పోలీస్‌స్టేషన్లలో పెరుగుతున్న ఫిర్యాదులు 

హైదరాబాద్ సిటీ/చాదర్‌ఘాట్‌ : బీటెక్‌ చదివిన పరిజ్ఞానంతో ఆన్‌లైన్‌ వ్యాపారం పేరుతో మోసాలు చేసేవాడు. ‘నా ఖాతాలో విదేశీ కరెన్సీ ఉంది. పన్ను కడితే డబ్బులు డ్రా చేసుకోవచ్చు. అందుకు కొంత డబ్బు కావాలి. అది ఇస్తే, పాత అప్పుతో కలిపి తీర్చేస్తా’ అంటూ ఎంట్రో పే, స్టేట్‌ బ్యాంక్‌లో బ్యాలెన్స్‌ ఉన్నట్లుగా క్రియేట్‌ చేసిన స్ర్కీన్‌ షాట్స్‌ పోస్టు చేస్తూ బాధితులను నమ్మించి డబ్బు కాజేసిన నిందితుడిని చాదర్‌ఘాట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. చాదర్‌ఘాట్‌ క్రైం ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్‌ మలక్‌పేట రేస్‌ కోర్సు రోడ్‌ మటన్‌ మార్కెట్‌ ఎదుట నివాసముంటున్న మైసారి సంతోష్‌ (30) బీటెక్‌ ద్వితీయ సంవత్సరం వరకు చదివి మానేశాడు. 


అంతకుముందు నుంచే ఇంటర్నెట్‌ జిరాక్స్‌ షాపు నడుపుతూ ఆన్‌లైన్‌ వ్యాపారాలతో మోసాలు చేయడంపై అవగాహన పొందాడు. 2017లో తండ్రి మైసారి మోహన్‌ స్నేహితుడైన హరినాథ్‌ వద్ద రూ.50 వేలు చేతి బదులుగా తీసుకున్నాడు. ఆ అప్పును తీర్చేందుకు ఆన్‌లైన్‌ బిజినెస్‌ అవతారమెత్తాడు. తాను ఆన్‌లైన్‌ బిజినెస్‌ చేస్తున్నానని, తన బ్యాంక్‌ ఖాతాలైన ఎస్‌బీఐలో, ఎంట్రో పేలో వేలాది డాలర్లు ఉన్నట్లు క్రియేట్‌ చేసి స్ర్కీన్‌షాట్‌ తీసి అప్పు ఇచ్చిన వారికి పోస్టు చేశాడు. డాలర్లు డ్రా చేసుకోడానికి టాక్స్‌ చెల్లించాలని, అందుకు మరి కొంత డబ్బు అప్పు ఇస్తే ఒకేసారి తీర్చేస్తానని నమ్మబలికేవాడు. ఇలా స్నేహితుడు హరినాథ్‌ నుంచి రూ.38 లక్షలు వసూలు చేశాడు. ఎల్‌బీనగర్‌ నివాసి సూరజ్‌ కిరణ్‌ నుంచి రూ.6 లక్షలు, ముంబాయి నివాసి ఆదిల్‌ షా నుంచి రూ.లక్షన్నర వసూలు చేశాడు. ఆ డబ్బుతో గోవాలో మూడేళ్లుగా జల్సాలు చేస్తున్నాడు. అప్పు తీర్చేందుకు సంతోష్‌ ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ కావడంతో మోసపోయానంటూ హరినాథ్‌ చాదర్‌ఘాట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన క్రైం పోలీసులు సంతోష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


బాధితులు ఇంకా ఉంటే ఫిర్యాదు చేయండి 

ఆన్‌లైన్‌ బిజినెస్‌ పేరుతో సంతోష్‌ చెప్పిన మాటలకు మోసపోయిన బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే నేరుగా చాదర్‌ఘాట్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయవచ్చని ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌ తెలిపారు. ఇతడిపై గతంలోనే చాదర్‌ఘాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రెండు కేసులు నమోదైనట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామన్నారు.


హైటెక్‌ మోసగాళ్లు ఎక్కడ డబ్బు కదలిక ఉంటే అక్కడ వాలిపోతున్నారు. వాసన పసిగట్టి వేటాడుతున్నారు. షేర్లు, వాటాలు, ఒప్పందాలు, నగదు బదిలీలు, క్రిప్టో కరెన్సీ.. ఒకటా రెండా మోసగాళ్ల వలలకు వందలాది పేర్లున్నాయి. గురి చూసి వల విసిరారా.. అవతలి వారు ఎంతటి వారైనా చిక్కుకోక తప్పదనిపిస్తోంది. ఆ వలలో విలవిలలాడాల్సిందే. తేరుకునేలోపు.. డబ్బు ఎక్కడికో  చేరిపోతోంది. 


