Omni buses: అధిక ఛార్జీలకు బ్రేక్‌

ABN , First Publish Date - 2022-10-02T15:09:42+05:30 IST

పండుగ సెలవుల సందర్భంగా ఆమ్నీ బస్సుల్లో(Omni buses) మూడింతలు పెంచిన ఛార్జీలకు కళ్లెం పడింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శివశంక

Omni buses: అధిక ఛార్జీలకు బ్రేక్‌

                       - మంత్రి జోక్యంతో ఆమ్మీ బస్సుల్లో తగ్గింపు


 చెన్నై, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): పండుగ సెలవుల సందర్భంగా ఆమ్నీ బస్సుల్లో(Omni buses) మూడింతలు పెంచిన ఛార్జీలకు కళ్లెం పడింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శివశంకర్‌ జోక్యం చేసుకుని ఆమ్నీ బస్సుల యజమానుల సంఘం ప్రతినిధులతో చర్చించడంతో బస్‌ ఛార్జీలను తగ్గించేందుకు వారు అంగీకరించారు. శనివారం నుంచి ఈ కొత్త ఛార్జీలు అమలులోకి వచ్చాయి. గత వారం రోజులుగా నగరం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ఆమ్నీ బస్సుల్లో మూడింతల ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావటంతో మంత్రి శివశంకర్‌ రంగంలోకి దిగి ఆ బస్సుల యజమానులతో సంప్రదింపులు జరిపారు. అధిక ఛార్జీ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో ఆమ్నీ బస్సుల యజమానుల సంఘం ప్రతినిధులు మంత్రితో చర్చలకు సిద్ధమయ్యారు. ఆ మేరకు మంత్రి శివశంకర్‌ అధ్యక్షతన ఆ సంఘం ప్రతినిధులు  శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పండుగ సమయాల్లో ఆమ్నీ బస్‌ ఛార్జీలను విపరీతంగా పెంచడం భావ్యం కాదని, సీజన్‌ రద్దీ దృష్ట్యా కొద్దిగా ఛార్జీలను పెంచడం సమంజసంగా ఉంటుందన్నారు. ఈ చర్చల పర్యవసానంగా ఆమ్నీ బస్సు ఛార్జీలను తగ్గించేందుకు బస్సుల యజమానుల సంఘం ప్రతినిధులు అంగీకరించారు. ఆ మేరకు కోయంబత్తూరు, తంజావూరు, మదురై, చిదంబరం, పుదుచ్చేరి, ఊటీ, సేలం, తిరుచ్చి(Coimbatore, Thanjavur, Madurai, Chidambaram, Puducherry, Ooty, Salem, Tiruchi) తదితర నగరాలకు సాధారణ రోజుల్లో ఛార్జీ కంటే కొద్దిగా పెంచారు. ఆ మేరకు కోయంబత్తూరుకు నాన్‌ఏసీ బస్సులో రూ.1815లు, ఏసీ బస్సులో రూ.2200లు ఛార్జీగా నిర్ణయించారు. ఇదే విధంగా మదురైకి రూ.1776లు, ఏసీ బస్సులో రూ.2112లు, తిరుప్పూరుకు నాన్‌ఏసీ రూ.1776లు, ఏసీ రూ.2112ల ఛార్జీ నిర్ణయించారు. తంజావూరుకు నాన్‌ఏసీ రూ.1435లు, ఏసీ బస్సులోరూ.1575లు, చిదంబరానికి నాన్‌ఏసీ చార్జి రూ.990లు, ఏసీ రూ.1075లు, ఊటీకి నాన్‌ఏసీ బస్సులో రూ.1881లు, ఏసీ బస్సులో రూ.2280లుగా ఛార్జీలుగా వసూలు చేయనున్నారు.

Updated Date - 2022-10-02T15:09:42+05:30 IST