ఏలేరు ప్రాజెక్టులో ప్రమాదకర స్థాయికి నీటి నిల్వలు

ABN , First Publish Date - 2021-12-04T05:55:34+05:30 IST

పరీవాహక ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఏలేరు రిజర్వాయర్‌లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. నీటి నిల్వలు గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ప్రాజెక్టు నుంచి అదనపు జలాల విడుదలను కొనసాగిస్తున్నారు

ఏలేరు ప్రాజెక్టులో ప్రమాదకర స్థాయికి నీటి నిల్వలు
ఏలేరు స్పిల్‌వే రెగ్యులేటర్‌ విభాగం వద్ద గరిష్ఠ స్థాయి నీటి నిల్వలు

  • స్పిల్‌వే రెగ్యులేటర్‌ క్రస్ట్‌ గేటు ద్వారా దిగువకు అదనపు జాలాల విడుదల
  • దిగువ ప్రాంత మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ

ఏలేశ్వరం, డిసెంబరు 3: పరీవాహక ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఏలేరు రిజర్వాయర్‌లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. నీటి నిల్వలు గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ప్రాజెక్టు నుంచి అదనపు జలాల విడుదలను కొనసాగిస్తున్నారు. శుక్రవారం తూర్పు, విశాఖ ఏజెన్సీ కొండల ప్రాంతాల నుంచి 600 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో 86.56 మీటర్ల స్థాయిలో 24.11 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం కలిగిన రిజర్వాయర్‌లో ప్రస్తుతం నీటి నిల్వలు 85.94 మీటర్ల స్థాయిలో 22.84 టీఎంసీలకు చేరుకున్నాయి. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో పాటు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో స్పిల్‌వే రెగ్యులేటర్‌ విభాగం వద్ద క్రస్ట్‌ గేటును పైకి ఎత్తిన అధికారులు దిగువకు 1,000 క్యూసెక్కుల అదనపు జలాలు విడుదల చేశారు. ఏలేరు జలాశయం ఏఈ పట్టాభిరామయ్యచౌదరి, డీఈ ఆనంద్‌కుమార్‌ నేతృత్వంలో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టు వద్ద రక్షణ చర్యలు ప్రారంభించారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటి ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు వద్ద నీటిమట్టాన్ని 86 మీటర్ల స్థాయి వరకు ఉంచి ఆపై ఎప్పటికప్పుడు మిగులు జలాలను దిగువకు విడిచిపెట్టేలా అధికారులు కార్యాచరణ చేపట్టారు. కేవలం విశాఖ నగరానికి 50 క్యూసెక్కులు మాత్రమే నీటిని విడుదల చేస్తూ పంపా జలాశయం, తిమ్మరాజు చెరువులకు తాత్కాలికంగా నీటి సరఫరా నిలిపివేశారు. అదనపు జలాల విడుదల దృష్ట్యా ఆయా మండలాల ప్రజలను అప్రమత్తం చేయాల్సిందిగా రెవెన్యూ అధికారులకు ఇరిగేషన్‌ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2021-12-04T05:55:34+05:30 IST