ఈ రోజు రూ.50 వేలు ఇస్తే మర్నాడే లక్ష 

ఓఎల్‌ఎక్స్‌లో రూ.50 వేలు పెట్టుబడి పెడితే.. మరుసటి రోజే రూ.లక్ష ఇస్తానని నా కొడుకును నమ్మించాడు. డబ్బులు ఇవ్వకపోగా మాయమాటలు చెబుతూ రూ.38 లక్షల వరకు వసూలు చేశాడు. బ్యాంకులో రూ. 15 లక్షలు లోను తీసుకుని మరీ అతడికి చెల్లించాం. ఆ డబ్బు తిరిగి ఇచ్చేందుకు యాపిల్‌ ఫోన్‌ ఇవ్వాలంటూ ఒత్తిడి చేశాడు. - హరినాథ్‌, బాధితుడు


బిట్‌ కాయిన్‌, నెట్లర్‌, క్రిప్టో మోసాలు..

బిట్‌ కాయిన్‌, నెట్లర్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేశాడు. ‘అర్జెంట్‌గా రూ.50 వేలు కావాలి. నా కొడుకు సంతోష్‌ గోవాలో ఉన్నాడు.’ అని అతని తండ్రి మోహన్‌ చెప్పడంతో ఇచ్చాను. తర్వాత డబ్బులు అడిగితే నీవే సంతోష్‌ నుంచి వసూలు చేసుకోమని మోహన్‌ చేతులు దులుపుకున్నాడు. ఆ అప్పును వసూలు చేసుకునే క్రమంలో మరి కొంత సొమ్ము అతనికి ఇచ్చి మోసపోయాను. - ప్రభాకర్‌గౌడ్‌, బాధితుడు.


బంగారం, వెండి ట్రేడింగ్‌ పేరుతో టోకరా

నకిలీ వెబ్‌సైట్లను తయారు చేసి బంగారం, వెండి ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాలోని ఇద్దరు సభ్యులను రాచకొండ సైబర్‌క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు. సింగపూర్‌కు చెందిన ఫిలిప్‌ చాన్‌, ముంబైకు చెందిన విజయ్‌ చుట్లానీలు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో విక్‌టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ముంబైలో డిజీ వైలేషన్స్‌ లిమిటెడ్‌, ఈఫాన్‌గోల్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ములియా గోల్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో సంస్థలను స్థాపించారు. ఆన్‌లైన్‌లో బంగారం, వెండి షేర్లు కొనుగోలు చేస్తామంటూ ప్రచారం నిర్వహించుకున్నారు. డిజీ వైలేషన్స్‌ లిమిటెడ్‌కు ముంబైకు చెందిన మయూర్‌ శరద్‌ హర్ద్‌కర్‌ (38), ఈఫాన్‌ గోల్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు గుడ్డూ వినోద్‌శర్మలను సీఈఓలుగా నియమించారు. 


వీరిద్దరూ ఫిలిప్‌ చాన్‌, విజయ్‌ చుట్లానీ సూచనల మేరకు పలు వెబ్‌సైట్లను రూపొందించారు. బంగారం, వెండి షేర్లలో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని వాట్సాప్‌ ద్వారా ప్రచారం ప్రారంభించారు. వీరి మాటలు నమ్మి పెట్టుబడి పెట్టిన వారికి లాభాలు చూసుకోమంటూ సదరు వెబ్‌సైట్ల యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఇచ్చారు. లాభాలు వచ్చినట్లుగా వారికి వెబ్‌సైట్‌లో చూపుతున్నారు. మరింత లాభం గడించేందుకు మరింత పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. నగరానికి చెందిన ఓ వ్యక్తి వీరి మాటల గారడీలో పడి రూ. 8.50 లక్షలకు మోసపోయాడు. 


వెబ్‌సైట్‌లో లాభం వచ్చిందని గమనించి విత్‌డ్రా ఆప్షన్‌పై క్లిక్‌ చేయగా, అది పని చేయలేదు. నిర్వాహకులను సంప్రదించే ప్రయత్నం చేశాడు. ఎలాంటి సమాధానం రాకపోవడంతో మోసపోయానని గ్రహించి రాచకొండ సైబర్‌క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సాంకేతిక ఆధారాలతో ముంబైలో ఉన్న మయూర్‌ శరద్‌, గుడ్డు వినోద్‌శర్మలను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 3 సెల్‌ఫోన్లు, 2 ల్యాప్‌టా్‌పలు, 4 చెక్‌బుక్‌లు, 13 సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వచ్చిన నగదును పలు బ్యాంక్‌ ఖాతాల ద్వారా ఫిలిఫ్‌, విజయ్‌లకు అందిస్తున్నామని తెలిపారు. ఆయా బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ. 12 లక్షలను పోలీసులు ఫ్రీజ్‌ చేయించారు. 


ప్రముఖ సంస్థ ఉద్యోగులను బురిడీ కొట్టి రూ. 30 లక్షలు కొట్టేశారు..

 ప్రముఖ సంస్థ ఉద్యోగులను తప్పుదోవ పట్టించిన సైబర్‌ కేటుగాళ్లు వాళ్ల లాగిన్‌ డిటెయిల్స్‌ తీసుకుని రూ.30 లక్షలు కాజేశారు. సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం ఓ ప్రముఖ సంస్థ హిమాయత్‌నగర్‌ శాఖ అకౌంట్‌ నుంచి రూ.30 లక్షలు డెబిట్‌ అయ్యాయి. కానీ ఆ మొత్తానికి సంబంధించిన గోల్డ్‌ సంస్థకు చేరలేదు. దీనిపై సంస్థ ఉన్నతాధికారులు ఆరా తీయగా లోన్‌ ప్రాసెస్‌ చేసే ఇద్దరు ఉద్యోగుల ద్వారా డబ్బు వేరే ఖాతాలకు ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు గుర్తించారు. వారిని పిలిపించి విచారించగా ‘మాకేం తెలియదు. రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి ఫోన్‌ చేసి.. నేను హెడ్‌ ఆఫీస్‌ నుంచి మాట్లాడుతున్నా. మీ యూజర్‌ ఐడీ, పాస్‌ వర్డ్‌లు మార్చాల్సి ఉంది అని అడిగితే చెప్పాం’ అని తెలిపారు. అంతర్గత విచారణలో ఉద్యోగులు చెప్పింది నిజమేనని తేలింది. దాంతో సైబర్‌ కేటుగాళ్లే ఈ మోసానికి పాల్పడినట్లు నిర్ధారించుకున్న సంస్థ యాజమాన్యం సైబర్‌క్రైమ్స్‌లో గురువారం ఫిర్యాదు చేసింది.


ఓ సంస్థ ఎండీ నుంచి రూ. 53 లక్షలకు పైగా..

ఓ ప్రైవేట్‌ సంస్థ ఎండీని తప్పుదోవ పట్టించిన సైబర్‌ కేటుగాళ్లు రూ.53 లక్షలకు టోపీ పెట్టారు. సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం.ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం మాసబ్‌ట్యాంక్‌కు చెందిన నిమ్రా సెర్‌గ్లాస్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఎండీ ఎమ్‌ఎమ్‌.ఖాదర్‌ ఇటీవల మెటీరియల్‌ కొనుగోలు కోసం సెల్‌ బై సొల్యూషన్స్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడింగ్‌ కంపెనీ సంస్థను సంప్రదించాడు. 97,250 డాలర్లకు ఒప్పందం కుదిరింది. అగ్రిమెంట్‌ ప్రకారం ముందుగానే 30 శాతం  డబ్బులు చెల్లించాల్సి రావడంతో సంస్థ ఇచ్చిన చైనాకు చెందిన బ్యాంకు ఖాతాకు 29,250 డాలర్లు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు.


ఇంతలో ఒక వ్యక్తి ఫోన్‌ చేసి ‘నేను సెల్‌ బై సొల్యూషన్స్‌ అధికారిని. మిగతా మొత్తాన్ని లండన్‌కు చెందిన హెచ్‌ఎస్‌బీసీలో ఉన్న వేరే ఖాతాకు ట్రాన్స్‌ఫర్‌ చేయండి. అఫీషియల్‌ ఈ-మెయిల్‌ నుంచి బ్యాంకు అకౌంట్‌, కోడ్‌ తదితర వివరాలు పంపిస్తున్నా’ అని చెప్పాడు. ఈ-మెయిల్‌ను చూసుకుని అందులో ఉన్న లండన్‌ హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు అకౌంట్‌కు ఖాదర్‌ రూ.53 లక్షలా 23 వేలు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. అనంతరం సంస్థ అధికారులకు ఫోన్‌ చేయడంతో అసలు విషయం బయటపడింది. తమకు హెచ్‌ఎస్‌బీసీలో అకౌంట్‌ లేదని, తాము ఎలాంటి ఈ-మెయిల్‌ చేయలేదని సంస్థ ప్రతినిధులు చెప్పడంతో ఖాదర్‌ అవాక్కయ్యారు. మోసపోయానని గ్రహించి గురువారం సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాడు.

Updated Date - 2021-06-25T18:46:07+05:30 IST